ప్రధాన మంత్రి కార్యాలయం
ఇటలీ-ఇండియా ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029
Posted On:
19 NOV 2024 9:25AM by PIB Hyderabad
శక్తిమంతమైన ఇండియా-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉమ్మడి కార్యాచరణ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ నిర్ణయించారు. నవంబరు 18న బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జరిగిన జీ-20 సమావేశానికి హాజరైన సందర్భంగా వారిరువురూ భేటీ అయ్యారు. మరింత స్పష్టతతో, నిర్ణీత సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావించారు. ఇందుకోసం వారు వ్యూహాత్మక కార్యాచరణకు రూపకల్పన చేశారు.
I. రాజకీయ చర్చలు
a. బహుళ స్థాయి కార్యక్రమాలకు తోడు, తరచూ ఇరుదేశాల- దేశాధినేతలు, విదేశాంగ మంత్రులు, వాణిజ్యం, రక్షణ స్థాయుల్లో సమావేశాలూ పరస్పర పర్యటనలు క్రమం తప్పకుండా కొనసాగించాలి.
b. ఉత్తరప్రత్యుత్తరాలతోపాటు ఇరుదేశాల విదేశాంగ శాఖ సీనియర్ అధికారుల స్థాయిలో వార్షిక ద్వైపాక్షిక సమావేశాలను కొనసాగించాలి.
c. ఉభయుల అవసరాల ప్రాతిపదికగా మంత్రిత్వ శాఖల అధిపతుల స్థాయిలో సమావేశాల సంఖ్యను పెంచడం ద్వారా మరింత సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి.
II. ఆర్ధిక సహకారం, పెట్టుబడులు
a. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకునేందుకూ, మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకూ, పెట్టుబడుల దిశగా... ఆహారశుద్ధిపై ఏర్పాటు చేసిన ఇటలీ-ఇండియా ఉమ్మడి కార్యాచరణ బృందం, ఆర్థిక సహకారంపై ఏర్పాటు చేసిన ఉమ్మడి కమిషన్లకు మరింత సహకారాన్ని అందించాలి. రవాణా, వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలు, రసాయన-ఔషధాల తయారీ, కలప, కలపతో చేసిన సామగ్రి, కొత్త సాంకేతికత రంగం, ఆహార శుద్ధి, ప్యాకేజింగ్, కోల్డ్ చెయిన్, పర్యావరణ హిత సాంకేతికతలు, లాభదాయక రవాణా రంగం, ఉమ్మడి తయారీ రంగం, పెద్ద కంపెనీలతో జాయింట్ వెంచర్లు, ఎస్ఎంఈలూ… అంశాలపై దృష్టిపెట్టాలి.
b. వాణిజ్య సంఘాలు, పరిశ్రమ, ఆర్థిక సంఘాలను భాగస్వాములుగా చేయడం ద్వారా వాణిజ్య ప్రదర్శనలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించాలి.
c. ఆటోమోటివ్ పరిశ్రమ, సెమీకండక్టర్లు, మౌలిక సదుపాయలు, ఆధునిక తయారీ రంగాల్లో- పరిశ్రమ స్థాయిలో భాగస్వామ్యాలు, సాంకేతిక కేంద్రాల ఏర్పాటు, పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించాలి.
III. అనుసంధానత
a. పర్యావరణహితపరమైన రవాణా అంశాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలి.
b. ఇండియా-మధ్యప్రాచ్యం- ఐరోపా ఆర్ధిక కారిడార్ (ఐఎంఈఈసీ) పరిధిలో- నౌకా వాణిజ్యం, భూతల మౌలిక సదుపాయాల దిశగా సహకారాన్ని పెంపొందించాలి. నౌకా వాణిజ్యం, నౌకాశ్రయాల పరంగా ఏర్పాటు చేసుకోదలచిన ఒప్పందాన్ని పూర్తి చేయాలి.
