నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూ ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ) అసెంబ్లీ ఏడో సదస్సుకు హాజరు కానున్న 120 సభ్య దేశాల నేతలు


ప్రపంచ దేశాలలో సౌర రంగంలో సహకారానికి ఒక కీలక వేదికగా ఐఎస్ఏ రూపొందింది; ఐఎస్ఏ సభ్యత్వ దేశాలు, అనుబంధిత దేశాలు ప్రస్తుతం 120కి పెరిగాయి: కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ

నవంబరు 3-6 మధ్య న్యూ ఢిల్లీలో ఐఎస్ఏ ఏడో సదస్సు


Posted On: 16 OCT 2024 7:01PM by PIB Hyderabad

అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) అసెంబ్లీ ఏడో సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని న్యూ ఢిల్లీలో ఈ రోజు నిర్వహించారు.  అరవై దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఐఎస్ఏ సభకు కేంద్ర నూతన, పునరుత్సాదక ఇంధన శాఖ (ఎమ్ఎన్ఆర్ఈ) మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీ అధ్యక్షత వహించనున్నారు.  ఐఎస్ఏ సభ ఏడో సదస్సు ఓ ప్రపంచ స్థాయి కార్యక్రమం స్థాయిని సంతరించుకోనుంది.  ఇంధన లభ్యతను, భద్రతను, పరివర్తనను మెరుగు పరచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలపై భాగస్వామ్య సంస్థలు, ఇతర సంబంధిత వర్గాలతో పాటు నూట ఇరవై సభ్యత్వ దేశాల, అనుబంధిత దేశాల మంత్రులు, మిషన్స్ అధిపతులు దృష్టి సారించనున్నారు.

నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ కేంద్ర మంత్రి, ఐఎస్ఏ అసెంబ్లీ ప్రెసిడెంట్ శ్రీ ప్రహ్లాద్ జోషీ విశిష్ట సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘‘సభ్యత్వ దేశాలు, అనుబంధిత దేశాలు కలుపుకొని ప్రస్తుతం నూట ఇరవై దేశాలతో కూడిన ఐఎస్ఏ అంతర్జాతీయ సౌర సంబంధిత సహకారానికి ఒక కీలక వేదికగా మారింది.  ఈ కూటమి అంతకంతకు విస్తరిస్తుండడం ఇంధన లభ్యతలో మన దేశాలకన్నిటికి ఎదురవుతున్న  సవాళ్ళను, వాతావరణ మార్పు తాలూకు ప్రతికూల ప్రభావాలను పరిష్కరించడంలో ఐఎస్ఏ కీలక పాత్రను పోషిస్తోందని చాటిచెబుతోంది.  సౌర శక్తి ని వినియోగించుకోవడంలో  ఐఎస్ఏ సభ్యత్వ దేశాలు సాధించిన పురోగతి ప్రశంసనీయంగా ఉంది.  మన సభ్యత్వ దేశాలు కొన్నిటిలో ఏడాది పొడవునా సమృద్ధంగా లభిస్తున్న సూర్య రశ్మికి వాతావరణ సంబంధిత అంతర్జాతీయ కార్యాచరణలో మేలిమలుపును ఆవిష్కరించగల సామర్థ్యం ఉంది.  సౌర శక్తి స్వచ్ఛమైందీ, ఆధారపడదగ్గదీ, ఉచితంగా, ఏమంత పెద్ద ప్రయత్నాలు చేయకుండా వినియోగించుకోదగ్గదీ కావడంతో, అన్ని దేశాలు ఈ తరహా ఇంధనాన్ని వినియోగించుకొనే లక్ష్యాన్ని సాధించడంలో సౌర శక్తి కీలక భూమిక ను పోషించనుంది.  ఐఎస్ఏ ద్వారా మనం చేసే ప్రయత్నాల దృష్టి అంతాను సౌర శక్తి వినియోగ రంగంలో మౌలిక సదుపాయాలను విస్తరించడం, హరిత కొలువులను కల్పించడం, ఆ రంగంలో జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించడం, అలాగే వాతావరణం తాలూకు అననుకూల ప్రభావాలను తగ్గించడంపై కేంద్రీకృతమై ఉంది’’ అని శ్రీ ప్రహ్లాద్ జోషీ అన్నారు

