గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కలుపు మొక్క కాదు… గెలుపు మొక్క స్వచ్ఛ హరిత వనరుగా గుర్రపుడెక్క
అస్సాం మోరిగావ్ లోని వరద-బాధిత ప్రాంతం బోర్చిలా మహిళలూ,
దీపోర్ బీల్ కు చెందిన ఇద్దరు ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తల కృషి
గుర్రపుడెక్క నుంచి పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీ...
నగర ప్రాంత-స్వచ్ఛ్ భారత్ ఉద్యమం కింద ఉపాధి అవకాశాల కల్పన
Posted On:
24 OCT 2024 5:16PM by PIB Hyderabad
కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నేతృత్వంలో ‘నగర ప్రాంత-స్వచ్ఛ్ భారత్’ కింద ఇటీవల చేపట్టిన ‘స్వచ్ఛతా హీ సేవా’ ప్రచారోద్యమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈశాన్య రాష్ట్రాలు ఈ ఉద్యమంలో ముందుండి, పండుగల వేళ ఆరోగ్యం, పారిశుద్ధ్యం కోసం ప్రత్యేకంగా శ్రమిస్తున్నాయి.
పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ, పునర్వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థను అవలంబించేందుకు ఈశాన్య రాష్ట్రాలు అనేక వినూత్న పద్ధతులను ఆచరణలో పెడుతున్నాయి. స్వచ్ఛత కోసం అనేక క్రియాశీల చర్యలు చేపడుతున్నాయి. భారతదేశ నీటి వనరులకు విదేశీ జాతి మొక్క... గుర్రపుడెక్క బెడదగా మారింది. ఆకర్షణీయ ఊదా రంగు పువ్వులు గల ఈ తీగజాతి మొక్క, మంచినీటి సరస్సులూ, కొలనులూ, నదులనూ ఆక్రమించి చేపల వేట, రవాణా, ఇతర పనులకు అడ్డంకిగా మారి, నీటి వనరుల ఉపయోగాన్ని తగ్గిస్తోంది.
అస్సాం మోరిగావ్ జిల్లాలోని వరద బాధిత ప్రాంతం బోర్చిలా గ్రామానికి చెందిన ఒక మహిళల బృందం, ఆ ప్రాంత మంచినీటి వనరుల్లో అధికంగా లభ్యమయ్యే గుర్రపుడెక్క నుంచి అందమైన హస్తకళా ఉత్పత్తుల తయారీని చేపట్టి, వ్యర్ధాల నుంచీ సంపద సృష్టిస్తోంది. తమ జీవితాలకు లక్ష్యం, గౌరవం ఉండాలన్న స్పష్టమైన ఉద్దేశంతో బోర్చిలా గ్రామ మహిళలు చేపట్టిన ఈ పని ద్వారా ఒక్కో మహిళకూ నెలకు రూ.10,000 ఆదాయంగా లభిస్తోంది. అస్సాం రాష్ట్ర గ్రామీణ ఉపాధి పథకం-‘ఏఎస్ఆర్ఎల్ఎం’ లో భాగమైన ఈ వినూత్న కార్యక్రమం, మహిళల స్వావలంబనకు దోహదపడటమే కాక, వారి ఆర్థిక ఇక్కట్లను తగ్గించింది.
తమ బతుకులు మెరుగవ్వాలన్న బలమైన కాంక్షతో ముందడుగు వేసిన ఈ 60 మంది మహిళలకూ, ముడిపదార్థాల ఖర్చు అవరోధంగా నిలిచింది. అప్పుడే, సమీపాన గల సోనాయ్ నదిలోని గుర్రపుడెక్క వారికి వరదాయినిగా దర్శనమిచ్చింది. స్థానికంగా ‘పానీ మెటేకా’గా పిలిచే ఈ కలుపు మొక్కను అస్సామీయులు జీవవైవిధ్యానికి ప్రతీకగా భావించినప్పటికీ, నీటి వనరులని నిరుపయోగపరిచే స్థాయిలో ఆక్రమిస్తుందని గుర్తించారు. వరద బాధిత ప్రాంతాల్లో విస్తారంగా కనపడే గుర్రపుడెక్కకు గల వివిధ సద్గుణాలను వాడుకుంటూ, ఉపయోగకర వస్తువుల తయారీ చేపట్టాలని వారు నిర్ణయించుకున్నారు.
అస్సాంలోని ఏకైక రాంసర్ ప్రాంతం - దీపోర్ బీల్ చిత్తడి నేలలకు పర్యావరణపరంగా ప్రాముఖ్యం ఉంది. గుర్రపుడెక్క ఈ ప్రాంతపు జలపర్యావరణాన్ని కబళిస్తూ పెద్ద సమస్యగా మారింది. స్థానిక యువకులు రూపాంకర్ భట్టాచార్య, అనికేత్ ధర్ లు మాత్రం సమస్యలో అవకాశాన్ని చూశారు. సృజనాత్మత కలిగిన ఈ ఇరువురూ, కొత్త పద్ధతిలో ‘పానీ మెటేకా’ నుంచీ ‘కుంభీ కాగజ్’ అనే పర్యావరణ హిత కాగితాన్ని తయారు చేశారు. తయారీలో ఎటువంటి రసాయనాలనూ వాడని, మచ్చల ఊసు లేని ఈ నునుపైన కాగితం, 100 శాతం భూమిలో కలిసిపోయే గుణం కలది. కొత్త విషయాలు నేర్చుకుని, ఆ జ్ఞానాన్ని అమలులో పెట్టాలన్న ఈ యువకుల పట్టుదల, ‘జీరో వేస్ట్ సిటీస్ ఛాలెంజ్’ పోటీలో విజేతలుగా నిలిపింది. వ్యర్థాల నుంచీ పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై, ఉపాధిని కల్పించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఈ పోటీ ప్రోత్సాహిస్తుంది. కుంభీ కాగజ్ కాగితం పరిశ్రమ 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.
బోర్చిలా గ్రామ మహిళల, యువ సృజనకారులు రూపాంకర్, అనికేత్ ల ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ, కలుపు మొక్క నుంచీ సంపద సృష్టి సాధ్యమని నిరూపిస్తోంది. పర్యావరణ హిత కళాకృతుల ఉత్పాదన, రసాయన రహిత కాగితం తయారీల్లో నిమగ్నమైన వీరు, తమ తోటి వారికి సహాయ పడటమే కాక, పర్యావరణ పరిరక్షణలోనూ భాగమవుతున్నారు.
***
(Release ID: 2068302)
Visitor Counter : 47