IV. శాస్త్ర సాంకేతిక రంగం, ఐటీ, ఆవిష్కరణలు, అంకుర సంస్థలు
a. టెలికం, కృత్రిమ మేధ, సేవల డిజటలీకరణ అంశాల్లో… ఇరుదేశాల్లో కీలకమైన, ఆధునిక సాంకేతికతల విషయంలో సహకరించుకోవడం, సాంకేతికంగా ఉన్నతమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం.
b. పరిశ్రమ 4.0 లో… ఇరుదేశాల్లోనూ సహకారానికి కొత్త మార్గాల అన్వేషణ, అత్యాధునిక తయారీ ప్రక్రియలు, హరిత ఇంధనం, కీలక ఖనిజాల అన్వేషణ, కీలక ఖనిజాల శుద్ధి, విద్యాసంస్థలను, పరిశ్రమలను భాగస్వాములుగా చేయడం, ఎస్ఎంఈలనూ, అంకుర సంస్థలను కూడా భాగస్వాములుగా చేయడం.
c. ఇండో-పసిఫిక్ సముద్రాల కార్యాచరణ (ఐపీఓఐ) పరిధిలో ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని భారత, ఇటలీ దేశాల్లో పరిశోధనా ప్రాథమ్యాలను గుర్తించడం, ఆవిష్కరణలకు ప్రోత్సాహాన్ని అందించడం, పరిశోధన పరంగా సంయుక్తంగా కలిసి పనిచేయడం.
d. విద్యాపరంగా, పరిశోధనల పరంగా- స్టెమ్ పరిధిలో పరిశోధనావకాశాలను గుర్తించడం, స్కాలర్ షిప్పులకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, ప్రధాన శాస్త్ర సాంకేతిక సంస్థలు సంయుక్తంగా కలిసి పరిశోధనలు చేయడం, ఉమ్మడి ప్రాజెక్టులపై దృష్టి సారించడం.
e. ఫిన్ టెక్, ఎడ్యుటెక్, ఆరోగ్య రంగాలు, రవాణా వ్యవస్థలు, సరఫరా వ్యవస్థలు, ఆగ్రిటెక్, చిప్ డిజైన్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అంకుర సంస్థల మధ్య సమన్వయం, ఇరుదేశాల్లోనూ ఆవిష్కరణ అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం.
f. ఇండో- ఇటాలియన్ ఆవిష్కరణలకు కార్యాచరణను ప్రారంభించడం, ఆవిష్కరణలకు దారితీసే ప్రాథమిక క్రియలను ప్రోత్సహించడం, ఉమ్మడి నైపుణ్యాలను ఇచ్చిపుచ్చుకోవడం, విద్యాసంస్థలు-పరిశోధనా సంస్థల్లో ఇంక్యుబేషన్ వాతావరణాన్ని కల్పించడం.
g. సహకారానికి సంబంధించి ఇప్పటి వరకూ జరిగిన ప్రయాణాన్ని గుర్తిస్తూనే, కొత్తగా ఏర్పాటు చేసుకునే ద్వైపాక్షిక సంబంధాల ద్వారా సహకార కార్యక్రమాలను బలోపేతం చేయడం.
h. 2025-27 సంవత్సరాల్లో శాస్త్ర సాంకేతిక సహకారానికి సంబంధించిన కార్యక్రమాలను అమలు చేయడం. రెండు దేశాల్లో నిర్వహించడానికి వీలైన కీలకమైన పరిశోధనా ప్రాజెక్టుల ద్వారా దీనిని రానున్న ఏడాదిలోనే అమల్లోకి తేవడం.
V. అంతరిక్ష రంగం
a. చంద్రుడికి సంబంధించిన సైన్సుకి ప్రథమ ప్రాథమ్యం ఇస్తూ... భూ పరిశీలన, హీలియో ఫిజిక్స్, అంతరిక్ష పరిశోధనల రంగంలో ఇటలీ అంతరిక్ష సంస్థ (ఏఎస్ఐ), ఇస్రోల మధ్య సహకారాన్ని విస్తృతం చేయాలి.
b. అంతరిక్ష ప్రాంతాన్ని శాంతి ప్రయోజనాలకు ఉపయోగించుకునే దిశగా- దృక్కోణం, పరిశోధన, అభివృద్ధి అంశాల్లో సహకారం.
