వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ వినియోగదారు వ్యవహారాల విభాగ కార్యదర్శితో రష్యా వ్యవసాయ శాఖ ఉప మంత్రి భేటీ; పప్పు ధాన్యాల వ్యాపారంలో సహకారం అంశంపై చర్చలు

కందులు, మినుములు, శనగపప్పు, బఠాణీల దిగుమతులకు ఢోకా లేనందున
పప్పు ధాన్యాల లభ్యతలో ఇబ్బంది ఏమీ లేదు: కేంద్రం

ఢిల్లీ/ఎన్‌సీఆర్, పంజాబ్, ఇంకా ఇతర రాష్ట్రాలకు ఉల్లిపాయల తరలింపులను పెంచిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 12 NOV 2024 3:06PM by PIB Hyderabad

వినియోగదారు వ్యవహారాల విభాగం కార్యదర్శి నిధి ఖరే తో  రష్యా వ్యవసాయ శాఖ ఉప మంత్రి శ్రీ మక్సిమ్ తితోవ్ నాయకత్వంలోని ప్రతినిధి వర్గం నిన్న సమావేశమైంది.  పప్పు ధాన్యాల వ్యాపారం రంగంలో సహకారాన్ని మరింత పెంచడానికి తీసుకోదగిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు.  గత కొంత కాలంగా భారత్ మసూర్ (పప్పుధాన్యాలు), పసుపు బఠాణీలను ప్రధానంగా రష్యా నుంచి దిగుమతి చేసుకొంటోంది.  ఈ రెండే కాక, తన పప్పు ధాన్యాల ఉత్పత్తిని మినుములు, కందులకు కూడా విస్తరించాలని రష్యా భావిస్తోంది.

గత జులై నుంచి ఖరీఫ్ దిగుబడులతో పాటు, దిగుమతులపై తీసుకొంటున్న శ్రద్ధ కారణంగా కందులు, మినుములు, శనగపప్పు వంటి ప్రధాన పప్పుధాన్యాల విషయంలో సరఫరా పరంగా ఒత్తిళ్లు క్రమంగాను, చెప్పుకోదగిన స్థాయిలో తగ్గాయి.  కంది పంట స్థితి బాగుంది; కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో కంది పంట చేతికందడం కాస్తంత ముందుగానే మొదలైంది.  ఈ సంవత్సరం కందులు, మినుములు, శనగలు, బఠాణీల దిగుమతులు అధికంగా ఉండడంతో మొత్తంమీద పప్పుధాన్యాల లభ్యతలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాలి.  ఈ కేలండర్ సంవత్సరంలో కంది దిగుమతులు 10 ఎల్ ఎమ్‌టీ స్థాయిలో ఉండగా, మినుముల దిగుమతులు 6.40 ఎల్ ఎమ్‌టీ స్థాయిలో ఉన్నాయి. దీంతో  కిందటి సంవత్సరంలో మొత్తం 12 నెలల్లో నమోదైన దిగుమతుల స్థాయిని ఇప్పటికే అధిగమించినట్లయింది. ఈ నెలలో ఆస్ట్రేలియా నుంచి శనగ దిగుమతులు పెద్ద ఎత్తున తరలివచ్చే సూచనలు ఉన్నాయి.  పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకొనే దేశాలను మరిన్నింటిని ఇటీవల జత పరచుకోవడంతో, ఆయా సరకులను మంచి ధరలకు రప్పించుకోవడం సరళతరంగా మారింది.

మరో పక్క, వర్షాకాలం ముగిసిన తరువాత కూడా వానలు కురవడంతో కొన్ని రాష్ట్రాలలో శనగలు, కందులు, మినుములు, పెసర్ల రబీ కాలం నాట్ల ప్రక్రియ  ఆరంభం కావడంలో కొంత ఆలస్యం అయినట్లు మొదట్లో వినవచ్చినప్పటికీ, పంటల విస్తీర్ణంలో అంతరం ఇప్పుడు క్రమంగా భర్తీ అవుతోంది.  మంచి ధరలు లభిస్తున్న కారణంగా మొత్తం మీద సెంటిమెంట్ తో పాటు నాట్ల ధోరణి కూడా ఆశాజనకంగా ఉంది.

గత కొద్ది రోజులుగా పండగల కాలం కావడంతో, మండీలు మూతపడడంతో కొన్ని బజారులలో ఉల్లిపాయల సరఫరాకు తాత్కాలికంగా అంతరాయాలు ఏర్పడగా ఈ సమస్యను చక్కదిద్దడానికి ఉల్లిగడ్డల సరకు తరలింపులను పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   ఈ వారంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్ కు మరో రెండు రేక్ ల ఉల్లిగడ్డను, గౌహతీకి ఒక రేక్ ఉల్లిగడ్డను‘నాఫెడ్ తెప్పించనుంది.  విపణిలో ఉల్లిపాయల లభ్యతను పెంచడానికి రోడ్డు రవాణా ద్వారా  ఉల్లి తరలింపులను పెంచనున్నారు.  అలాగే రైళ్ళలోను, రహదారి రవాణా ద్వారాను ఎన్‌సీసీఎఫ్ (నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) నుంచి మరింతగా ఈ సరకును సమకూర్చనున్నారు.  దీనికి తోడు పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్, జమ్మూ- కాశ్మీర్, ఢిల్లీ మొదలైన ప్రాంతాలలో ప్రజల అవసరాలను తీర్చడానికి సోనిపట్ లోని శీతల గిడ్డంగులలో నిల్వ ఉంచిన ఉల్లిపాయలను విపణిలోకి దించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లోచోటుచేసుకొంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ, ఉల్లి ధరలను నిలకడగా ఉంచడానికి తగిన చర్యలను తీసుకోవాలన్నదే ప్రభుత్వం సంకల్పం.  

