సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పాత్రికేయ ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటలపాటు పొడిగించిన ఇఫీ 2024
ప్రజలకు సినిమా ఆనందాన్ని అందించే దిశగా పెద్ద ఎత్తున మీడియా భాగస్వామ్యానికి ప్రయత్నం
పాత్రికేయుల నుంచి పెద్ద మొత్తంలో వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని 55వ భారత అంతర్జాతీయ చలనచిత్ర వేడుక (ఇఫీ)లకు ఎక్కువ సంఖ్యలో పాత్రికేయులు హాజరయ్యేందుకు వీలుగా వారి కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరో రోజు పొడిగించారు. 14 నవంబర్ 2024 సాయంత్రం 5:00:00 గంటల నుంచి 15 నవంబర్ 2024 సాయంత్రం 04:59:59 (భారత కాలమానం) వరకు అంటే 24 గంటల పాటు రిజిష్ట్రేషన్లు కొనసాగుతాయి. ఇప్పటి వరకు నమోదు చేసుకోని మీడియా ప్రతినిధులకు రిజిస్టర్ చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం. కాబట్టి గడువు ముగిసేలోగా పాత్రికేయులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ అవకాశాన్ని కోల్పోవద్దని సూచన.
నమోదు ప్రక్రియ
మీడియా ప్రతినిధిగా రిజిస్టర్ చేసుకోవడానికి జనవరి 1, 2024 నాటికి 21 ఏళ్లు నిండి, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ లేదా ఆన్ లైన్ మీడియా సంస్థల్లో కరస్పాండెంట్, ఫొటోగ్రాఫర్, కెమెరా పర్సన్ లేదా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా పనిచేస్తూ ఉండాలి. వయస్సుపరంగా అర్హతలు కలిగిన ఫ్రీలాన్స్ జర్నలిస్టులు సైతం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పూర్తి అర్హతల కోసం ఇక్కడ చదవండి. అవసరమైన పత్రాలన్నింటినీ ముందే సిద్ధం చేసుకొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రారంభించండి. https://my.iffigoa.org/media-login ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
మీ దరఖాస్తును పరిశీలించిన అనంతరం మీడియా ప్రతినిధిగా అక్రిడేషన్ ఆమోదించి మీ రిజిస్టర్ ఈ-మెయిల్ ఐడీ ద్వారా తెలియజేస్తారు. పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ద్వారా గుర్తింపు పొందిన పాత్రికేయులు మాత్రమే 55వ ఇఫీ 2024 మీడియా ప్రతినిధుల పాసులు పొందడానికి అర్హులు. మీడియా సంస్థల కాలవ్యవధి, పరిమాణం (సర్య్కులేషన్, పాఠకులు, రీచ్), సినిమాలు, ఇఫీ వార్తల ప్రచురణకు ఇచ్చే ప్రాధాన్యం తదితర అంశాల ఆధారంగా పాత్రికేయ సంస్థకు ఇచ్చే అక్రిడిటేషన్ల సంఖ్యను పీఐబీ నిర్ణయిస్తుంది.
అక్రిడిటేషన్ పొందిన మీడియా ప్రతినిధులు తమ పాసులను ఈ నెల 18వ తేదీ నుంచి ఇఫీ వేదిక వద్ద తీసుకోవచ్చు. ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే iffi4pib[at]gmail[dot]com కు ‘మీడియా అక్రెడిటేషన్ విచారణ’ అనే సబ్జెక్టుతో మెయిల్ చేయండి.
https://my.iffigoa.org/media-login వద్ద రిజిస్టర్ చేసుకోండి. సినిమా ఆనందాన్ని పంచుకోవడానికి మిమ్మల్ని మేం ఆహ్వానిస్తున్నాం.
సినిమాల్లో కలుద్దాం!
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఆసియాలో జరిగే ప్రధాన చలన చిత్రోత్సవాలలో ఒకటి. ఇఫీ ఆరంభమైన నాటి నుంచే చలనచిత్రాలు, కట్టిపడేసే చిత్ర కథలు, వాటి వెనుక ఉన్న ప్రతిభావంతులైన వ్యక్తులను గౌరవించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సినిమాలకు ప్రశంసలు దక్కేలా చేసి, వాటిపై మక్కువ పెరిగేలా ప్రోత్సహించడంతో పాటు, ప్రజల మధ్య అవగాహన పెంచి స్నేహ వారధులను ఈ వేడుక నిర్మిస్తుంది. వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సు సాధించే దిశగా నూతన శిఖరాలను అధిరోహించేందుకు ఈ పండగ స్ఫూర్తినిస్తుంది.
గోవా ఎంటర్ టైన్మెంట్ సొసైటీ, గోవా ప్రభుత్వం సహకారంతో భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏటా ఇఫీని నిర్వహిస్తుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ (డీఎఫ్‌ఎఫ్) ఈ వేడుకలను ముందుండి నడిపిస్తున్నప్పటికీ, ఫిలిం మీడియా యూనిట్లతో కలసి జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డీసీ) ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది. 55వ ఇఫీ తాజా సమాచారం కోసం www.iffigoa.org వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఇఫీ సామాజిక మాధ్యమ ఖాతాలు ఎక్స్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ పాటు పీఐబీ సామాజిక మాధ్యమ ఖాతాలను, వాట్సాప్‌ను అనుసరించండి.
***
(Release ID: 2073517)
Visitor Counter : 22