c. పెద్ద పెద్ద పరిశ్రమలను, ఎంఎస్ఎంఈలను, అంకుర సంస్థలనూ భాగస్వాములుగా చేయడం ద్వారా వాణిజ్య అంతరిక్ష ప్రాజక్టుల విషయంలో ఉభయతారకంగా ఉండే వాటిని గుర్తించడం, వాటిని కార్యాచరణ దిశగా నడిపించడం.
d. వాణిజ్య భాగస్వామ్యం, పరిశోధనలు, అంతరిక్ష పరిశోధనల దృష్టితో ఇటలీ అంతరిక్ష పరిశ్రమకు చెందిన ప్రతినిధులను 2025 మధ్య ప్రాంతంలో భారతదేశానికి తీసుకుని రావడం.
VI. ఇంధనాల మార్పు
a. ఇరుదేశాల్లోని పరిశ్రమలకు చెందిన వాతావరణానికి సంబంధించిన అవగాహనను ప్రోత్సహించడం, సాంకేతిక సదస్సుల ద్వారా మంచి ఆచరణలనూ, అనుభవాలనూ పరస్పరం పంచుకోవడం, తద్వారా పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలను ఏర్పరచడం.
b. సాంకేతికపరంగా ఆధునికతకు పెద్దపీట వేయడం, పరిశోధన అభివృద్ధిపరంగా కలిసి పనిచేయడం.
c. గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలు, పునరుత్పాదనలు, వృధాలేని ఇంధన వినియోగం వంటి అంశాలపరంగా సహకరించుకునేందుకు- సంప్రదాయేతర ఇంధనంపై ఏర్పాటు చేసిన ఉమ్మడి కార్యాచరణ బృందాన్ని మరింత క్రియాశీలం చేయడం.
d. ప్రపంచ జీవ ఇంధనాల సమాఖ్య, ఇంటర్నేషనల్ సొలార్ సమాఖ్యలను బలోపేతం చేసే దిశగా కలిసి పనిచేయడం.
e. సంప్రదాయేతర ఇంధనానికి సంబంధించిన ఆధునిక గ్రిడ్ ను ఏర్పాటు చేసేందుకు, నియంత్రణకూ అవసరమైన పరిష్కార మార్గాలకు చెందిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం.
VII. రక్షణ రంగంలో సహకారం
a. ఉమ్మడి రక్షణ సంప్రదింపుల (జేడీసీ) సమావేశాలను, ఉమ్మడి సైనికాధికారుల చర్చలనూ ప్రతి ఏటా తప్పకుండా జరిగేలా చూడటం. తద్వారా సమచార వినిమయం, పరస్పర సందర్శనలు, శిక్షణ కార్యక్రమాలపై సహకరించుకోవడం.
b. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇటలీకి పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ఉభయులకు చెందిన ఆర్మీల మధ్య సంబంధాలను ఆహ్వానించడం. రక్షణ విషయంలో పరస్పరం కలిసి పనిచేయడం, సహకరించుకోవడం, ఇందుకు సంబంధించిన అంశాల్లో సంప్రదింపులు నిర్వహించడం.
c. రక్షణ రంగ వేదికలు, పరికరాల్లో సాంకేతిక సహకారం, ఉమ్మడి ఉత్పాదన, అభివృద్ధి దిశగా పబ్లిక్- ప్రైవేటు భాగస్వాముల మధ్య సహకారం పెంపొందించే అవకాశాలను పరిశీలించడం.
d. నౌకా వాణిజ్యం సహా సముద్రాల్లో ఎదురయ్యే కాలుష్యపరమైన సమస్యలకు శీఘ్రతర పరిష్కారాలు, అన్వేషణ, విపత్తు సహాయాల్లో సహకారం పెంపు.
e. ఇరుదేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య రక్షణ పరిశ్రమల రంగానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, భారత రక్షణ ఉత్పత్తిదారులు (ఎస్ఐడీఎం), ఇటలీ విమానయాన, రక్షణ, భద్రత పరిశ్రమల సమాఖ్య (ఏఐఏడీ) ల మధ్య అవగాహన ఒప్పందం కోసం కృషి.
f. ఇరుదేశాల శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల మధ్య రక్షణ పరిశోధనల సమావేశాల ఏర్పాటు.