ఈ సంవత్సరంలో ఖరీఫ్ పంటకాలంలో వాస్తవంగా నాట్ల విస్తీర్ణం 3.82 లక్షల హెక్టార్లు.  ఇది కిందటి సంవత్సరంలో నాట్లు వేసిన 2.85 లక్షల హెక్టార్ల కన్నా 34 శాతం అధికంగా ఉందని వ్యవసాయం - రైతుల సంక్షేమం విభాగం అంచనాలను బట్టి తెలుస్తోంది. నవంబరు మొదటి వారం వరకు చూసుకొంటే 1.28 లక్షల హెక్టార్లలో ఉల్లి పంట నాట్లు పూర్తికావడంతో, ఖరీఫ్ లో కూడా ఆలస్యంగా వేసిన ఉల్లి నాట్లు సాధారణ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

ఈ సంవత్సరం ధరల స్థిరీకరణ లక్ష్యంతో ప్రభుత్వం 4.7 లక్షల టన్నుల రబీ పంట కాలపు ఉల్లిని నిల్వ చేసింది.  ఈ సరుకును ఈ ఏడాది సెప్టెంబరు 5వ తేదీ మొదలు  కిలో రూ.35 ధరకు చిల్లర విక్రయాల నిమిత్తం విడుదల చేయడంతో పాటు దేశంలోని ప్రధాన మండీలలో టోకు విక్రయాల ద్వారా కూడా వాటిని అందిస్తోంది.  ఇప్పటి వరకు చూస్తే, నాసిక్, ఇతర కేంద్రాల నుంచి మొత్తం 1.50  లక్షల టన్నులకు పైగా బఫర్ ఉల్లి నిల్వలను వినియోగ కేంద్రాలకు ట్రక్కులలో తరలించారు.

అంతకు ముందు, కిందటి నెల 20న కందా ఎక్స్‌ప్రెస్ రైలులో పంపిన 1,600 ఎమ్‌టీ ఉల్లిపాయలు  ఢిల్లీ లోని కిషన్ గంజ్ స్టేషన్‌కు చేరుకొన్నాయి.  మరో 840 ఎమ్‌టీ  ఉల్లిగడ్డలు కూడా రైల్ రేక్ ద్వారా ఢిల్లీకి చేరాయి. ఇటీవల చెన్నైకీ, గౌహతికీ పెద్ద ఎత్తున ఉల్లిపాయల లోడులను పంపారు. 2024 అక్టోబరు 23న 840 ఎమ్ టీ ఉల్లిపాయలను నాసిక్ నుంచి చెన్నై కి రైల్ రేక్ ద్వారా తరలించగా ఆ లోడు అదే నెల 26న చెన్నైకి చేరింది. 840 ఎమ్ టీ ఉల్లిగడ్డలు రైల్ రేక్ ద్వారా ఈ నెల 5న గౌహతిలోని చంగ్ సారి స్టేషన్ కు చేరాయి. ఈ ఉల్లిపాయలను అసోమ్, మేఘాలయ, త్రిపుర తదితర ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు పంపిణీ చేశారు.  

మండీలలో ధరలు తగ్గడంతో టమాటాల చిల్లర ధరలు దిగివచ్చాయి.  ఆజాద్‌పూర్ మండీలో వారంవారీ  సగటు ధర 27 శాతం పడిపోయి, ఒక్కో క్వింటాలు రూ.4,000కు దిగివచ్చింది.  అదే పింపల్‌గాఁవ్ లో చూస్తే ఒక్కో క్వింటాలుకు ధర 35 శాతం క్షీణించి రూ. 2,250 గా ఉంది.  మదనపల్లిలో ఈ ధరలు 26 శాతం పడిపోయి, ఒక్కో క్వింటాలు రూ. 2,860 గా ఉంది.  కోలార్ లో టమాటా వారంవారీ సగటు ధర 27 శాతం తగ్గి ఒక్కో క్వింటాలుకు రూ.2,250 గా ఉంది.

గత మూడు నెలల కాలంలో బంగాళాదుంప ఆలిండియా సగటు రిటైల్ ధరలు ఒక్కో కిలోకు సుమారు రూ. 37 వద్ద నిలకడగా ఉన్నాయి.  పోయిన వారంలో ఆగ్రా లో వారం వారీ సగటు మండీ ధరలు 15 శాతం పడిపోయి, ఒక్కో క్వింటాలుకు రూ.1,860 గా ఉన్నాయి.  మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ప్రకారం చూసినప్పుడు, ఈ సంవత్సరం బంగాళాదుంప పంట విస్తీర్ణం మొత్తం మీద 16 శాతం పెరిగేందుకు  అవకాశం ఉంది.  పంజాబ్ లోను, ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ ప్రాంతంలోను ఈ పంట విస్తీర్ణం 10 శాతం మేర పెరిగే సూచనలు ఉన్నాయి.  మధ్య ప్రదేశ్ లో 80 శాతం నాట్లు పూర్తి అయ్యాయి.  షాజాపూర్, ఇండోర్ లలో నాట్ల విస్తీర్ణం 8 శాతం మేర పెరిగింది.  ఉజ్జయిని ప్రాంతంలో నాట్లు కిందటి సంవత్సరంతో సమాన స్థాయిలో ఉన్నాయి.  పశ్చిమ బెంగాల్ లో నాట్ల ప్రక్రియ ఇంకా ఆరంభం కావలసి ఉంది.  అయితే విత్తనాల విక్రయాలు గత సంవత్సరం కన్నా ఎక్కువగా ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే, అక్కడ నాట్ల ధోరణులు అధికంగా ఉంటాయని గ్రహించవచ్చు.

 

 

***


(Release ID: 2072903) Visitor Counter : 41