శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సాంకేతిక బదిలీ ప్రధానాంశంగా హైదరాబాద్ భారత్ బయోటెక్ (బీబీఐఎల్) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న గౌహతీ ఐఏఎస్ఎస్టీ సంస్థ
Posted On:
24 OCT 2024 3:27PM by PIB Hyderabad
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ (బీబీఐఎల్) సంస్థతో కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగాని (డీఎస్టీ)కి చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ
దిఇనిస్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఏఎస్ఎస్టీ) కీలక పరిశోధన-అభివృద్ధి (ఆర్ అండ్ డి), ఉత్పత్తి తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా ఈశాన్య భారతదేశంలో సాంప్రదాయకంగా భుజించే పులియబెట్టిన ఆహారంలోని ప్రోబయాటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచగలవనీ, మందకొడిగా ఉన్న జీవక్రియల వల్ల కలిగే వ్యాధులను నియంత్రించగలవనీ, వయోవృద్ధి ప్రక్రియ సాఫీగా కొనసాగేందుకు దోహదపడగలవనీ వెల్లడైంది. ఆహారం నుంచీ ప్రోబయాటిక్స్ ను వేరు చేసి, విలక్షణ ఆరోగ్య ఉత్పత్తులుగా మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం సహాయపడుతుంది.
ఈశాన్య రాష్ట్రాల జీవపరిశ్రమల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఊతం, ప్రాంతంలోని అద్భుత జీవవైవిధ్య వినియోగం జంట లక్ష్యసాధనకు ఒప్పందం దారితీస్తుందనీ, అవగాహన ఒప్పందానికి నేతృత్వం వహించిన డీఎస్టీ కార్యదర్శి, ప్రొఫెసర్ అభయ్ కరండికర్ అన్నారు. గౌహతి కి చెందిన ఐఏఎస్ఎస్టీకి ఇదొక కీలక మైలురాయి వంటిదని ఆయన వ్యాఖ్యానించారు.
“ఐఏఎస్ఎస్టీ అభివృద్ధి పరుస్తున్న నూతన సాంకేతికతలను వాణిజ్య ఉత్పత్తులుగా పరివర్తన చేయడంలో భారత్ బయోటెక్ తో కుదిరిన ఒప్పందం సాధ్యం చేస్తుంది. తద్వారా, జీవాధారిత ఔషధాలూ, టీకాలూ, ఇతర ఆరోగ్య ఉత్పత్తుల్లో భారత్ బయోటెక్ సంస్థకు గల ప్రపంచస్థాయి గుర్తింపు, ఐఏఎస్ఎస్టీ ఉత్పత్తుల అమ్మకానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశోధనా ఫలాలను ఉత్పత్తులుగా మార్చి విపణిలో ఉంచే ముందు తప్పనిసరిగా చేపట్టవలసిన వైద్య ప్రయోగాలు, ఈ ఒప్పందం ద్వారా సాధ్యమవుతాయి. ఈ కొత్తరకం ఆరోగ్య ఉత్పత్తులు జీవక్రియలకు సంబంధించిన వ్యాధులతో పోరాడి, వయోవృద్ధి ప్రక్రియను సౌకర్యవంతంగా చేస్తాయన్న నమ్మకం నాకుంది”, అని అభయ్ కరండికర్ అభిప్రాయపడ్డారు.
ఒప్పందంపై ఐఏఎస్ఎస్టీ తరఫున సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆషిశ్ ముఖర్జీ, బీబీఐఎల్ తరఫున సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణా ఎల్లా, డాక్టర్ యోగేశ్వర్రావు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రొఫెసర్ ముఖర్జీ, ఇరు సంస్థల మధ్య సహకారం కీలకమైనదనీ, అది విద్యాపరమైన పరిశోధనలను వ్యాపార ఉత్పత్తులుగా పరివర్తన చేసే విలక్షణ అవకాశాన్ని కల్పిస్తోందని అన్నారు.
టీకాలూ, ఇతర కీలక ఆరోగ్య ఉత్పత్తుల్లో అగ్రగామి అయిన భారత్ బయోటెక్ సంస్థ, ఐఏఎస్ఎస్టీ ప్రోబయాటిక్ ఉత్పత్తులపై వైద్య ప్రయోగాలను జరిపి, అవి ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునేందుకు అవసరమైన సూచనలు చేస్తుంది.
ఇరుసంస్థలూ చేపట్టవలసిన బాధ్యతల గురించి ఒప్పందం స్పష్టంగా పేర్కొంటోంది. ఐఏఎస్ఎస్టీ శాస్త్రపరమైన పరిశోధనలూ, విజ్ఞానపరమైన భాగస్వామ్యంతో ముందుకు రానుండగా, భారత్ బయోటెక్ వ్యాపార పరమైన కార్యకలాపాల బాధ్యతను తీసుకుంటుంది. ప్రాజెక్టు ముందంజ, నిర్ణీత కాలపరిమితిలో లక్ష్యాల చేరికలను పర్యవేక్షించేందుకు ప్రాజెక్టులో ఆసక్తిగల అన్ని పక్షాల ప్రతినిధులూ, నియంత్రణ కమిటీగా ఏర్పడుతున్నారు. భాగస్వామ్యం వల్ల సాధ్యపడ్డ ఉత్పత్తుల అమ్మకానికి చెందిన ఆదాయంలో, రాయల్టీలు ఐఏఎస్ఎస్టీకు చెందుతాయని ఒప్పందం స్పష్టం చేస్తోంది.
సంప్రదాయిక విజ్ఞానానికి సంబంధించిన ఈ ప్రోబయాటిక్ ఉత్పత్తులు, ఊబకాయం, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులకు సహజసిద్ధమైన నివారణోపాయాలను అందించగలవని భావిస్తున్నారు. అంతేకాక, భారత జీవసాంకేతిక రంగ అభివృద్ధి వేగవంతమవడంలో సహాయ పడతాయి. మన దేశంలో జరిగే శాస్త్రీయ పరిశోధనలు ప్రపంచ ఆరోగ్య రంగానికి మేలు చేస్తూ సానుకూల ప్రభావాన్ని చూపగలవన్న విశ్వాసం వ్యక్తం చేసిన ఇరు సంస్థలూ, భాగస్వామ్యం పట్ల సంతృప్తిని వెల్లడించాయి.
కార్యక్రమానికి ఐఏఎస్ఎస్టీ ప్రొఫెసర్ డాక్టర్ మొజీబూర్ ఖాన్, డాక్టర్ ఎం మొహంతీ, డీఎస్టీ విభాగం, ఐఏఎస్ఎస్టీ బీబీఐఎల్ సంస్థల సీనియర్ అధికారులూ హాజరయ్యారు.
***
(Release ID: 2067991)
Visitor Counter : 68