సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పౌరులకు ప్రాధాన్యం’ దిశగా, కేంద్రప్రభుత్వ పింఛనుదారుల ఫిర్యాదుల సులభ పరిష్కారం కోసం సమగ్ర మార్గదర్శక సూత్రాలు


పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పరిచిన ‘సీపీఎన్జీఆర్ఏఎంఎస్’ వేదికపై అందిన ఫిర్యాదులను 21 రోజుల్లోగా పరిష్కరించేందుకు మంత్రిత్వశాఖలు, విభాగాల కృషి

పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా సమస్యల మూల కారణాల విశ్లేషణ

పింఛనుదారుల అన్ని ఫిర్యాదులకూ అంతర్జాల వేదిక ‘సీపీఎన్జీఆర్ఏఎంఎస్’ ద్వారా పరిష్కారాల అందజేత

Posted On: 16 OCT 2024 11:18AM by PIB Hyderabad

కేంద్రప్రభుత్వ పింఛనుదారులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన వేదిక ‘సీపీఎన్జీఆర్ఏఎంఎస్’ పనితీరును సమీక్షించిన ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆలోచన మేర, పింఛనుదారుల సమస్యలు మరింత సులభమైన, సున్నితమైన రీతిలో, సమర్ధంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.

‘పౌరులకు ప్రాధాన్యం’ అన్న ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించే ఈ మార్గదర్శకాలు, మరింత వేగంగా సమర్ధంగా పరిష్కారాల అందజేతకు దోహదపడతాయి.

కేంద్ర ప్రభుత్వ పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన సమగ్ర మార్గదర్శకాల్లోని కీలక అంశాలు ఈ విధంగా ఉన్నాయి:

1.    పింఛనుదారుల నుంచి ఫిర్యాదులు అందిన 21 రోజుల్లోగా వాటిని పరిష్కరించేందుకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు కృషి చేయవలసి ఉంటుంది. పరిష్కారాలకు ఎక్కువ సమయం అవసరమయ్యే సందర్భాల్లో వేదికపై ఆ విషయాన్ని నిర్ణీత సమయంలో తెలియజేయాలి.  

2. ఫిర్యాదులను ‘ఏకముఖ ప్రభుత్వ విధానం’ కింద పరిష్కరిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ “ఈ సమస్య ఈ కార్యాలయ పరిధిలోనిది కాదు” అన్న కారణం చూపి ఫిర్యాదును తోసిపుచ్చరాదు.

3.   సరైన రీతిలో పరిష్కారం అందించకుండా ఫిర్యాదును బుట్ట దాఖలు చేయరాదు. ఫిర్యాదును మూసివేసే ముందు, పరిష్కారం నిమిత్తం తీసుకున్న చర్యలను తెలుపుతూ అందుకు సంబంధించిన పత్రాలను తుది నివేదికలో పొందుపరచాలి.

4.   వేదికపై పెండింగ్ లో ఉన్న పింఛను ఫిర్యాదులను మంత్రిత్వ శాఖలు ప్రతి నెలా సమీక్షించాలి. తద్వారా నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యమైన పరిష్కారాలు అందించడం సాధ్యమవుతుంది.

5. ప్రజా ఫిర్యాదుల నోడల్ అధికారి ఫిర్యాదుల తీరుతెన్నులను విశ్లేషించి, మూల కారణాలను శోధించి ఫిర్యాదులను తగ్గించేందుకు కృషి చేస్తారు.

6. ఫిర్యాదు పరిష్కారం పట్ల సంతృప్తి చెందని దరఖాస్తుదారు, 30 రోజుల్లోగా తిరిగి అప్పీలు చేసుకోవలసి ఉంటుంది, కొత్త ఫిర్యాదును అప్పీలు నాయస్థానం ముప్పై రోజుల్లోగా పరిష్కరిస్తుంది. సంబంధిత పత్రాలతో కూడిన మౌఖిక నిర్ణయాన్ని కూడా  వెలువరిస్తుంది.

7.  మంత్రిత్వశాఖ లేదా విభాగాల వద్ద గల ఫిర్యాదు దరఖాస్తులను ‘సీపీఎన్జీఆర్ఏఎంఎస్’ పోర్టల్ కు అప్లోడ్ చేసి, ఫిర్యాదుల పరిష్కారాల తీరును పర్యవేక్షిస్తారు.

 

 

***



(Release ID: 2065452) Visitor Counter : 22