సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత్ పైన దృష్టి
Posted On:
26 OCT 2024 5:58PM by PIB Hyderabad
ఈ ఏడాది భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు. రాబోయే 25 సంవత్సరాలకు అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్) కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. ఈ కీలక సమయంలో జర్మనీ క్యాబినెట్ భారతదేశ ప్రాథమ్య (ఫోకస్ ఆన్ ఇండియా) పత్రాన్ని (డాక్యుమెంట్) ను విడుదల చేయడం సంతోషించదగింది. "ఫోకస్ ఆన్ ఇండియా" పత్రం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ ప్రజాస్వామ్యాలు కలసి ప్రపంచ అభ్యున్నతి కోసం ఒక శక్తిగా మారడానికి ఎలా సహకరించుకోవాలన్నదిపై మార్గదర్శనను అందిస్తుంది.
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నివేదిక ప్రధానాంశాలు:
*విలక్షణ మార్పు: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం... ఈ రెండింటి వల్ల భారతదేశం గణనీయమైన మార్పులను చూస్తోంది. తదనుగుణంగా, భారతదేశం ప్రపంచ వ్యవహారాల్లో నిర్ణయాత్మక పాత్రను పోషింగలుగుతోంది. సుస్థిరమైన, పక్షపాత రహిత ప్రపంచాన్ని సృష్టించాలన్న ఆకాంక్ష అందులో ప్రతిఫలిస్తోంది.
*అంతర్జాతీయ ప్రభావం: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా, అంతర్జాతీయ విధానాలను రూపొందించడంలో భారత్ పాత్ర కీలకం. అందరికీ సుస్థిర భవిష్యత్తును అందించడానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (ఎస్డిజిలు) అనుగుణంగా వాతావరణ పరిరక్షణ, పర్యావరణ సుస్థిరత, జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా వివిధ కార్యక్రమాలలో దేశం చురుకుగా పాల్గొంటోంది.
*శాంతియుత మధ్యవర్తిత్వ పాత్ర: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి సంఘర్షణల శాంతియుత పరిష్కారంలో సహకరించడానికి భారతదేశం చూపుతున్న సంసిద్ధత దౌత్యం పట్ల, ప్రపంచ సమస్యల పరిష్కారం పట్ల దాని నిబద్ధతను రుజువు చేస్తున్నది. ఈ పాత్ర బాధ్యతాయుతమైన ప్రపంచ శ్రేయోభిలాషిగా భారతదేశ ఖ్యాతిని పెంచుతుంది.
*ప్రాంతీయ సుస్థిరత: ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాలపై ఆధారపడి ఉన్న ప్రపంచ నిర్వహణ గణనీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఒక ప్రాంతంలో... భారతదేశం స్థిరత్వాన్ని ప్రోత్సహించే ప్రభావాన్ని కలిగి ఉంది. 21వ శతాబ్దపు అంతర్జాతీయ క్రమాన్ని రూపొందించడంలో ఇండో-పసిఫిక్‌లోని భౌగోళిక రాజకీయ వైరుధ్యాలు, ఈ ప్రాంతంలోని ఆర్థిక అంశాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
*అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్) గళంగా: అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం వాదించే గ్లోబల్ సౌత్ కు భారతదేశం ప్రముఖ ప్రతినిధి. జీ-20, బ్రిక్స్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి వేదికల్లో పాల్గొనడం ద్వారా ప్రపంచ చర్చల్లో ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న వారి గళాన్ని భారత్ బలంగా వినిపిస్తోంది.
*వేగవంతమైన ఆర్థికవృద్ధి: వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్ 2030 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. పెరుగుతున్న సౌభాగ్యం, విస్తృతమైన దేశీయ మార్కెట్, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీలో గణనీయమైన పెట్టుబడులు ఈ వృద్ధికి దోహదపడుతున్నాయి.
