సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం: సినిమా విశ్వజనీనం
Posted On:
06 NOV 2024 7:55PM by PIB Hyderabad
గోవా అందాలతో సినిమా సొబగులు జతకడుతున్నాయి. కళతో కనువిందు చేయడానికి దేశదేశాల్లోని కథకులంతా ఒక్క చోటకు వస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో 55వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (ఇఫీ) పనాజీలో ప్రారంభమవుతోంది. సాగరతీరంలో స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతం.. ఇఫీ ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంటున్నది. ఈ వేడుక ద్వారా మరోసారి అంతర్జాతీయ సాంస్కృతిక, చలనచిత్రోత్సవ కేంద్రంగా గోవా నిలవబోతున్నది. సినీ ప్రియులు, ఆ రంగంలో ప్రముఖులు, ఔత్సాహిక చిత్రనిర్మాతలు అనేకమంది దృష్టిని ఇఫీ తనవైపు మరల్చుకున్నదంటే.. తమ చిత్రాల ప్రదర్శన ఒక్కటే కారణం కాదు. సాంస్కృతిక హద్దులకు అతీతంగా అన్ని రంగాల వ్యక్తులూ హాజరై సినిమా కళను ఆస్వాదించే ఈ వేడుక వారికెంతో ప్రత్యేకమైనది.
1952లో ప్రారంభమైన ఇఫీ.. కథాకథనం, సంస్కృతి, సృజనాత్మక వైవిధ్యంగల చిత్రాలను ప్రోత్సహించే ప్రధాన అంతర్జాతీయ వేదికగా అవతరించింది. ఆసక్తికరమైన కార్యక్రమాలు, అనేక అంశాలపై సదస్సులు ఈసారి ఎడిషన్ లో జరగనున్నాయి. చలనచిత్ర రంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు అన్ని వర్గాలను అందులో భాగస్వాములను చేయడంపై ప్రధానంగా దృష్టిసారిస్తారు. సినీ నిర్మాణాల్లో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే దిశలో భారత చలనచిత్ర పరిశ్రమ అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. ఇఫీ కేవలం ఉత్సవం మాత్రమే కాదు. అంతర్జాతీయ సినిమా రంగంలో భారత పురోగతిని ప్రపంచానికి తెలిపే అవకాశం. సామాజిక అనుసంధాన మాధ్యమంగా సినిమా ఎంత శక్తిమంతమైనదో కూడా ఇఫీ చాటుతుంది.
చిత్రనిర్మాతలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి, మరింత మంది ప్రేక్షకులకు చేరువ కావడానికి, విశిష్టమైన కథలను పంచుకోవడానికి ఇఫీ అవకాశం కల్పిస్తుంది. పోటీలు, ఆకట్టుకునే కార్యక్రమాలు, అవగాహన సదస్సుల ద్వారా ఈ వేడుక ముఖ్యంగా వర్ధమాన చిత్ర నిర్మాతలకు మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే విభిన్నమైన కథలు, శైలీ సాంకేతికతలతో పటిష్టంగా ఉన్న భారత చలనచిత్ర రంగాన్ని.. మన చిత్ర నిర్మాతలను అంతర్జాతీయ మార్కెట్లకు పరిచయం చేయడం ద్వారా ఇఫీ మరింత విస్తరించింది. అంతర్జాతీయ స్థాయి చిత్ర నిర్మాణ నిపుణులను మనకూ పరిచయం చేస్తుంది.
