జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భూగర్భ జలాల అనుమతుల కోసం ‘‘భూ- నీర్’’ పోర్టల్ ను ప్రారంభించిన జల్ శక్తి మంత్రి


అందుబాటులోకి పాన్ ఆధారిత ఐడీ వ్యవస్థ, క్యూఆర్ కోడ్ తో ఎన్వోసీ

సంప్రదాయబద్ధంగా ముగిసిన 2024 ఇండియా వాటర్ వీక్

Posted On: 20 NOV 2024 11:59AM by PIB Hyderabad

 

ఈ ఏటి ఇండియా వాటర్ వీక్ ముగింపు ఉత్సవం సందర్భంగా ‘‘భూ-నీర్’’ పోర్టల్ ను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖా మంత్రి శ్రీ సీ ఆర్ పాటిల్ 2024 సెప్టెంబరు 19వ తేదీన ప్రారంభించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ కేంద్ర (ఎన్ఐసీ) సహకారంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర భూగర్భ జలాల ప్రాధికార సంస్థ (సీజీడబ్ల్యూఏ) ఈ వెబ్ సైటును రూపొందించింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల వాడకాన్ని మరింత పకడ్బందీగా నియంత్రించే ఉద్దేశంతో దీనిని ప్రతిపాదించారు. భూగర్భ జలాల యాజమాన్యం, నియంత్రణ అంశాలు ఇక నుంచీ పూర్తిగా ఈ పోర్టల్ పరిధిలోకి వస్తాయి. భూగర్భజలాల వాడకంలో పారదర్శకత, నైపుణ్యం, మనుగడ అన్న అంశాలకు ఇక ముందు ప్రాధాన్యం ఏర్పడుతుంది.


భూగర్భజలాల వాడకం, నియంత్రణల పరంగా రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ పరిధిలో- చట్ట పరిధిని నిర్ణయించడం భూ-నీర్ వల్ల సుసాధ్యం అవుతుంది. పోర్టల్ అందించే కేంద్రీకృత సమాచార వ్యవస్థ కారణంగా వినియోగదారులకు భూగర్భ జలాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, ప్రభుత్వ విధానం, సహేతుకమైన వాడకం ఎలా ఉండాలి... వంటి అంశాలు అందుబాటులోకి వస్తాయి. వినియోగదారులకు ఇబ్బందిలేని విధానంలోనే ఈ పోర్టల్ ను తయారు చేశారు. భూగర్భ జలాలను వాడుకోదలచిన వారికి చెందిన ప్రతిపాదిత ప్రాజెక్టులు… క్రమానుగతికంగా లభించే అనుమతులూ ఇందులో కనిపిస్తాయి. పాన్ ఆధారిత ఐడీ వ్యవస్థ, క్యూఆర్ కోడ్ తో కూడిన ఎన్వోసీ... వంటి సులభతరమైన పద్ధతులను ప్రవేశపెట్టారు. ఎన్వోసీఏపీ పేరుతో ఇంతకు ముందున్న వ్యవస్థ కంటే, భూ-నీర్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది.


వ్యాపార నియంత్రణల సరళీకరణలో భాగంగా- భూగర్భజలాల నియంత్రణ మానవ రహిత, ఇబ్బందుల్లేని వ్యవస్థగా ఉండాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగానే ఈ ‘‘భూ-నీర్’’ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చారు.


పోర్టల్ ఇప్పుటి నుంచీ ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రాజక్టులను ప్రతిపాదించే వారు.. భూగర్భ జలాల వాడకానికి సంబంధించిన సమాచారం కోసం, దరఖాస్తు స్థితిని తెలుసుకునేందుకూ, చట్టపరమైన రుసుముల చెల్లింపుల కోసం ఈ పోర్టల్ ను సందర్శించవచ్చు.
 

***


(Release ID: 2075023) Visitor Counter : 17