భారత్  అధ్యక్షతన, ఫ్రాన్స్ సహాధ్యక్షతన ఐఎస్ఏ అసెంబ్లీ ఏడో సదస్సును ఈ ఏడాది నవంబరు 3 నుంచి 6 వరకు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్నారు. ఐఎస్ఏ సభ్యత్వ దేశాలు, అనుబంధిత దేశాలు కలుపుకొని 120 దేశాలకు చెందిన మంత్రులు, మిషన్ ప్రధానాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు, ఐఎస్ఏ లో చేరాలని ఆసక్తిని కనబరుస్తున్న దేశాలు, భాగస్వామ్య సంస్థలు, ప్రైవేటు రంగం, ఇంకా ఇతర ముఖ్య నిపుణులు ఈ సదస్సులో పాలుపంచుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో, భారత ప్రభుత్వ నూతన, పునరుత్సాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎమ్ఎన్ఆర్ఈ) సంయుక్త కార్యదర్శి శ్రీ అజయ్ యాదవ్ ప్రారంభోపన్యాసం చేస్తూ, ‘‘ప్రపంచ దేశాలలో సౌర శక్తి వినియోగంలో కొన్ని సవాళ్ళు సైతం ఇమిడి ఉన్నాయి.  పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, స్వదేశీకరణలకు సంబంధించిన సవాళ్ళే అవి.  ఈ సవాళ్ళను అధిగమించాలంటే అందుకు ఈ రంగం విస్తరణకు దన్నుగా నిలచే ఏకోన్ముఖ ప్రయత్నాలు అవసరమవుతాయి’’ అన్నారు.  ఐఎస్ఏ పోషిస్తున్న పాత్రను, ఐఎస్ఏ చేస్తున్న ఘనమైన కృషిని ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ఈ సవాళ్లను వివిధ కార్యక్రమాల ద్వారా, ప్రభుత్వాల, ప్రైవేటు వాణిజ్య సంస్థల, అంతర్జాతీయ సంస్థల సహకారం ద్వారా, సభ్య దేశాలతో కలసి ముందడుగు వేయడం ద్వారా పరిష్కరించాలని ఐఎస్ఏ భావిస్తోంది.  ఈ క్రమంలో ప్రపంచ దేశాలలో సరఫరా వ్యవస్థలను విస్తరించడం ద్వారా సౌర శక్తి డిమాండును పెంచుతూ, అందుకు తగ్గట్లుగా అదనపు తయారీ సామర్థ్యాన్ని  సృష్టించాలనుకొంటోంది’’ అన్నారు.  ఏకోన్ముఖ ప్రయత్నాలు ఏ విధంగా ఉంటాయో ఆయన వివరిస్తూ, ‘‘మాకు సభ్య దేశాలు, అనుబంధిత దేశాలు కలుపుకొని 120 దేశాలు ఉంటే, వాటిలో 102 దేశాలు ఐఎస్ఏ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ కు ఆమోదాన్ని తెలియజేశాయి  అంటే ప్రపంచవ్యాప్తంగా మా ముద్ర విస్తరిస్తూ ఉందని ఈ పరిణామం సూచిస్తోంది.  సభ్యత్వ దేశాల గట్టి మద్దతుతో ఐఎస్ఏ సౌరశక్తి వినియోగానికి  తగిన రంగాన్ని శరవేగంగా సిద్ధం చేసేందుకు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, సామర్థ్య నిర్మాణ ప్రయత్నాలను పెంచేందుకు వీలుగా అనేక కార్యక్రమాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది’’ అని శ్రీ అజయ్ యాదవ్ వివరించారు.