55వ ఇఫీ విశేషాలు: ఆద్యంతం వైవిధ్యం - వరుసగా సినిమాలు, ఈవెంట్లు
ఈ యేటి కార్యక్రమంలో 16 ప్రత్యేక విభాగాల్లో చిత్రాలున్నాయి. హృదయాన్ని ద్రవింపజేసే డ్రామా నుంచి ఉత్కంఠ రేపే డాక్యుమెంటరీ జానర్ వరకూ సినిమాలోని ప్రతీ కోణాన్ని ఈ కార్యక్రమం స్పృశిస్తుంది. ఇఫీలో జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రీమియర్లను ప్రదర్శించే చిత్రాలు ఉత్సాహం నింపుతాయి. సంచలనాత్మక కథలను విడుదలకు ముందే ప్రేక్షకులు ఆస్వాదించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
సాంస్కృతికంగా, కళాత్మకంగా అసాధారణమైన అనేక చిత్రాలను అంతర్జాతీయ సినిమా విభాగం ఇఫీలో ఒకే వేదికపైకి తెస్తుంది. నిపుణులు ప్రత్యేక శ్రద్ధతో ఎంపిక చేసిన సినిమాలతో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇఫీలో మరో ప్రీమియర్ విభాగం ఇండియన్ పనోరమా. ఇందులో 25 కథాచిత్రాలు (ఫీచర్ ఫిల్మ్), 20 ఇతర చిత్రాలను ప్రదర్శిస్తారు. 25 కథాచిత్రాల్లో 5 మెయిన్ స్ట్రీమ్ సినిమాలున్నాయి. మొత్తం 384 ఎంట్రీల నుంచి వాటిని ఎంపిక చేశారు. శ్రీ రణదీప్ హూడా రూపొందించిన హిందీ సినిమా ‘స్వాతంత్ర్య వీర సావర్కర్’ ఇండియన్ పనోరమాలో తొలి చిత్రంగా ఉంది. వాటితోపాటు, 20 ఇతర చిత్రాలను కూడా ప్రదర్శిస్తారు. మొత్తం 262 సినిమాల జాబితా నుంచి వాటిని ఎంపిక చేశారు. సమకాలీన భారతీయ విలువల చిత్రణ, చింతన, ప్రతిఫలనంలో వర్ధమాన, సుపరిచితులైన చిత్ర నిర్మాతల సమర్థతకు ఈ సినిమాలు ఉదాహరణ. హర్ష్ సంగాని దర్శకత్వం వహించిన ఘర్ జైసా కుచ్ (లడాఖీ)తో ఈ విభాగంలో ప్రదర్శన మొదలవుతుంది.
‘భారతీయ కథాచిత్ర ఉత్తమ ఆరంభ దర్శకుడు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్) అనే కొత్త పురస్కారాన్ని ఈ సారి ఇఫీలో ప్రవేశపెట్టారు. భారతీయ సినిమా రంగంలో కొత్త తరానికి దీనిని అందిస్తారు. భారతీయ సాంస్కృతిక, భాషాపరమైన వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త దర్శకుల అయిదు తొలి చిత్రాలకు ఈసారి వేడుకలో అవకాశం కల్పించారు. ఈ సినిమాలు నూతన ధోరణులను ప్రదర్శించడంతోపాటు.. విశిష్టమైన కథనాలు ప్రాంతీయ పరిధిని దాటి పెద్దసంఖ్యలో ప్రేక్షకులను చేరుకునేలా అవకాశం కల్పిస్తాయి. లక్ష్మీప్రియా దేవి దర్శకత్వం వహించిన బూంగ్ (మణిపురి), నవజ్యోత్ బండివడేకర్ దర్శకత్వం వహించిన ఘరత్ గణపతి (మరాఠీ), మనోహర.కె దర్శకత్వం వహించిన మిక్కా బన్నడ హక్కి (భిన్నమైన ఈకలున్న పక్షి - కన్నడ), యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన రజాకార్ (హైదరాబాద్ లో హత్యాకాండ - తెలుగు), రాగేశ్ నారాయణన్ దర్శకత్వం వహించిన తనుప్ (చలి - మలయాళం) ఇందుకోసం ఎంపికయ్యాయి. ఇందులో ప్రతీ సినిమా దేశంలో వివిధ ప్రాంతాల జీవనాన్ని వెల్లడిస్తుంది. ఈ తొలిచిత్రాలను ప్రోత్సహించడం ద్వారా నవతరం ప్రతిభావంతులకు చేయూతనివ్వడమే కాకుండా, జాతీయ చలనచిత్ర రంగంలో ప్రాంతీయ గళాలను వినిపించాల్సిన ప్రాధాన్యాన్ని ఇఫీ స్పష్టం చేసింది.
