ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

2024-25లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ను ఈక్విటీగా మార్చడం ద్వారా


భారత ఆహార సంస్థలో రూ.10,700 కోట్లు ఈక్విటీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Posted On: 06 NOV 2024 3:15PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు మూలధన పెట్టుబడి కోసం రూ.10,700 కోట్ల ఈక్విటీని సమకూర్చడానికి ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగానికి ఊతమివ్వడంతో పాటు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహాత్మక చర్య రైతులకు మద్దతు ఇవ్వడానికి, దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వ స్థిరమైన నిబద్ధతకు నిదర్శనం. 

1964లో రూ.100 కోట్ల అధీకృత మూలధనం, రూ.4 కోట్ల ఈక్విటీతో ఎఫ్‌సీఐ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. క్రమంగా ఎఫ్‌సీఐ కార్యకలాపాలు విస్తరించడంతో, అధీకృత మూలధనం రూ.11,000 కోట్ల నుండి 2023 ఫిబ్రవరిలో రూ. 21,000 కోట్లకు పెరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.4,496 కోట్లుగా ఉన్న ఎఫ్‌సీఐ ఈక్విటీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.10,157 కోట్లకు పెరిగింది. ఇప్పుడు, భారత ప్రభుత్వం గణనీయమైన మొత్తంలో సమకూర్చిన రూ.10,700 కోట్ల ఈక్విటీ ఎఫ్‌సిఐ ని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుంది ఇంకా సంస్థలో మార్పుల కోసం చేపట్టిన కార్యక్రమాలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) కు ఆహార ధాన్యాల సేకరణ, వ్యూహాత్మక ఆహార ధాన్యాల నిల్వల నిర్వహణ, సంక్షేమ పథకాల కింద ఆహార ధాన్యాల పంపిణీ, మార్కెట్లో ఆహార ధాన్యాల ధరల స్థిరీకరణ ద్వారా… దేశ ఆహార భద్రతలో ఎఫ్‌సీఐ కీలక పాత్ర పోషిస్తోంది. 

ఈక్విటీ సమీకరణ ఎఫ్‌సీఐ తన విధిని సమర్థవంతంగా అమలు చేయడంలో నిర్వహణ సామర్థ్యాలను పెంచడానికి కీలకమైన అడుగు. ఎఫ్‌సీఐ తక్షణ ఆర్థిక అవసరాల కోసం స్వల్ప కాలిక రుణాలపై ఆధారపడుతోంది. ఇప్పుడు లభించే ఈక్విటి సంస్థ వడ్డీ భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా భారత ప్రభుత్వ సబ్సిడీని కూడా తగ్గిస్తుంది.

ఎంఎస్ పీ ఆధారిత సేకరణ, ఎఫ్‌సీఐ నిర్వహణ సామర్థ్యాలలో పెట్టుబడి అనే రెండు అంశాలలో ప్రభుత్వ నిబద్ధత రైతుల సాధికారత, వ్యవసాయ రంగం బలోపేతం, ప్రజలకు ఆహార భద్రత అందించే దిశగా సహకార ధోరణిని ప్రతిబింబిస్తుంది.

 

****




(Release ID: 2071171) Visitor Counter : 46