హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబరు 21న అమర వీరులకు న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద నివాళి అర్పించనున్న కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా

లద్దాఖ్‌ పరిధిలోని హాట్ స్ప్రింగ్స్‌ వద్ద 1959 అక్టోబరు 21న చైనా సైనికుల ఆకస్మిక దాడిలో వీరులైన పదిమంది పోలీసులు తమ ప్రాణాలర్పించారు
ఈ అమరుల స్మారకార్థం విధి నిర్వహణలో అసువులబాసిన ఇతర అమర వీరులను ఏటా అక్టోబరు 21న స్మరించుకునే సంప్రదాయం వచ్చింది
పోలీసు సిబ్బంది త్యాగాలు... జాతీయ భద్రత-సమగ్రత పరిరక్షణలో వారి కీలక పాత్రకు గుర్తింపుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2018లో పోలీసు సంస్మరణ దినోత్సవం నాడు జాతీయ పోలీసు స్మారక చిహ్నం జాతికి అంకితం

Posted On: 18 OCT 2024 6:11PM by PIB Hyderabad

కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా 2021 అక్టోబరు 21న పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద అమర వీరులకు నివాళి అర్పిస్తారు.

   లద్దాఖ్‌ పరిధిలోని హాట్ స్ప్రింగ్స్‌ వద్ద 1959 అక్టోబరు 21న చైనా సైనికులు పెద్ద ఎత్తున ఆకస్మిక దాడి చేశారు. వారితో జరిగిన వీరోచిత పోరాటంలో 10 మంది పోలీసులు అమరులయ్యారు. వారి త్యాగానికి గుర్తుగా విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల గౌరవార్థం ఏటా అక్టోబరు 21న పోలీసు సంస్మరణ దినోత్సవం నిర్వహించే సంప్రదాయం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలోని పోలీసు సిబ్బంది త్యాగాలు, జాతీయ భద్రతతోపాటు సమగ్రత పరిరక్షణలో వారు పోషిస్తున్న కీలక పాత్రకు గుర్తింపుగా న్యూఢిల్లీలోని చాణక్యపురిలో నిర్మించిన జాతీయ పోలీసు స్మారక చిహ్నాన్ని (ఎన్‌పిఎం) ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ 2018లో పోలీసు సంస్మరణ దినోత్సవం నాడు జాతికి అంకితం చేశారు.

ఈ స్మారక చిహ్నం పోలీసు బలగాలకు జాతీయ గుర్తింపు నివ్వడంతోపాటు ఆత్మగౌరవం, ఐక్యతా సంకల్పం, ఉమ్మడి చరిత్ర, కర్త్యవ దీక్ష స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. అలాగే దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెట్టే వారి అంకిత భావాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఈ స్మారక చిహ్నంలో భాగంగా మధ్యలో ‘ప్రధాన శిల్పం’తోపాటు ‘వాల్ ఆఫ్ వాలర్’ (పరాక్రమ కుడ్యం), మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన శిల్పం 30 అడుగుల ఎత్తయిన ఏకఖండ గ్రానైట్ సమాధి రూపంలో నిర్మితమైంది. ఈ శిల్పం పోలీసు సిబ్బంది శక్తిసామర్థ్యాలతోపాటు వారిలో మొక్కవోని దీక్షను, నిస్వార్థ సేవాభావాన్ని సూచిస్తుంది. అలాగే అమర వీరుల పేర్లు చెక్కిన ‘పరాక్రమ కుడ్యం’ స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలకు, త్యాగానికి సుస్థిర ప్రతీకగా నిలుస్తుంది. మరోవైపు పోలీసు వ్యవస్థ పరిణామం, దేశవ్యాప్తంగా ఆ వ్యవస్థ పనితీరును ప్రదర్శించేదిగా మ్యూజియంను రూపుదిద్దారు. ఈ స్మారక చిహ్నం ఒక యాత్రాస్థలం మాత్రమేగాక పోలీసు సిబ్బందితోపాటు పౌరులకూ గౌరవప్రద ప్రదేశం. సోమవారం మినహా వారంలో మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ ప్రదేశాన్ని ప్రజలు, పర్యాటకులు సందర్శించవచ్చు. ప్రతి శని, ఆదివారాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్) సాయంత్రం సూర్యాస్తమయానికి ఓ గంట ముందు ‘ఎన్‌పిఎం’ వద్ద బ్యాండ్ ప్రదర్శన, కవాతు, ముగింపు కార్యక్రమం నిర్వహిస్తాయి.

దేశవ్యాప్తంగా ఏటా అక్టోబరు 21న పోలీసు సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద నిర్వహించే ప్రధాన కార్యక్రమంలో పోలీసు అమరులకు నివాళి అర్పిస్తారు. ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులతోపాటు ‘సిఎపిఎఫ్’ సిబ్బంది ఉమ్మడి కవాతు చేస్తారు. కేంద్ర హోంమంత్రితోపాటు సహాయ మంత్రి, ఎంపీలు, ‘సిఎపిఎఫ్’తోపాటు ‘సిపిఒ’ల అధిపతులు తదితర ప్రముఖులు పుష్పగుచ్ఛాలు ఉంచి అమరులకు నివాళి అర్పించడం ఆనవాయితీ. అనంతరం అమరులను స్మరిస్తూ కేంద్ర హోంమంత్రి తన ప్రసంగంలో భాగంగా విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొనే సవాళ్లను వివరిస్తారు. రిటైర్డ్ డీజీలు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. హాట్ స్ప్రింగ్స్ అమరుల స్మారకమైన బలిపీఠం వద్ద కేంద్ర హోంమంత్రి పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించడంతో కార్యక్రమం సమాప్తమవుతుంది.

   ఆ తర్వాత ‘సిఎపిఎఫ్’తోపాటు ‘సిపిఒ’లు అక్టోబరు 22 నుంచి 30 వరకు ‘ఎన్‌పిఎం’ వద్ద వివిధ స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమరవీరుల కుటుంబ సభ్యుల సందర్శన, పోలీసు బ్యాండ్ ప్రదర్శన, మోటార్ సైకిల్ ర్యాలీ, అమరుల కోసం పరుగు, రక్తదాన శిబిరం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు, వీడియోల ప్రదర్శన వంటివి కూడా ఉంటాయి. పోలీసు సిబ్బంది త్యాగం, శౌర్యం మరియు సేవ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోలీసు బలగాలు ఇదే తరహాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

 

జాతీయ పోలీసు స్మారకం

చాణక్యపురి, న్యూఢిల్లీ


(Release ID: 2066267) Visitor Counter : 74