ఐఎస్ఏ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ మాట్లాడుతూ, ‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ స్)ను సాధించడానికి, మరీ ముఖ్యంగా స్వచ్ఛ ఇంధనం, వాతావరణ సంబంధిత కార్యాచరణలకు సంబంధించిన 7వ, 13వ ఎస్‌డీజీ లను నెరవేర్చడం కోసం ప్రపంచంలో జరుగుతున్న ప్రయత్నాలలో ఐఎస్ఏ ముందు వరుసలో నిలబడింది.  పరివర్తనను తీసుకు రావడానికి నడుం కట్టిన ఒక శక్తిగా ఐఎస్ఏ ఉందని చెప్పాలి.  ఇది సౌర శక్తి రంగంలో ఆర్థిక సహాయం, సాంకేతికతలు, నూతన ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి, సామర్థ్యాల పెంపుదల విషయాలలో సామరస్యాన్ని సాధిస్తూ, డిమాండును ఏకీకరిస్తూ ముందుకు సాగిపోతోంది.  ఈ కార్యక్రమం సంకీర్ణ పరిధికి మించి, మన ఇంధన ముఖచిత్రాన్ని గణనీయంగా మార్చివేసేందుకు ఉద్దేశించిన ఒక క్రాంతికారి ఉద్యమం’’ అని ఆయన వర్ణించారు. ‘‘2030 కల్లా పూర్తి చేయాలనుకొన్న కార్యక్రమాల పరంగా చూస్తే అందుకు ఆఖరి అయిదు సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్న స్థితిలో, ఐఎస్ఏ అసెంబ్లీ తాలూకు ఈ సదస్సు మన కార్యాచరణలను వేగవంతం చేసేందుకు, మన ఆకాంక్షలను పెంచుకొనేందుకు ఉద్దేశించిన ఓ ముఖ్య ఘట్టం.  కాబట్టి సంబంధిత వర్గాలన్నీ కూడా వాతావరణ సంబంధిత  కార్యాచరణలో ముందుకు పోయేందుకు ఈ దశాబ్దాన్ని సద్వినియోగపరచుకొని తీరాలి.  ఐఎస్ఏ వేదికగా మనం చేసే కృషి పారిస్ ఒప్పందంలోని అంశాల అమలును ప్రత్యక్షంగా సమర్థించేదే.  అంతేకాదు, స్థిరాభివృద్ధికి లక్షించిన ఐక్య రాజ్య సమితి స్థూల ఫ్రేమ్ వర్క్ కు తన వంతు తోడ్పాటును కూడా అందించేదే.  సౌర శక్తి రంగంలోకి పెట్టుబడులను తీసుకొని రావడానికి, సౌర శక్తి ఆధారితమైన మరిన్ని ప్రాజెక్టులకు అనువైన స్థితిని కల్పించడానికి, దీర్ఘకాలంలో సౌర సంబంధిత పథకాలు లాభదాయకంగా ఉండేటట్లు చూడడానికి అవసరమైన నైపుణ్యాలను ఆవిష్కరించడంలో సభ్య దేశాలతో కలసి ఐఎస్ఏ పాటుపడుతోంది’’ అని ఆయన అన్నారు.

ఐఎస్ఏ అసెంబ్లీ లో జరగనున్న చర్చలు సభ్యత్వ దేశాలలో, ప్రత్యేకించి ఇంధన లభ్యత పరిమితంగా ఉన్న ప్రాంతాలలో సౌర శక్తి ఉత్పాదనను వేగవంతం చేసేందుకు ఏ యే సాధనాలతో, ఏయే విధానాలతో ముందుకు పోవాలో అనే అంశాలపై మేధోమథనం చేస్తాయి.  దీనికి అదనంగా, ఈ కింద ప్రస్తావించిన ఐఎస్ఏ కీలక కార్యక్రమాలను గురించిన తాజా సమాచారాన్ని వ్యవస్థాపకులకు అందించడం, నైపుణ్యాల పెంపు, సామర్థ్య నిర్మాణం, ఆర్థిక వనరుల సమీకరణ, మెరుగైన ఎంపికగా సౌర శక్తి వైపు మొగ్గు చూపాలన్న మార్గదర్శనం చేయనున్నారు:

ఐఎస్ఏ ముఖ్య కార్యక్రమాలు:

సోలార్‌ఎక్స్ (SolarX) స్టార్ట్-అప్ చాలెంజ్: ఈ కార్యక్రమాన్ని ఈజిప్టులో సీఓపీ27 ను నిర్వహించిన నేపథ్యంలో 2022లో అమలులోకి తీసుకు వచ్చారు.  దీనికి ఇన్వెస్ట్ ఇండియా సహకారాన్ని ఐఎస్ఏ తీసుకొంది.  ఐఎస్ఏ సభ్యత్వ దేశాలలో విస్తరణకు వీలు ఉండే తరహా సౌర శక్తి ఉత్సాదన ప్రధానమైన వ్యాపార నమూనాలకు మద్దతును ఇచ్చి వ్యవస్థాపకులను ప్రోత్సహించడం ఈ సోలార్‌ఎక్స్ స్టార్ట్-అప్ చాలెంజ్ కార్యక్రమం ఉద్దేశం.