*ఆవిష్కరణ, సాంకేతికతలో నాయకత్వం: సమాచార సాంకేతికత, డిజిటల్ మౌలిక సదుపాయాలు, అంతరిక్ష అన్వేషణలో విశేష ప్రగతిని సాధించిన భారత్ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా (గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్) గా అవతరించింది. ఈ నాయకత్వం... ఆర్థిక వృద్ధికి దోహదం చేయడమే కాకుండా, ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్తును రూపొందించడంలో భారతదేశాన్ని ప్రధానమైన స్థానంలో నిలబెట్టింది.
•సంపన్న జీవ వైవిధ్యానికి నిలయం: వివిధ రకాల జాతులకు నిలయంగా ఉన్న భారతదేశం జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలో అంతర్జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రపంచ జీవ వైవిధ్యంలో ఏడు శాతం భారతదేశంలోనే ఉంది. అందువల్ల జీవవైవిధ్య పరిరక్షణలో భారతదేశం చేసే కృషి ప్రపంచానికి ఎంతగానో ముఖ్యం.
*2030 ఎజెండాకు నిబద్ధత: 2030 ఎజెండా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధితో సహా భాగస్వామ్య లక్ష్యాలను పరిష్కరించడంలో భారత్ సహకారం ముఖ్యమైనది.
* వాతావరణ (క్లైమేట్) లక్ష్యాలకు కట్టుబాటు: పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ పరిరక్షణలో భారీగా పెట్టుబడులు పెడుతూ వాతావరణ తటస్థ వృద్ధికి భారత్ కట్టుబడి ఉంది. భారత్ ప్రయత్నాలు పారిస్ ఒప్పందం లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. తన ముఖ్యమైన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను గుర్తిస్తూ స్థిరమైన అభివృద్ధి ప్రాముఖ్యతను చాటుతోంది.
*పునరుత్పాదక ఇంధనం, హరిత మార్పు: అపారమైన పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో, భారత్ తన సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ వనరులను సుస్థిర ఇంధన భవిష్యత్తుకు మార్పు దిశగా ఉపయోగిస్తోంది. జర్మనీ వంటి భాగస్వామ్యాలతో ఇంధన భద్రతకు భరోసానిస్తూ శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించడంపై దృష్టి పెట్టింది.
*హరిత, సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం: జర్మనీతో 2022లో ఏర్పాటైన హరిత, సుస్థిర అభివృద్ధి భాగస్వామ్యం వాతావరణ చర్య, ఇంధన మార్పు, జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర పట్టణీకరణకు ప్రాధాన్యత ఇస్తోంది. అగ్రోఎకాలజీ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, అటవీ సంరక్షణ ప్రయత్నాలు వంటి కీలక కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. ఇంకా, తీవ్రమైన వేడి, కరవు, వరదలు వంటి దీర్ఘకాలిక వాతావరణ ప్రభావాల వల్ల కలిగే నష్టాలను పరిష్కరించడానికి 2025 నాటికి జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని భారతదేశం భావిస్తోంది.
*గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్: గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ లో జర్మనీ, భారత నిపుణులు సంయుక్తంగా భవిష్యత్తులో ఈ ఇంధన మార్కెట్ ను పెంచుకోవడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సంయుక్తంగా రూపొందిస్తున్నారు. దీనిని ముమ్మరంగా అమలు చేయడానికి ఉద్దేశించారు.
*పునరుత్పాదక ఇంధనం కోసం పెట్టుబడి వేదిక: పునరుత్పాదక శక్తిలో పెట్టుబడుల కోసం ఒక వేదికను సృష్టించడంతో శీఘ్రగతిన పునరుత్పాదక ఇంధన విస్తరణకు తగిన పరిష్కారాలను రూపొందించాలని భారత- జర్మనీ భావిస్తున్నాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఆదర్శవంతమైన పెట్టుబడి వేదికగా మారడానికి మార్గం సుగమం చేస్తుంది.
***
(Release ID: 2068559)
Visitor Counter : 75