వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్ శక్తి, జర్మనీ ఇంజనీరింగ్ సామర్థ్యాల కలయికతో ప్రపంచానికి మేలు: శ్రీ పీయూష్ గోయల్
ఏఐ స్వీకరణ, సెమీకండక్టర్లు, గ్రీన్ టెక్నాలజీలపై జరుగుతున్న భారత్-జర్మనీ సమావేశాలు ప్రపంచ వృద్ధికి తోడ్పడతాయి: శ్రీ పీయూష్ గోయల్
వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, జాతీయంగా నిర్దేశించిన అంశాలను సాధించేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉంది: శ్రీ గోయల్
వ్యాపార విస్తరణకు, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ఆసియా జనాభా కల్పిస్తుంది: శ్రీ గోయల్
Posted On:
25 OCT 2024 2:21PM by PIB Hyderabad
భారత్ శక్తి, జర్మనీ ఇంజినీరింగ్ సామర్థ్యాలు కలిస్తే భవిష్యత్తులో ప్రపంచానికి అవసరమైన ఆర్థిక, డిజిటల్, సామాజిక మౌలిక వసతుల కల్పనలో అద్భుతాలు సృష్టించగలమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా పసిఫిక్ - జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే) 18వ సమావేశాన్ని ఈ రోజు న్యూఢిల్లీలో ఆయన ప్రారంభించారు. భారత్-జర్మనీ సహకారంపై కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏఐను స్వీకరించడం నుంచి సెమీకండక్టర్ల వరకు, అంకుర సంస్థలకు అనుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి గ్రీన్ టెక్నాలజీలో సహకారం వరకు రెండు దేశాల మధ్య జరిగే సమావేశాలు అపూర్వమైన వృద్ధిని సాధిస్తాయని అన్నారు.
నేటి భారత్ నిర్మాణం బలమైన స్థూల ఆర్థిక మూలాలపై జరిగిందని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను విస్తరించేందుకు సంస్కరణ, స్థిరత్వం, సంసిద్ధత అవసరమని అన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 2015లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు (కాప్ 21)లో భారత్ పేర్కొన్న విధంగా అభివృద్ధి చెందుతున్న, తక్కువ ఆదాయం ఉన్న దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాలతో కలసి పరిష్కారాన్ని కనుగొనేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని శ్రీ గోయల్ తెలిపారు. వాతావరణ మార్పుల ప్రదర్శన సూచిక (సీపీపీఐ)లో భారత్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉందని వెల్లడించారు. జాతీయంగా నిర్దేశించిన అంశాలు (ఎన్‌డీసీలు), ప్రపంచం ముందున్న లక్ష్యాలను సైతం అధిగమించే దిశలో భారత్ వెళుతోందని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జర్మనీ బిజినెస్, ఇండో-జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు శ్రీ గోయల్ కృతజ్ఞతలు తెలిపారు. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 60 శాతం మంది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఉంటారు. అలాగే మూడింట రెండొంతుల మధ్య తరగతి జనాభా ఆసియాలో ఉంటుంది. తమ వ్యాపార పరిధిని విస్తరించుకోవాలని, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావించే వారికి ఇది అనువైన ప్రదేశంగా మారుతుందని అన్నారు.
కొత్తగా అభివృద్ధి చెందుతున్న పోకడలను గుర్తించేందుకు, ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సదస్సు కీలకంగా మారుతుందని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. ఇది ఒకరు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను మరొకరితో పంచుకొనే ప్రక్రియను సులభతరం చేస్తుంది. సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తులో పారిశ్రామికాభివృద్ధికి విధానాలు రూపొందింస్తుందని ఆయన తెలిపారు. భారత్, జర్మనీ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని రెండు దేశాల ఆర్ధిక వ్యవస్థలు, ప్రజల వృద్ధికి సహకారాన్ని కొనసాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘ఉపనిషత్తులు చదవడం నా జీవితానికి ఓదార్పునిస్తుంది...’’ అన్న జర్మన్ తత్వవేత్త ఆర్థర్ షోపెన్‌హార్ మాటలను ప్రస్తావిస్తూ, ఆ ప్రాచీన జ్ఞానం అందించిన స్ఫూర్తితో ముఖ్యంగా దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సమయంలో భారత సంస్కృతి, వైవిధ్యాల గొప్పతనాన్ని స్వీకరించాలని కోరారు.
‘‘అందనంత ఎత్తుకు ఎదగండి, మీలో అద్భుతం దాగి ఉంది. కలలు కనండి. ప్రతి లక్ష్యానికి ముందు ఊహే ఉంటుంది’’ అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలతో తన ప్రసంగాన్ని శ్రీ గోయల్ ముగించారు. ఉత్పత్తులు, పరిశ్రమలు, ఆవిష్కరణలు ప్రపంచం నలుమూలలకు చేరుకొనేలా మార్గదర్శకత్వం వహించే భవిష్యత్తును రూపొందించాలని సభలో పాల్గొన్నవారిని కోరారు.
***
(Release ID: 2068334)
Visitor Counter : 37