స్టార్-సి (STAR-C) ఇనీషియేటివ్: ఈ కార్యక్రమాన్ని ఫ్రాన్స్  కు చెందిన యూరోప్,  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తో పాటు యూఎన్ఐడీఓ కూడా కలసి 2022లో ప్రారంభించాయి. జాతీయ శిక్షణ అవసరాలకు సరిపోలే నైపుణ్యాలను అందించడం ద్వారా సామర్థ్యాలను పెంచడం ఈ కార్యక్రమం ధ్యేయం. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు ఆలంబనగా నిలచే ఫోటోవోల్టాయిక్,  సోలార్ థర్మల్ ఉత్పాదనల తయారీని ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది.

గ్లోబల్ సోలార్ ఫెసిలిటీ:  దీనిని సైతం 2022లోనే ప్రారంభించారు.  ఇంధన అవసరాలకు మద్దతుగా సౌర శక్తి రంగంలో పెట్టుబడులను పెంచడానికి, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో ఈ పనిని పూర్తి చేయడానికి సోలార్ పేమెంట్ గ్యారంటీ ఫండ్, సోలార్ ఇన్సూరెన్స్ ఫండ్ వంటి మాధ్యమాలను ఈ కార్యక్రమం ఉపయోగించుకొంటోంది.

మొట్టమొదటి అంతర్జాతీయ సౌర ఉత్సవం: ఈ కార్యక్రమాన్ని  గత నెల ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా భావి అవసరాలను తీర్చడానికి సౌరశక్తి రంగం దన్నుగా నిలచేలా సృజనశీలతను ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని అందుకోవడం, ఆలోచనలను పరస్పరం వెల్లడించుకోవడం కోసం కార్పొరేట్ సంస్థలు, విద్యా రంగ ప్రముఖులు, యువత, సాముదాయిక నేతలు తదితర వర్గాల వారు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.

ఐఎస్ఏ అసెంబ్లీ  ఏడో సదస్సు ముగిసిన తరువాత ఒక రోజంతా మరికొన్ని సదస్సులను నిర్వహిస్తారు.  స్వచ్ఛ ఇంధనం దిశగా పయనించడంలో తోడ్పడే కొత్త సాంకేతికతలను గురించిన ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని 2024 నవంబర్ 5న ఏర్పాటు చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ సౌర ఇంధన సమాజం (ఐఎస్ఈఎస్)లు  కూడా  సహకరించనున్నాయి.  ఈ సమావేశం మూడో సంచిక లో ఐఎస్ఏ సభ్యత్వ దేశాల మంత్రిత్వ శాఖల ప్రతినిధి వర్గాలు, విధాన రూపకర్తలు, విషయ నిపుణులు, పరిశ్రమ నేతలు పాల్గొంటారు.  ఈ సమావేశంలో చర్చోపచర్చల రూపంలో భౌగోళిక వాతావరణ సంబంధిత లక్ష్యాలను సాధించే దిశలో చెప్పుకోదగిన ముందంజలను వేయనున్నారు.  సహకారాన్ని పెంపొందింపచేసుకొంటూ, నూతన ఆవిష్కరణలపట్ల శ్రద్ధ వహిస్తూ, కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించడానికి సౌరశక్తి ఉత్పాదనలను ప్రోత్సహించడంపై శ్రద్ధ తీసుకొంటారు.  కొత్త ఇంధన లభ్యత స్థాయిలను విస్తరించే, ఆర్థిక వృద్ధిని పెంచుకొనే మార్గాలను అన్వేషిస్తారు.  ఇదే సమావేశంలో సాంకేతిక విజ్ఞానం, ఆర్థిక సహాయం, ఇంకా మార్కెట్ లు.. ఈ అంశాలపై ఐఎస్ఏ వరల్డ్ సోలార్ రిపోర్ట్‌ ల మూడో సంచికను ఆవిష్కరించనున్నారు.

