సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
55వ ఇఫీ చిత్రోత్సవ ‘కంట్రీ ఫోకస్’ విభాగంలో ఆస్ట్రేలియా చిత్రం
“ఫోర్స్ ఆఫ్ నేచర్: ది డ్రై 2” ప్రదర్శన
భారతీయ సినిమారంగం ప్రపంచ వారధిగా నిలుస్తోందన్న ఆస్ట్రేలియా దర్శకుడు రాబర్ట్ కనోలీ: ప్రపంచ కథలకు వేదికగా ఇఫీ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంస
ఆస్ట్రేలియా చలనచిత్ర రంగం ఆధునికతను, చైతన్యాన్ని పట్టి చూపే ‘కంట్రీ ఫోకస్’ విభాగంలో, “ఫోర్స్ ఆఫ్ నేచర్: ది డ్రై 2” చిత్రాన్ని 55వ ఇఫీలో ప్రత్యేక చిత్రంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత రాబర్ట్ కనోలీ ఈ రోజు గోవాలో పాత్రికేయులతో ముచ్చటించారు.
నగరానికి దూరంగా, మారుమూల అటవీ ప్రాంతంలో ఏర్పాటైన ప్రత్యేక వాణిజ్య విహారయాత్రకు ఐదుగురు మహిళా వ్యాపారవేత్తలు హాజరవుతారు. అయితే నలుగురే వెనక్కి తిరిగి వస్తారు. తప్పిపోయిన హైకర్ గతి ఏమైందో తెలుసుకునేందుకు ఫెడరల్ పోలీస్ ఏజెంట్ ఆరోన్ ఫాక్ పరిశోధన మొదలుపెడతాడు. అన్వేషణలో ఉన్న అతడిలో ఆ అడవి దారులు బాల్యపు స్మృతులను తట్టిలేపుతాయి. ఒకవంక ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జ్ఞాపకాలు, మరో వంక తప్పిపోయిన మహిళ మిస్టరీ ఛేదన అతడిని కుదిపేస్తూ ఉంటాయి.
న్యాయం, కుటుంబం పట్ల అంకిత భావం, గతం తాలూకా గాయాలు వంటి అంశాలను తెరకెక్కించిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. గ్రామీణ ఆస్ట్రేలియా దేశపు కఠినతరమైన నైసర్గిక పరిస్థితులు, అసాధారణ వ్యక్తిత్వాల కథను కలగలుపుతూ, తప్పిపోయిన వ్యక్తిని కనుగొనేందుకు చేపట్టిన పరిశోధనను దర్శకుడు బిగి సడలని థ్రిల్లర్ కథగా మలిచారు.
చిత్రదర్శకుడు రాబర్ట్ కనోలీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భారతీయ చలనచిత్ర రంగం పట్ల ఆరాధనను వెల్లడించారు. “మేము చూసే సినిమాల ద్వారా భారతదేశాన్ని గురించి తెలుసుకుంటాం. ఈరోజు కిక్కిరిసిన భారతీయ ప్రేక్షకుల ముందు నా చిత్రం ప్రదర్శించడం ఆనందాన్నిస్తోంది” అని అన్నారు. తన చిత్రాల్లో ప్రకృతి దృశ్యాలు ఎంతో కీలకమైనవని, వాటిని కూడా ప్రత్యేక పాత్రలుగా భావించవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా కనోలీ తెలియజేశారు. అర్ధవంతమైన సినిమాల రూపకల్పనలో ప్రకృతి దృశ్యాలు ముఖ్యమైనవని, అవి ప్రేక్షకులపై కలిగించే ప్రభావాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ప్రపంచాన్ని కలవరపెడుతున్న వాతావరణ మార్పుల గురించి సినిమాలు రావలసిన అవసరం గురించి మాట్లాడుతూ, “ఈ అంశాన్ని విస్మరించలేం. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న వారు వాతావరణ మార్పులు ప్రధానాంశంగా చిత్రాలను నిర్మించాలి” అని కనోలీ అభిప్రాయపడ్డారు.
భారతీయ చలన చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందని, ఆస్ట్రేలియాలో కూడా భారతీయ చిత్రాలకు ఎంతో ప్రజాదరణ ఉందని చెప్పారు. ఇఫీ గురించి ప్రస్తావిస్తూ... “ప్రపంచ కథలను చూపే వేదికగా ఇఫీ కీలక పాత్ర పోషిస్తోంది” అంటూ కనోలీ ప్రశంసించారు.
* * *
(Release ID: 2076925)
Visitor Counter : 22