ప్రధాన మంత్రి కార్యాలయం
18వ ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే 2024)లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
25 OCT 2024 2:55PM by PIB Hyderabad
గౌరవనీయులైన ఛాన్సలర్ షోల్జ్,
వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాబర్ట్ హాబెక్,
భారత ప్రభుత్వ మంత్రులు,
ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బుష్,
భారత్, జర్మనీ, ఇండో-పసిఫిక్ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు,
సోదరసోదరీమణులారా,
నమస్కారం
శుభదినం!
స్నేహితులారా,
ఈరోజు చాలా ప్రత్యేకమైనది.
నా స్నేహితుడు ఛాన్సలర్ సోల్జ్ భారత్ కు రావడం ఇది నాలుగోసారి.
ఆయన మొదటి సారి మేయర్‌గా ఇక్కడికి వచ్చారు. తదుపరి మూడు పర్యాయాలు ఛాన్సలర్ హోదాలో భారత్ ను సందర్శించారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తుంది.
దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు భారత్ లో జరుగుతోంది.
ఓ పక్క సీఈవో ఫోరం సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు రెండు దేశాల నౌకాదళాలు కలసి కసరత్తు చేస్తున్నాయి. జర్మనీ దేశ యుద్ధ నౌకలు ప్రస్తుతం గోవా నౌకాశ్రయంలో ఉన్నాయి. అదనంగా రెండు దేశాల మధ్య ప్రభుత్వ స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. భారత్, జర్మనీల మధ్య స్నేహం అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తూ.. ప్రతి అంశంలోనూ బలోపేతమవుతోంది.
స్నేహితులారా,
ఈ ఏడాదితో భారత-జర్మనీ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తవుతాయి.
రానున్న పాతికేళ్లలో ఈ భాగస్వామ్యం మరింత ఉన్నతస్థాయులకు చేరుతుంది.
రానున్న పాతికేళ్లలో భారత్‌ను అభివృద్ధి చేసేందుకు అవససరమైన ప్రణాళికను మేము రూపొందించాం.
ఇలాంటి క్లిష్టమైన సమయంలో ‘భారత్‌పై దృష్టి’ అనే పత్రాన్ని జర్మన్ క్యాబినెట్ విడుదల చేసినందుకు సంతోషిస్తున్నాను.
రెండు అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశాలు, అగ్రగామి ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ప్రయోజనాల కోసం కలసి పనిచేస్తున్నాయి. ‘భారత్ పై దృష్టి’ పత్రం దీనికి ప్రణాళికను అందిస్తుంది. దీనిలో జర్మనీ అనుసరిస్తున్న సమగ్ర విధానం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్‌లోని నైపుణ్యాలు కలిగిన శ్రామిక వనరులపై జర్మనీకున్న విశ్వాసాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
నైపుణ్యాలున్న భారతీయులకు ఏడాదికి ఇస్తున్న వీసాల సంఖ్యను ఇరవై వేల నుంచి తొంభై వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించింది.
ఇది జర్మనీ ఆర్థికాభివృద్ధికి మేలు చేస్తుందని విశ్వసిస్తున్నాను.
స్నేహితులారా,
మన ద్వైపాక్షిక వాణిజ్య 30 బిలియన్ డాలర్ల స్థాయిని దాటింది.
ప్రస్తుతం భారత్‌లో వందల సంఖ్యలో జర్మనీ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి. జర్మనీలోనూ భారత సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి.
వ్యాపార విస్తరణకు, నష్టాలను తగ్గించుకోవడానికి ప్రధాన కేంద్రంగా భారత్ మారుతోంది. అలాగే ప్రపంచ వాణిజ్యం, తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచానికి అవసరమయ్యే వస్తువులు భారత్‌లో తయారుచేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.
స్నేహితులారా,
యూరోపియన్ యూనియన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే అంశంలో ఆసియా-పసిఫిక్ సదస్సు ప్రధాన పాత్ర పోషించింది. ఈ వేదిక వాణిజ్యం, పెట్టుబడులకు మాత్రమే పరిమితమైనదిగా నేను భావించడం లేదు.
దీనిని ఇండో-పసిఫిక్ ప్రాంతానికి భాగస్వామ్యంగా, ప్రపంచానికి మంచి భవిష్యత్తుగా పరిగణిస్తున్నాను. స్థిరత్వం, నమ్మకం, పారదర్శకత ఈ ప్రపంచానికి అవసరం. ఈ విలువలు సమాజం, సరఫరా వ్యవస్థలు సహా ప్రతి చోటా స్పష్టంగా కనిపించాలి. వీటిని పాటించకుండా ఏ దేశమూ, ఏ ప్రాంతమూ ఉజ్వల భవిష్యత్తును సాధించలేదు.
ప్రపంచ భవిష్యత్తులో ఇండో-పసిఫిక్ ప్రాంతం చాలా కీలకం. అంతర్జాతీయ వృద్ధి, జనాభా లేదా నైపుణ్యాలపరంగా ఈ ప్రాంతం అందించే సహకారం, సామర్థ్యం అపరిమితం.
కాబట్టి, ఈ సదస్సు గొప్ప ప్రాధాన్యాన్ని కలిగి ఉంది.
స్నేహితులారా,
స్థిరమైన రాజకీయం, ఊహించగలిగిన విధాన వ్యవస్థకు భారత ప్రజలు విలువనిస్తారు.