భారతీయ సినిమా ఘనమైన వారసత్వానికి ప్రతీకగా ఇఫీ ఈసారి నలుగురు దిగ్గజాలకు శతాబ్ధి నివాళి ఘటిస్తోంది. నటుడు రాజ్ కపూర్, దర్శకుడు తపన్ సిన్హా, తెలుగు సినీ ధ్రువతార అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్), గాయకుడు మహ్మద్ రఫీలను ఇఫీ స్మరించుకోనున్నది. వారంతా సినీ పరిశ్రమకు విశేష సేవలందించారు. శతాబ్ధి నివాళి సందర్భంగా వారి ఆపాత మధురాలకు మెరుగులు పెట్టారు. ఈ వేడుక ప్రారంభంలో ఒక ఆడియో - విజువల్ ప్రదర్శన ఈ దిగ్గజాల ప్రస్థానాన్ని వివరిస్తుంది. వారి జీవిత విశేషాలను, భారతీయ సినిమాను తీర్చిదిద్దిన వారి విజయాలను ఈ తరం ప్రేక్షకులకు అందించేలా ఆ ప్రదర్శన ఉంటుంది. వారి కళాఖండాలకు మెరుగులు దిద్దడం ద్వారా దృశ్యపరమైన నాణ్యతను పెంచే బాధ్యతను జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్ డీసీ) చేపట్టింది.
సాంస్కృతిక వినియమ కేంద్రం: ఆస్ట్రేలియాపై ప్రత్యేక దృష్టి
ఇఫీలో ప్రత్యేక దృష్టి నిలిపే దేశం (కంట్రీ ఆఫ్ ఫోకస్) అన్నది ఓ కీలక విభాగం. నిర్ణీత దేశం నుంచి ఉత్తమ సమకాలీన చిత్రాలను గుర్తించడానికి ఇది ఉద్దేశించినది. వినూత్నమైన, వైవిధ్యభరితమైన కథాకథనాలు; ప్రత్యేక సాంస్కృతిక దృక్పథాలతో ప్రపంచ సినిమాకు అందించిన సేవలు ఈ యేడు ఆస్ట్రేలియాను ప్రముఖ స్థానంలో నిలిపాయి. ఏడు విభిన్న తరహాల (జానర్లు) ఆస్ట్రేలియా సినిమాలను ఇఫీ ప్రదర్శిస్తుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలు, ప్రభావవంతమైన డాక్యుమెంటరీలు, దృశ్య కావ్యాలు, ఆకట్టుకునే హాస్యంతో కూడిన చిత్రాలు అందులో ఉన్నాయి. దేశీయ, ఆధునిక సమాజాల నుంచి కథలతో కూడిన ఈ సినిమాలు సుసంపన్నమైన ఆస్ట్రేలియా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఇప్పటికే ఓ ఆడియో-విజువల్ కో-ప్రొడక్షన్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా ఈ భాగస్వామ్యం ఇరుదేశాల మధ్య విస్తృతంగా సినీ సహకారాన్ని ప్రోత్సహించేలా ఉంది.
చిత్ర ప్రదర్శనలే కాదు: సదస్సులు, నైపుణ్య తరగతులు, ఐఎఫ్ఎఫ్ఐ ఎర్ర తివాచీ
చిత్ర ప్రదర్శనలతోపాటు కళపై ఆసక్తిని పెంచడానికి ఐఎఫ్ఎఫ్ఐ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. నైపుణ్య తరగతులు, చర్చలు, ప్రయోగాత్మక సదస్సులను రూపొందించింది. ఆతృతతో ఎదురుచూసే కార్యక్రమం ఐఎఫ్ఎఫ్ఐ రెడ్ కార్పెట్. ప్రముఖ నటులు, దర్శకులు, చిత్రనిర్మాతలున్న ఆ కార్యక్రమం సినీ పరిశ్రమ వైపు ఆకర్షితులను చేస్తుంది. సినీ తారలు, ప్రముఖులు ఓ చోట చేరి తమ నట విశేషాలను, సినిమాపై తమ మమకారాన్ని పంచుకునే రెడ్ కార్పెట్ ఈవెంట్.. సినిమాలో ఉన్న మ్యాజిక్ ను తేటతెల్లం చేస్తుంది. చిత్రనిర్మాతలు, నటీనటులు, సినీ రంగ నిపుణులతో ఐఎఫ్ఎఫ్ఐ ప్రతినిధులు సమావేశమవుతారు. దాంతోపాటు ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’, ‘ఫిల్మ్ బజార్’, ‘సినీ మేళా’ ఈ యేడాది ఎడిషన్లను మరోసారి ముందుకు తేవడం ద్వారా.. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వర్ధమాన ప్రతిభావంతులకు ‘బహుముఖీన వేదిక (వన్ స్టాప్ షాప్)’గా ఐఎఫ్ఎఫ్ఐ తీర్చిదిద్దుతోంది.
