రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దిగిరానున్న 3 ‘కేన్సర్ నిరోధక మందుల ’గరిష్ఠ చిల్లర ధరలు;

ఆ మందుల పేర్లు ట్రస్టుజుమాబ్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్;

జీఎస్‌టీ రేట్లలో తగ్గింపు, కస్టమ్స్ సుంకం మినహాయింపుల వల్లే

Posted On: 29 OCT 2024 2:23PM by PIB Hyderabad

3 కేన్సర్ నిరోధక మందుల గరిష్ఠ చిల్లర ధర (ఎమ్ ఆర్ పీ)లను తగ్గించాలని సంబంధిత తయారీదారు సంస్థలను జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ - ‘ఎన్‌పీపీఏ’) ఈ నెల 28న ఆదేశించింది.  ఆ మందులలో ట్రస్టుజుమాబ్, ఒసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్ లు ఉన్నాయి. వీటీకి కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపును ఇస్తూ, 2024-25 సంవత్సర కేంద్ర బడ్జెటులో ప్రభుత్వం ప్రకటించింది.  దీనిని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం పాటించి ఈ మందులకు కస్టమ్స్ సుంకాన్ని ‘సున్నా’కు తగ్గిస్తూ ఈ ఏడాది జులై 23న ఒక నోటిఫికేషన్ (సంఖ్య : 30/2024)ను జారీ చేసింది.  మందులను తక్కువ ధరల్లో ప్రజలకు  అందుబాటులో ఉంచాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ చర్య ఉంది.

అంతేకాకుండా, ఈ మూడు మందులకు వస్తువులు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్- ‘జీఎస్‌టీ’) రేట్లను తగ్గిస్తూ మరో నోటిఫికేషన్ (సంఖ్య 05/2024) ను ఆర్థిక శాఖ ఈ నెల 8న జారీ చేసింది. ఈ మందులకు జీఎస్ టీ 12 శాతం కాకుండా ఇకపై 5 శాతమే ఉంటుందని అందులో పేర్కొంది. జీఎస్ టీ తగ్గింపు ఈ నెల 10వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.

దీనితో, విపణిలో ఈ మందుల గరిష్ఠ చిల్లర ధర తగ్గిపోనుంది.  తగ్గిన పన్నులు, సుంకం  తాలూకు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాల్సివుంటుంది.  మందుల తయారీదారు సంస్థలు మారిన ధరల పట్టికను గాని లేదా అనుబంధ ధరల పట్టికను గాని డీలర్లకు, రాష్ట్రాల ఔషధ నియంత్రణ అధికారులకు, ప్రభుత్వానికి అందించాలి.  ఈ సమాచారాన్నే ఫారమ్-II లో, లేదా ఫారమ్-V లో ఎన్‌పీపీఏ కు కూడా తెలియజేయాల్సివుంటుంది.

 

***




(Release ID: 2069253) Visitor Counter : 29