అందుకే 60 ఏళ్ల తర్వాత వరుసగా మూడోసారి ఒకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత దశాబ్దంలో సంస్కరణలు, పనితీరు, పాలనా విధానంలో వచ్చిన మార్పుల ద్వారా ప్రజల్లో నమ్మకం బలపడింది.
ఇదే భారత్‌లోని సామాన్యుడి భావన అయినప్పుడు వ్యాపారానికి, పెట్టుబడులకు ఇంతకంటే మంచి ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది?
స్నేహితులారా,
ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, సమాచారం అనే నాలుగు ప్రధాన వనరులతో భారత్ ముందుకు వెళుతోంది. ప్రతిభ, సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు ఈ దేశ అభివృద్ధికి సాధనాలు. ప్రస్తుతం ఓ గొప్ప శక్తి వీటన్నింటినీ నడిపిస్తోంది: అదే ఆకాంక్ష భారతదేశానికి బలం.
కృత్రిమ మేధ – ఏఐ, ఆకాంక్ష భారత్ సంయుక్త శక్తి మనతో ఉంది. మన యువత ఆకాంక్ష భారత్‌ను ముందుకు నడిపిస్తున్నారు.
గత శతాబ్ధంలో సహజ వనరులు అభివృద్ధిని నిర్దేశించాయి. ఈ శతాబ్ధంలో మానవ వనరులు, ఆవిష్కరణలు వృద్ధిని ప్రోత్సహిస్తున్నాయి. అందుకే యువతలో నైపుణ్యాలు, సాంకేతిక ప్రావీణ్యం పెంచడానికి భారత్ కట్టుబడి ఉంది.
స్నేహితులారా,
ప్రపంచ భవిష్యత్తు కోసం భారత్ ఈ రోజే పనిచేస్తోంది.
అది మిషన్ ఏఐ అయినా,
మా సెమీకండక్టర్ మిషన్,
క్వాంటమ్ మిషన్,
గ్రీన్ హైడ్రోజన్ మిషన్,
అంతరిక్ష సాంకేతికతకు సంబంధించిన కార్యక్రమాలు లేదా డిజిటల్ ఇండియా కార్యక్రమమైనా, ఏదైనా సరే అంతర్జాతీయ సమాజానికి అత్యుత్తమ, విశ్వసనీయమైన పరిష్కారాలు అందించడమే వీటి లక్ష్యం. ఈ రంగాల్లో పెట్టుబడులకు, ఒప్పందాలకు అనేక అవకాశాలున్నాయి.
స్నేహితులారా,
ప్రతి ఆవిష్కరణకు బలమైన పునాది వేసి, అవసరమైన ఇతర సదుపాయాలను కల్పించేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉంది. మేం అందిస్తున్న డిజిటల్ మౌలిక వసతులు నూతన అంకురాలకు, పరిశ్రమలకు నిరంతర అవకాశాలను కల్పిస్తాయి. రైళ్లు, రహదారులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు విస్తృత స్థాయిలో భారత్ పెట్టుబడులు పెడుతోంది. జర్మనీ, ఇండో-పసిఫిక్ ప్రాంతానికి చెందిన సంస్థలకు ఇక్కడ అపరిమిత అవకాశాలున్నాయి.
పునరుత్పాదక ఇంధన అంశంలో భారత్, జర్మనీ సంయుక్తంగా పనిచేయడం పట్ల సంతోషిస్తున్నాను.
గత నెల జర్మనీ సహకారంతో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడిదారుల అంతర్జాతీయ సదస్సు గుజరాత్‌లో జరిగింది.
ప్రపంచ స్థాయిలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్-జర్మనీ ఓ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. భారత్ అభివృద్ధి చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్ వ్యవస్థను మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
స్నేహితులారా,
భారత దేశ అభివృద్ధి కథలో భాగం పంచుకోవడానికి ఇదే సరైన సమయం.
భారత ఉత్సాహం జర్మనీ కచ్చితత్వాన్ని చేరుకున్నప్పడు,
జర్మనీ ఇంజినీరింగ్, భారత్ ఆవిష్కరణలతో కలసినప్పుడు,
జర్మనీ సాంకేతికత, భారతదేశ ప్రతిభతో మిళితం చేసినప్పుడు, ఇండో-పసిఫిక్ ప్రాంతం, ప్రపంచ ఉజ్వల భవిష్యత్తును ఊహించవచ్చు.
స్నేహితులారా
మీరు వ్యాపార ప్రపంచానికి చెందినవారు.
‘‘మనం కలిశామంటే అది వ్యాపారం కోసమే’’ అనేది మీరు జపించే మంత్రం.
భారత్‌కు రావడం అంటే వ్యాపారం కోసం మాత్రమే కాదు. ఇక్కడి సంస్కృతి, ఆహారం, షాపింగ్ గురించి కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉంటారని కచ్చితంగా చెప్పగలను.
కృతజ్ఞతలు. భారత్ లో జరిగిన ఈ సమావేశం, ఇక్కడ మీ బస ఫలవంతంగా, చిరస్మరణీయంగా ఉండాలని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు.
సూచన: ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం. ఇది యధాతథ అనువాదం కాదు.
***
(Release ID: 2068290)
Visitor Counter : 59
Read this release in:
Odia
,
Assamese
,
Manipuri
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam