రక్షణ మంత్రిత్వ శాఖ
ఇండియన్ నేవీ క్విజ్ ‘థింక్ 2024’ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహణకు సన్నాహాలు పూర్తి
Posted On:
06 NOV 2024 12:46PM by PIB Hyderabad
భారతీయ నౌకాదళం నిర్వహిస్తున్న ‘థింక్-2024’ క్విజ్ సెమీ ఫైనల్స్‌ను ఈ నెల 7న, ఫైనల్స్ ను ఈ నెల 8న ఏళిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ)లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. గత జులై 15న రిజిస్ట్రేషన్ ప్రక్రియతో మొదలైన ‘థింక్ 2024’ క్విజ్ ముగింపు దశకు చేరుకుంటున్నది. అభివృద్ధి చెందిన భారతదేశం (‘వికసిత్ భారత్’) లక్ష్యాలకు అనుగుణంగా, యువతీ యువకులలో మేధో వికాసాన్ని కలిగించడానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ క్విజ్... అతి పెద్ద క్విజ్ కార్యక్రమంగా పేరుతెచ్చుకొంది.
దేశంలో నలుమూలల నుంచి సెమీఫైనల్స్ కు ఎంపికైన వారంతా తుది పోటీ కోసం ఐఎన్ఏ కు చేరుకుంటున్నారు. దీంతో ఐఎన్ఏలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మొత్తం 16 పాఠశాలు సెమీ ఫైనల్స్ కు ఎంపికయ్యాయి. ఎంపికైన విద్యార్థులు వారి వెంట వచ్చిన ఉపాధ్యాయులు ఇక్కడికి చేరుకోవడంతో నిర్వాహకులు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ విద్యార్థులు అకాడమిలో మకాం చేసే కాలంలో భారత నౌకాదళ అత్యాధునిక శిక్షణ కేంద్రాలనూ, మౌలిక సదుపాయాలనూ సందర్శించే అద్వితీయ అవకాశాన్ని దక్కించుకోనున్నారు. ఇంతటి ప్రతిష్ట కలిగిన చోట, తెలివితేటలకు పదును పెట్టే పోటీలో పాలుపంచుకోవడం తమకు లభించిన అదృష్టమనీ, తుది పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామనీ విద్యార్ధులు ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకూ, ఉమ్మడి ప్రతిభను చాటిచెప్పడానికి మంచి అవకాశం చిక్కిందనుకుంటూ ఈ యువతీ యువకులు ఎంతో శ్రద్ధాసక్తులతో పోటీకి సిద్ధమవుతున్నారు.
ఈ నెల 7న సెమీ ఫైనల్స్ లో 16 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సదరన్ నేవల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, వైస్ ఎడ్మిరల్ వి. శ్రీనివాస్ సెమీఫైనల్స్ కు ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ 16 జట్లలో 8 జట్లు ఈ నెల 8న జరగనున్న ఫైనల్స్ కు వస్తాయి. నౌకా దళ ప్రధానాధికారి ఎడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి సమక్షంలో ఫైనల్స్ జరగనుండడం విద్యార్థుల విద్యా కాలపు మరపురాని సన్నివేశంగా మిగలనున్నది.
‘థింక్ 2024’ ఒక పోటీ కన్నా మించింది. విభిన్న ప్రాంతాలకు చెందిన తోటి విద్యార్థులతో మమేకం కావడానికి, భారతీయ నౌకాదళం సంపన్న వారసత్వాన్ని లోతుగా అవగాహన చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇది అందిస్తోంది. ఈ పోటీలో పాల్గొనే పాఠశాల జట్లు అన్నీ ‘థింక్ 2024’ ఆఖరి మజిలీకి చేరుకోనున్న క్రమంలో వారికి భారతీయ నౌకాదళం శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
***
(Release ID: 2071138)
Visitor Counter : 39