రైల్వే మంత్రిత్వ శాఖ
సాంకేతిక సహకారం, ట్రాక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ కోసం స్విట్జర్లాండ్ కు చెందిన డిఇటిఇసితో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న భారతీయ రైల్వే
Posted On:
29 OCT 2024 10:37PM by PIB Hyderabad
భారత్, స్విట్జర్లాండ్ మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి స్విస్ కాన్ఫెడరేషన్ కు చెందిన పర్యావరణ, రవాణా, కమ్యూనికేషన్ల ఫెడరల్ విభాగంతో భారత రైల్వే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ అధికారిక ఎంవోయూకు... రైల్వే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ఆమోదం లభించింది.
అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ... ఈ అవగాహన ఒప్పందం భారతీయ రైల్వేలకు సాంకేతిక సహకారం, ట్రాక్ నిర్వహణ, పర్యవేక్షణ, నిర్మాణం వంటి వివిధ రంగాలలో సహకారం అందించడానికి సమగ్ర సంపత్తిని అందిస్తుందని అన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించాలన్న మన ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఫెడరల్ కౌన్సిలర్, ఫెడరల్ డిఇటిఇసి అధిపతి ఆల్బర్ట్ రోస్టీ మాట్లాడుతూ... స్విట్జర్లాండ్ అధునాతన రైల్వే సాంకేతిక పరిజ్ఞానం భారతీయ రైల్వేలకు నిర్వహణ సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, సేవా నాణ్యత, మౌలిక సదుపాయాల అభివృద్ధిని మెరుగుపరచడం ద్వారా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
ఆగస్టు 31, 2017న సంతకం చేసిన వాస్తవ అవగాహన ఒప్పందం అయిదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇది సహకారానికి సంబంధించి కింద పేర్కొన్న అనేక కీలక రంగాలపై దృష్టి సారించింది:
-
ట్రాక్షన్ రోలింగ్ స్టాక్
-
ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (ఈఎంయూ), ట్రెయిన్ సెట్లు
-
ట్రాక్షన్ ప్రొపల్షన్ ఎక్విప్ మెంట్
-
గూడ్స్, ప్రయాణికుల కోచ్ లు.
-
టిల్టింగ్ రైళ్ళు
-
రైల్వే విద్యుదీకరణ పరికరాలు
-
ట్రైన్ షెడ్యూలింగ్, నిర్వహణ మెరుగుదల
-
రైల్వే స్టేషన్ ఆధునీకరణ
-
మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ సొల్యూషన్స్
-
టన్నెలింగ్ టెక్నాలజీ
ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు, భారతీయ రైల్వేలు, స్విస్ రైల్వేల ప్రతినిధుల మధ్య సహకారాన్ని సులభతరం చేయడానికి ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ (జేడబ్ల్యూజీ) ఏర్పడింది. 2019 అక్టోబర్ 21న, 2022 ఆగస్టు 30న వివిధ కీలక రంగాలను అన్వేషించేందుకు జేడబ్ల్యూజీ రెండు సమావేశాలు నిర్వహించింది. వీటిలో ప్రధానంగా చర్చించిన అంశాలు:
స్విట్జర్లాండ్ లోని ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డైరెక్టర్ శ్రీ పీటర్ ఫుగ్లిస్టాలర్ తో పాటు అక్టోబర్ 11, 2023 న అప్పటి రైల్వే బోర్డు చైర్ పర్సన్ సిఇఒ అధ్యక్షతన జరిగిన మూడో జేడబ్ల్యూజీ సమావేశంలో, స్విస్ సంస్థలకు భారతీయ రైల్వే రంగంలో గణనీయమైన పెట్టుబడి అవకాశాలను, కొనసాగుతున్న మూలధన వ్యయ కార్యక్రమాలను భారత బృందం వివరించింది.
ఈ భాగస్వామ్యం భారతదేశంలో రైల్వే సేవల సామర్థ్యాన్ని, విశ్వసనీయతను పెంచుతుంది. అంతిమంగా ప్రయాణికులు, సరుకు రవాణా కార్యకలాపాలకు సమానంగా ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రముఖ స్విస్ కంపెనీలు.. యంత్రాలు, మెటీరియల్స్, టన్నెలింగ్ కన్సల్టెన్సీ సేవలను అందచేస్తాయి.
స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్, ఫెడరల్ కౌన్సిలర్, ఫెడరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ది ఎన్విరాన్ మెంట్, ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (డీఈటీఈసీ) హెడ్ ఆల్బర్ట్ రోస్టీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 2069439)
Visitor Counter : 39