దివ్యాంగులు సహా అందరికీ ప్రవేశం కల్పించేలా వేదికల వద్ద ఏర్పాట్లు చేయడం సమ్మిళితత్వం దిశగా ఐఎఫ్ఎఫ్ఐ కీలక ముందడుగు. ర్యాంపులు, చేతి ఊతాలు (హాండ్ రెయిల్స్), స్పర్శా మార్గాలు, బ్రెయిలీ సంకేతాలు, పార్కింగ్ స్థలాల వంటి అంశాలు సమ్మిళితత్వం దిశగా ఈ వేడుక నిబద్ధతకు నిదర్శనాలు. సినిమా మ్యాజిక్ ను అందరూ ఆస్వాదిస్తారన్న భరోసా కలిగిస్తున్నాయి. అవరోధాల్లేకుండా అందరికీ ప్రవేశాన్ని అందించాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పం నేపథ్యంలో ఈ చర్యలు మరింత సందర్భోచితంగా ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో సమ్మిళిత విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఇఫీ స్ఫూర్తి: సంక్షిప్త చరిత్ర
1952లో మొదలైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ఆసియాలోని ప్రధాన సినీ వేడుకల్లో ఒకటి. జీవన శైలి, అంతర్జాతీయ ఆకర్షణ కారణంగా 2004 నుంచి గోవా దానికి శాశ్వత చిరునామా అయింది. కొన్నేళ్లుగా ఈ వేడుక ఖ్యాతి మరింత పెరిగింది. అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాతల సమాఖ్య (ఎఫ్ఐఏపఎఫ్) గుర్తింపు పొంది, ప్రపంచంలో ప్రతిష్ఠాత్మక పోటీ చలనచిత్రోత్సవాల్లో ఒకటిగా నిలిచింది. గోవా ప్రభుత్వ ఎంటర్ టైన్మెంట్ సొసైటీతో కలిసి.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఏటా ఇఫీని నిర్వహిస్తుంది. సాధారణంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని చలనచిత్రోత్సవాల డైరెక్టరేట్ నేతృత్వంలో ఈ వేడుక జరుగుతుంది. జాతీయ చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎఫ్ డీసీ)లో ఫిల్మ్ మీడియా యూనిట్ల విలీనం అనంతరం, ఈ ఉత్సవ నిర్వహణను ఎన్ఎఫ్ డీసీ చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, సినిమా రూపకర్తలు, సినీ ప్రముఖులను అనుసంధానం చేస్తూ ఈ కార్యక్రమం సాంస్కృతిక వారధిగా ఉపయోగపడుతోంది. చిత్ర నిర్మాణ కళపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ముగింపు
గోవాలో 55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరగబోతున్నది. సినిమాలను ఒకచోట నిలపడం మాత్రమే కాదు; ఐక్యత, సృజనాత్మకత, మానవీయ అనుభవాల భాగస్వామ్యం ఇందులో ఉన్నాయి. సినిమా అనే సార్వత్రిక భాష ద్వారా ప్రజలను ఒకచోటకు తేవడం, అన్ని వర్గాలూ గళం విప్పగల ఓ వేదికను అందించడం ఐఎఫ్ఎఫ్ఐ ప్రధాన సంకల్పం. సినీ దిగ్గజాలకు నివాళి, వర్ధమాన ప్రతిభావంతులకు ప్రోత్సాహం, సమ్మిళితత్వంపై ప్రత్యేక దృష్టితో ఈ యేడు జరిగే చిత్రోత్సవం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఐఎఫ్ఎఫ్ఐ సుస్థిర స్థానానికి నిదర్శనం.
(Release ID: 2071531)
Visitor Counter : 36