కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ మోసపూరిత ఇన్ కమింగ్ కాల్స్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిందియా


సైబర్ నేరాల బారి నుంచి ప్రజలను రక్షించేందుకు టెలికాం విభాగం వేసిన మరో అడుగు

భారత ఫోన్ నంబర్లుగా కనిపించే అంతర్జాతీయ కాల్స్‌ను ఈ వ్యవస్థ గుర్తించి అడ్డుకుంటుంది

గడిచిన 24 గంటల్లో 1.35 కోట్లు అంటే 90 శాతం అంతర్జాతీయ మోసపూరిత ఇన్ కమింగ్ కాల్స్ గుర్తించి బ్లాక్ చేసిన వ్యవస్థ

Posted On: 22 OCT 2024 6:28PM by PIB Hyderabad

‘అంతర్జాతీయ మోసపూరిత ఇన్ కమింగ్ కాల్స్ నియంత్రణ వ్యవస్థ’ను కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి  శ్రీ జ్యోతిరాదిత్య సిందియా ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. టెలికాం కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం, సైబర్ నేరాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించే దిశగా టెలికాం విభాగం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో మైలురాయి.

 

ఇటీవల సైబర్ నేరస్థులు భారతీయ మొబైల్ నంబర్‌ (+91-xxxxxxxx)ల మాదిరిగా అంతర్జాతీయ మోసపూరిత కాల్స్ చేయడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి కాలింగ్ లైన్ ఐడెంటిటీ (CLI) లేదా ఫోన్ నంబర్ అని సాధారణంగా పిలిచే వీటిని విదేశాల నుంచి కాల్ చేస్తూ భారత్ నుంచే చేస్తున్నట్టుగా పక్కదోవ పట్టిస్తారు.

ఆర్థిక మోసాలకు పాల్పడటానికి, ప్రభుత్వాధికారుల మాదిరిగా నటించడానికి, భయాందోళనలు రేకెత్తించడానికి ఈ మోసపూరిత కాల్స్ చేస్తారు. మొబైల్ నంబర్లను డిస్కనెక్ట్ చేస్తామని టెలికాం విభాగం లేదా ట్రాయ్ అధికారుల మాదిరిగా  బెదిరించడం, నకిలీ డిజిటల్ అరెస్టులు, కొరియర్‌లో మాదకద్రవ్యాలు లేదా నార్కోటిక్స్, పోలీసు అధికారుల మాదిరిగా నటించడం, వ్యభిచార రాకెట్‌లో అరెస్టు బెదిరింపులు తదితర సైబర్ నేరాలకు సంబంధించిన సైబర్ నేరాల కేసులు ఉన్నాయి.

భారత టెలికాం చందాదారులకు వస్తున్న ఈ తరహా అంతర్జాతీయ మోసపూరిత కాల్స్‌ను గుర్తించి, ఆపేందుకు కమ్యూనికేషన్ల విభాగం(డీఓటీ), టెలికాం సేవల విభాగం(టీఎస్‌పీ) సంయుక్తంగా ఓ వ్యవస్థను రూపొందించాయి. ఈ వ్యవస్థ పని చేయడం ప్రారంభించిన 24 గంటల్లో భారతీయ ఫోన్ నంబర్లతో వస్తున్న అంతర్జాతీయ కాల్స్‌లో దాదాపు 1.35 కోట్లు లేదా 90 శాతం మోసపూరిత కాల్స్ గా గుర్తించారు. ఇవి భారతీయ టెలికాం చందాదారుల వరకు చేరకుండా టీఎస్పీలు అడ్డుకున్నాయి. ఈ వ్యవస్థ అమలుతో ఇకపై +91-xxxxxxx నంబర్లతో వస్తున్న టెలికాం చందాదారులకు మోసపూరిత కాల్స్ గణనీయంగా తగ్గుతాయి.

ఇటువంటి  ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మోసగాళ్ళు ఇతర మార్గాల ద్వారా వినియోగదారుల వరకు చేరుకునే సందర్భాలు ఎదురవచ్చు. అలాంటి అనుమానాస్పద కాల్స్ వివరాలను మీరు సంచార్ సాథీ (www.sancharsaasthi,gov.in)లోని చక్షు సౌకర్యంలో తెలియజేయవచ్చు. సైబర్ నేరాలను ముందుగా అడ్డుకోవడానికే టెలికాం విభాగం యత్నిస్తోంది.

ఇప్పటికే డబ్బును పోగొట్టుకున్నవారు లేదా సైబర్ నేరాల బాధితులు  సైబర్ నేరాల హెల్ప్ లైన్ 1930 లేదా https://www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు.

 

***




(Release ID: 2067221) Visitor Counter : 41


Read this release in: English , Urdu , Hindi , Tamil