ఐఎస్ఏ అసెంబ్లీ కార్యకలాపాలు 2024 నవంబరు 6న న్యూ ఢిల్లీ శివారులలోని ఒక వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించడంతో ముగుస్తాయి.  అక్కడ అగ్రీవోల్టాయిక్ వ్యవస్థలు ఏ విధంగా పని చేస్తున్నదీ గమనించనున్నారు.  నజాఫ్‌గఢ్ లోని ఈ ప్రదేశాన్ని ఇండియా అగ్రీవోల్టాయిక్స్ అలయన్స్ నిర్వహిస్తోంది.  భారతదేశంలో అగ్రీవోల్టాయిక్స్ భావనకు ఆదరణ పెరిగేటట్లు చూడడంలో భావసారూప్య సంస్థలతో  నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఇఎఫ్ఐ) కలసి చేపట్టిన కార్యక్రమం ఇది.  దీనిలో భాగంగా వ్యవసాయ కార్యకలాపాలతో పాటు సౌర ఇంధన ఉత్పాదనను కూడా చేపట్టాలని ప్రతిపాదించారు.    

ఐఎస్ఏ అసెంబ్లీని గురించి

ఐఎస్ఏ లో అత్యున్నత స్థాయి నిర్ణయాల రూపకల్పన ఈ అసెంబ్లీలో జరుగుతుంది.  ప్రతి సభ్య దేశానికి ఈ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంది.  ఐఎస్ఏ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ ను, ఇంకా ఇతర సమన్వయ పూర్వక కార్యాలను ఆచరణలో పెట్టడానికి సంబంధించిన నిర్ణయాలను ఈ అసెంబ్లీ తీసుకొంటున్నది.  ప్రతి సంవత్సరంలో ఒకసారి ఈ అసెంబ్లీ సమావేశమవుతున్నది.  కార్యక్రమాల అమలు తీరుతెన్నులు, సౌర శక్తి పథకాల కార్యాచరణ, అందుకు అయ్యే వ్యయం, ఎంత ఆర్థిక సహాయం అవసరమవుతుంది అనే అంశాలను ఈ అసెంబ్లీ మదింపు చేస్తుంది.  ఐఎస్ఏ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్ పై 120 దేశాలు సంతకాలు చేశాయి.  వాటిలో 102 దేశాలు ఐఎస్ఏ లో పూర్తి కాలపు సభ్యులుగా మారేందుకు కొన్ని పత్రాలను దాఖలు చేశాయి. ఐఎస్ఏ అసెంబ్లీకి ప్రెసిడెంట్ గా భారత్ ఉంది.  ఫ్రాన్స్ ఈ ఐఎస్ఏ అసెంబ్లీకి కో-ప్రెసిడెంట్ గా ఉంది.

ఇంధన లభ్యత, భద్రత, ఇంకా పరివర్తనలను గురించిన ఐఎస్ఏ కార్యక్రమాలపై ఐఎస్ఏ అసెంబ్లీ ఏడో సదస్సు చర్చిస్తుంది.  ఈ క్రమంలో కింది అంశాలపై దృష్టిని సారిస్తుంది:

సౌర ఇంధనాన్ని ఒక మేలైన ఎంపికగా సభ్య దేశాలు అమలు చేసేందుకు తగిన స్థితిని వాటికి కల్పించడం
 
సౌర రంగంలో వ్యవస్థాపకులు  వారి కార్యకలాపాల స్థాయిని పెంచేటట్లుగా వారికి మద్దతును ఇచ్చి ఆ తరహా ఇంధన ప్రాప్తి స్థాయిని విస్తరించడం
 
 సౌర శక్తి ఉత్పాదన సదుపాయాలను మరిన్నింటిని నెలకొల్పడానికి అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించడం

 

అంతర్జాతీయ సౌర కూటమిని గురించి

 

అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) ఒక అంతర్జాతీయ సంస్థ.  దీనిలో సభ్యత్వ దేశాలు, అనుబంధిత దేశాలు కలిపి 120 దేశాలు ఉన్నాయి.  ఇది ఇంధన లభ్యతను మెరుగు పరచడానికి, రాబోయే రోజులలో కర్బన ఉద్గారాలకు తావు ఇవ్వకుండా ఉండడానికి, ఒక నిలకడైన మార్గంగా సౌర శక్తిని ప్రోత్సహించడానికి  వివిధ దేశాల ప్రభుత్వాలతో కలసి కృషి చేస్తుంది.

