బొగ్గు మంత్రిత్వ శాఖ
50వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన కోల్ ఇండియా
Posted On:
02 NOV 2024 12:55PM by PIB Hyderabad
భారతదేశపు బొగ్గు అవసరాలనూ తీర్చుతూ ఇంధన రంగాన్ని బలోపేతం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) నవంబరు1, 2024 నాటికి 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1975 నవంబరు ఒకటో తేదీన ఈ సంస్థ ఏర్పడింది. కోకింగ్ కోల్ (1971), నాన్ కోకింగ్ మైన్స్ (1973) కంపెనీలను జాతీయం చేయడం ద్వారా కోల్ ఇండియా రూపుదిద్దుకుంది.
సీఐఎల్ ఏర్పడిన తొలి ఏడాది అంటే 1975-76 నాటికి 89 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2024 ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి బొగ్గు మంత్రిత్వశాఖ కింద ఉన్న ఈ మహారత్న కంపెనీ- 773.6 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించింది. ఉత్పత్తి 8.7 రెట్లు పెరిగింది. మొత్తం ఉత్పత్తిలో 80 శాతం ప్రధానంగా ధర్మల్ పవర్ ప్లాంట్లకు సరఫరా అవుతున్నది. బొగ్గును మార్కెట్ రేటు కంటే అతి తక్కువగా అందిస్తూ పౌరులందరికీ చౌక ధరకే విద్యుత్తును అందించడంలో సీఐఎల్ కీలకపాత్ర పోషిస్తోంది. జాతీయీకరణ సమయంలో 6.75 లక్షల మంది ఉద్యోగులుండగా, నేడు 2.25 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అయినా ఉత్పత్తి మాత్రం పెరుగుతూనే ఉంది.
కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డి కోల్ ఇండియాకు అభినందనలు తెలిపారు. ‘‘అనేక విజయాలను సాధించి గోల్డెన్ జూబిలీ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న కోల్ ఇండియాను అభినందిస్తున్నాను. బొగ్గు ఉత్పత్తి భారతదేశంలో శిఖరస్థాయిని ఇంకా అందుకోవాల్సి ఉంది. దిగుమతులను తగ్గించుకోవడానికి స్థానిక ఉత్పత్తి చాలా కీలకం. ప్రజల పరంగా సామాజిక బాధ్యత, సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యమిస్తూనే, భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తిని కోల్ ఇండియా గణనీయంగా పెంచాల్సి ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
దాదాపు అయిదు దశాబ్దాల ప్రయాణం- కోల్ ఇండియాకు ఒక ప్రత్యేకమైన పండుగ. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, అనేక మార్పులకు లోనవుతూ కూడా... ప్రజల ఆశల్ని నెరవేరుస్తూనే వస్తున్నది. ఈ బొగ్గు ఉత్పత్తి కంపెనీ నేడు సోలార్ పవర్, పిట్ హెడ్ పవర్ స్టేషన్లు, కోల్ గ్యాసిఫికేషన్, కీలక ఖనిజాల వంటి కార్యకలాపాల్లోకి కూడా ప్రవేశిస్తోంది.
సంస్థ పరిధికి పరిమితమై, వ్యవస్థాపక దినోత్సవాన్ని కోల్ ఇండియా 2007 నుంచి నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఏటా సంస్థ పూర్వ ఛైర్మన్లు, లేదా పరిశ్రమ నిపుణులు... జేబీ కుమారమంగళం స్మారకోపన్యాసం చేస్తారు. తర్వాత ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి అవార్డులను అందిస్తారు. ఈ సంవత్సరం కూడా నవంబరు 3న కోల్ కతాలో వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బొగ్గు మంత్రి ముఖ్యఅతిధిగా, బొగ్గు శాఖ కార్యదర్శి గౌరవ అతిధిగా హాజరవుతున్నారు.
***
(Release ID: 2070370)
Visitor Counter : 52