యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
యువజనులారా, జాతీయ యువజన పురస్కారాల (2022-23)కు దరఖాస్తులు పెట్టుకోండి: డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ
ఈ నెల 1 నుంచి 15 వరకు దరఖాస్తులకు అవకాశం
Posted On:
01 NOV 2024 1:46PM by PIB Hyderabad
ప్రతిష్ఠాత్మక జాతీయ యువజన పురస్కారాలు (ఎన్‌వైఏ) 2022-23కు దరఖాస్తులు పెట్టుకోవలసిందిగా దేశ యువతీయువకులకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి, సాంఘిక పురోగతికి యువత అందించే అసాధారణ సేవలను గుర్తించి ఈ అవార్డులను ఇస్తూ వస్తున్నారు.
క్రీడలు, సాంఘిక సేవ, సైన్స్ లేదా పరిశోధన వంటి వివిధ రంగాల్లో దేశ యువత అసమాన స్ఫూర్తిని కనబరుస్తోందని మంత్రి డాక్టర్ మాండవీయ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు ఒక్క ప్రశంసే కాదు, ప్రగతిశీల భారత్ ను, సమ్మిళిత భారత్ ను వర్ధిల్లేటట్లు చేయడంలో యువత నాయకత్వ ప్రతిభ ను సన్మానించడం కూడా అని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ యువజన పురస్కారాల (ఎన్‌వైఏ)ను యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలోని యువజన వ్యవహారాల విభాగం ఇస్తూ వస్తోంది. ఈ పురస్కారాలను ఆరోగ్యం, మానవ హక్కుల ప్రచారం, క్రియాశీల పౌరసత్వ హక్కులు, సమాజ సేవల వంటి వివిధ రంగాల్లో విశిష్ట కృషిని చేస్తున్న 15 ఏళ్ళ వయసు మొదలు 29 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తులకు, సంస్థలకు అందిస్తున్నారు.
దేశాభివృద్ధి, సాంఘిక సేవ రంగంలో ముందువరుసలో నిలిచేలా యువజనులకు ప్రేరణను ఇవ్వడం ఈ పురస్కారాల లక్ష్యం. యువతీయువకులు సమాజంలో వారికంటూ ఒక బాధ్యత ఉందనే భావనను అలవరచుకొని, మంచి పౌరులుగా వారి శక్తియుక్తులకు మెరుగులు పెట్టుకొనేటట్లు వారిని ప్రోత్సహించడం, సాంఘిక సేవ సహా దేశాభివృద్ధికి యువజనులతో కలసి స్వచ్ఛంద సంస్థలు చేసిన మంచిమంచి పనులకు గుర్తింపును ఇవ్వడానికే ఈ అవార్డులను నెలకొల్పారు.
జాతీయ యువజన పురస్కారాల (2022-23)కు దరఖాస్తులను హోం శాఖకు చెందిన ఒక ఉమ్మడి పురస్కారాల పోర్టల్ ద్వారా స్వీకరిస్తున్నారు. ఈ నెల 1 నుంచి ఈ నెల 15 వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. అవార్డు పోర్టల్ లింకు: https://awards.gov.in/.
ఈ అవార్డులో భాగంగా వ్యక్తులకు ఒక పతకం, ఒక ధ్రువపత్రం, రూ.1 లక్ష నగదు బహుమతిని, సంస్థకు రూ.3 లక్షల నగదు బహుమతిని ఇస్తారు.
***
(Release ID: 2070217)
Visitor Counter : 48