సౌర శక్తి రంగంలో 2030 కల్లా ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ మేరకు పెట్టుబడులను తీసుకురావాలన్నది ఐఎస్ఏ ధ్యేయం.  దీనిలో భాగంగా సాంకేతికత సంబంధిత వ్యయాన్ని తగ్గించడం, కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించడం చేస్తుంది.  వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా,  విద్యుత్తు ఉత్పాదన రంగాలలో సౌర శక్తి వినియోగాన్ని ఐఎస్ఏ ప్రోత్సహిస్తుంది.  విధానాల, నిబంధనల అమలు, ఉత్తమ విధానాలను ఇచ్చి పుచ్చుకోవడం, ఉమ్మడి ప్రమాణాలపై అంగీకారం, పెట్టుబడులను సమీకరించడం.. ఈ ఈ మార్గాలలో ఐఎస్ఏ సభ్య దేశాలు మార్పునకు చోదక శక్తులుగా ఉంటున్నాయి.  ఐఎస్ఏ సోలార్ పథకాల కోసం కొత్త కొత్త వ్యాపార నమూనాలను గుర్తించి, వాటిని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది.  ప్రభుత్వాలు ఇంధన సంబంధిత చట్టాలను తీసుకు వచ్చేటట్లుగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ సోలార్ ఎనలిటిక్స్’  మాధ్యమం ద్వారా తగిన సమర్ధనను అందిస్తున్నది.  వేరు వేరు దేశాలకు సౌర రంగంలో సాంకేతిక విజ్ఞానం సంబంధిత  అవసరాలు ఏ మేరకు ఉన్నాయనేది బేరీజు వేసి, అందుకయ్యే ఖర్చును తగ్గించే చొరవ తీసుకొంటున్నది.  నష్ట భయాన్ని తగ్గించి, ఈ రంగాన్ని ప్రైవేటు పెట్టుబడికి మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నది. సోలార్ ఇంజినీర్లకు, ఇంధన విధాన రూపకర్తలకు అవసరపడే సమాచారాన్ని మరింతగా అందుబాటులో ఉంచేటట్లు చూస్తున్నది.

యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లయిమేట్ చేంజ్ (యుఎన్ఎఫ్‌సీసీసీ)తో అనుబంధం కలిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇరవై ఒకటో సదస్సు (సీఓపీ21) పారిస్ లో 2015లో జరిగిన సందర్భంగా ఐఎస్ఏ ను ఏర్పాటు చేశారు.  బహుళ పార్శ్విక అభివృద్ధి బ్యాంకులతో (ఎమ్‌డీబీ స్), అభివృద్ధి ప్రధాన ఆర్థిక సహాయ సంస్థల (డీఎఫ్ఐ స్) తో, ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ సంస్థలతో, పౌర సమాజంతో, ఇతర అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాన్ని ఐఎస్ఏ ఏర్పరచుకొంది.  సౌర శక్తి ఉత్పాదన సదుపాయాలను తక్కువ పెట్టుబడితో పరివర్తనాత్మక ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఆవిష్కరించడం, ప్రత్యేకించి వీటిని కనీస స్థాయిలో మాత్రమే అభివృద్ధి చెందిన దేశాల (లీస్ట్ డెవలప్ డ్ కంట్రీస్.. ఎల్‌డీసీ స్), అభివృద్ధి చెందుతున్న చిన్న దీవుల (స్మాల్ ఐలండ్ డెవలపింగ్ స్టేట్స్.. ఎస్ఐడీఎస్)లో స్థాపించడం ఐఎస్ఏ ఆశయం.

 

***


(Release ID: 2066261) Visitor Counter : 107