రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘అంతర్జాతీయ మెథనాల్ సదస్సు’ను ప్రారంభించిన కేంద్ర రోడ్డు రవాణా - హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ


ఇంధన విషయాలలో స్వతంత్రంగా మనుగడ సాగించడానికి బయోఫ్యూయల్స్ ను ఉపయోగించాలి, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకోవాలి: శ్రీ గడ్కరీ

Posted On: 17 OCT 2024 1:21PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ ఈ రోజు న్యూ ఢిల్లీ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మెథనాల్ సదస్సు ను, ఎక్స్‌ పో ను కేంద్ర రోడ్డు రవాణా - హైవేల శాఖ మంత్రి  శ్రీ నితిన్  గడ్కరీ ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెరీ, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ వి.కె. సారస్వత్, భారత ప్రభుత్వ ప్రధాన వైజ్ఞానిక సలహాదారు శ్రీ అజయ్ కుమార్ సూద్ లు పాల్గొన్నారు.  మెథనాల్ ఆధారిత ఉత్పాదనలతో పాటు తత్సంబంధిత యంత్ర సామగ్రిని ప్రదర్శించిన ఒక ఎక్స్‌ పోను కూడా శ్రీ నితిన్ గడ్కరీ పరిశీలించారు.



శ్రీ నితిన్ గడ్కరీ సదస్సులో మాట్లాడుతూ, రెండు ఆందోళనకర అంశాలను ప్రస్తావించారు:  అవి, ఒకటోది కాలుష్యం; రెండోది శిలాజనిత ఇంధనాల దిగుమతులు.. "ఇవి రెండూ అంతకంతకూ పెరిగిపోతున్నాయన్నది  వాస్తవం.  స్వయంసమృద్ధిని సాధించాలి అంటే అందుకు సుమారు 22 లక్షల కోట్ల రూపాయల స్థాయిలో ఉన్న ఈ దిగుమతులను తక్షణం తగ్గించుకోవలసిన అవసరం ఉంది.  ఇప్పుడున్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు దృష్టిలో పెట్టుకొని ఇది జరగాలి" అని మంత్రి అన్నారు.  ఇంధన వినియోగం విషయంలో స్వాతంత్య్రాన్ని సంపాదించుకోవడంలో బయోఫ్యూయల్స్ కు ప్రాముఖ్యాన్ని ఇవ్వడం, వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించుకోవడం, భారత రైతుల సమృద్ధికి కృషి చేయడం గురించి శ్రీ గడ్కరీ ప్రముఖంగా ప్రస్తావించారు.  మెథనాల్, ఇథనాల్, ఇంకా బయో-కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (బయో-సీఎన్‌జీ)ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగిస్తూ దేశంలో వస్తు రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులను తగ్గించుకోవచ్చని కూడా ఆయన సూచించారు.



బయోఫ్యూయల్ రంగంలో ప్రత్యేకించి మెథనాల్ పరంగా భారతదేశం చెప్పుకోదగిన పురోగతిని సాధిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు.  మెథనాల్ ఉపయోగాన్ని ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి.  దీనిని చౌకగా పొందవచ్చు, పైపెచ్చు ప్రకృతికి ఇది ఎలాంటి హానీ చేయదు కూడా అని ఆయన అన్నారు.  కొన్ని రాష్ట్రాలలో లభ్యమవుతున్న నాసిరకం బొగ్గును మెథనాల్ తయారీలో సైతం ఉపయోగిస్తున్నారు అని ఆయన అన్నారు.



వ్యర్థాలను సంపదగా మార్చే విషయాన్ని శ్రీ గడ్కరీ చెప్తూ, టైర్ పౌడర్, ప్లాస్టిక్ వంటి పదార్థాలను రహదారి నిర్మాణంలో వినియోగిస్తున్నారు; బిటుమిన్ దిగుమతులను తగ్గించుకోవడానికి ఇది తోడ్పడుతుందని శ్రీ గడ్కరీ అన్నారు.  పంట వ్యర్థాలను ఉపయోగించుకొనే కార్యక్రమం దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచడంలో ఏ విధంగా తోడ్పడుతోందో కూడా ఆయన వివరించారు.

‘వ్యర్థాలను ఇంధనం’గా మార్చే సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యాన్ని మరీ ముఖ్యంగా ఎండుగడ్డి (పరాలి) నుంచి బయో-సీఎన్ జీని తయారు చేయడం గురించి మంత్రి చెప్పుకొచ్చారు.  ఈ విధానం 475 ప్రాజెక్టులలో ఆశాజనక ఫలితాలను ఇచ్చిందని ఆయన అన్నారు.  ఈ ప్రాజెక్టులలో నలభై వరకు పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతాలు, ఇంకా కర్నాటక లలో ఇప్పటికే చురుకుగా పనిచేస్తున్నాయన్నారు.  ఎండుగడ్డి ని బయో-సీఎన్‌జీ గా మారుస్తున్న తాలూకు నిష్పత్తి టన్నులవారీగా చూస్తే ఇంచుమించు 5:1 గా ఉంది.  బయోమాస్ సంబంధిత వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకొనే దిశలో, అలాగే బయోమాస్ ను తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుకు వీలున్న పద్ధతులపై మరింత పరిశోధన జరగాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.

పంట కోతల తరువాత పొలంలో మిగిలే గడ్డిపరకలను తగలబెట్టే సమస్య పంజాబ్ లో, హరియాణాలో తీవ్రంగా ఉందని శ్రీ గడ్కరీ అన్నారు.  ప్రస్తుతానికి మనం ఇటువంటి వట్టిగడ్డిలో అయిదింట ఒక వంతును ప్రాసెస్ చేయగలుగుతున్నాం. అయితే మరింత మేలైన ప్రణాళికను రూపొందిస్తే, వరిగడ్డిని ప్రత్యామ్నాయ ఇంధనాలకు ముడి పదార్థంగా వాడుకోవచ్చు.  వాయు కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవచ్చని ఆయన అన్నారు.  కాలుష్యం, శిలాజ జనిత ఇంధన దిగుమతుల వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి డబ్బు తక్కువగా ఖర్చయ్యే, దేశవాళీ, దిగుమతులకు ప్రత్యామ్నాయంగా నిలిచే, ఉపాధి కల్పనకు దోహదం చేసే విధానంతో భారత్ ముందుకు సాగవలసిన అవసరం ఉందని మంత్రి అన్నారు.

మెథనాల్ పై అంతర్జాతీయ సదస్సు ను, ఎక్స్‌ పోను ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ను శ్రీ నితిన్ గడ్కరీ మెచ్చుకొన్నారు.

 

 

***



(Release ID: 2065792) Visitor Counter : 20