VIII. భద్రతారంగంలో సహకారం
a. సైబర్ సెక్యూరిటీ, సైబర్‌క్రైమ్‌ల వంటి ప్రత్యేక రంగాల్లో వ్యూహాల వినిమయం, సామర్థ్యాల పెంపు ద్వారా భద్రతా సహకారం పటిష్ఠపరచడం.
b. సైబర్ రంగం వంటి రంగాలకు సంబంధించి ప్రత్యేక చర్చలు చేపట్టడం… విధానాల్లో మార్పులు, ఉత్తమ పద్ధతులు, శిక్షణా కార్యక్రమాల గురించిన తాజా సమాచార మార్పిడి… అవసరాల మేరకు బహుముఖ వేదికల్లో సహకారం గురించి చర్చలు.
c. అంతర్జాతీయ ఉగ్రవాదం, నేరాలకు వ్యతిరేకంగా పనిచేసే ఉమ్మడి కార్యాచరణ బృందం ద్వైపాక్షిక వార్షిక సమావేశాలను క్రమం తప్పక నిర్వహించడం.
d. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై జరిపే పోరులో మరింత సహకారం కోసం కృషి. సహకార స్ఫూర్తి ప్రాతిపదికగా:
i. శిక్షణా కార్యక్రమాల ద్వారా న్యాయపరమైన అంశాలు, ఇరుదేశాల పోలీసు దళాలు, భద్రతా సిబ్బంది మధ్య సహకారం పెంపు.
ii. ఉగ్రవాద వ్యతిరేక పోరులో సమాచారాన్ని పంచుకోవడం, ఉత్తమ పద్ధతుల వ్యూహాల మార్పిడి.
e. పరస్పర భద్రత, రహస్య సమాచార మార్పిడులకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం.
IX. వలసలు, అనుసంధానం
a. వలసలు న్యాయబద్ధంగా, సురక్షితంగా జరిగేందుకు అవసరమైన వ్యవస్థల ఏర్పాటు, కార్మికుల శిక్షణ, నియామకాల్లో పారదర్శకత. ప్రయోగాత్మకంగా చేపట్టబోయే ప్రాజెక్టులో వైద్య సిబ్బందికి భారత్ లో శిక్షణ, తదనంతరం ఇటలీలో ఉపాధి కల్పన.
b. పరస్పర సహకారం ద్వారా అక్రమ వలసల నిరోధానికి కృషి.
c. ఉన్నత విద్యాసంస్థల పాలన యంత్రాంగాల మధ్య ఒప్పందాల ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తల రాకపోకలను పెంచడం.
X. సంస్కృతి, విద్య, సినిమా, పర్యాటక రంగాలు సహా ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాలు
a. ఇరుదేశాల విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం పెంపు, కార్యక్రమాల ఏర్పాటు. సాంకేతిక, వృత్తి శిక్షణల్లో సహకారం.
b. మ్యూజియంల మధ్య భాగస్వామ్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనల ద్వారా ఇరుదేశాల మధ్య సాంస్కృతిక అవగాహన పెంపు.
c. ఉమ్మడి ప్రాజెక్టులు, ఇరుదేశాల్లో సినిమా రంగానికి ప్రోత్సాహం.
d. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద పరిరక్షణ, పునరుద్ధరణల్లో పరస్పర సహకారం పెంపు.
e. అన్ని రంగాల్లో సంబంధాల బలోపేతం, పర్యాటకానికి పెద్దఎత్తున ప్రోత్సాహం.
f. ఇరుదేశాల మధ్య చిరకాలంగా నెలకొన్న సాంస్కృతిక బంధాలు, స్నేహ సంబంధాలను నిలిపి ఉంచడంలో భారత, ఇటలీ పౌరుల పాత్రను గుర్తించడం.
g. 2023లో కుదిరిన సాంస్కృతిక సహకార బృహత్ ప్రణాళిక అమలు దిశగా కృషి.
***
(Release ID: 2074847)
Visitor Counter : 42
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam