రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గంగానదిపై రైలు, రోడ్డు మార్గాల బ్రిడ్జి సహా 'వారణాసి-పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బహుళ మార్గాల బ్రిడ్జి' నిర్మాణాలకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి


నూతన నిర్మాణాల ద్వారా మెరుగైన అనుసంధానం , ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం - రవాణా ఖర్చులు, చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాల తగ్గింపునకు దోహదం

అనుసంధానతకు నోచుకోని ప్రాంతాల మధ్య రాకపోకల సదుపాయాల ఏర్పాటు ద్వారా రవాణా సామర్ధ్యం పెంపు, తద్వారా మెరుగైన రవాణా యాజమాన్యం, వేగవంతమైన ఆర్ధిక వృద్ధికి ప్రాజెక్టు చేయూత

రూ. 2,642 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్టు నాలుగేళ్ళలో పూర్తి

నిర్మాణ కాలంలో 10 లక్షల ప్రత్యక్ష పనిరోజుల కల్పన

Posted On: 16 OCT 2024 3:21PM by PIB Hyderabad

ప్రధానమంత్రి అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రిమండలి, రైల్వే శాఖకు చెందిన రూ.2,642 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. బహుళ మార్గాల నూతన ప్రాజెక్టు వివిధ మార్గాల్లో రద్దీని తగ్గించి, రాకపోకలను సులభతరం చేయడమే కాక,  భారతీయ రైల్వేలకు చెందిన అతి రద్దీ మార్గాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి-ఛందౌలీ మధ్య ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.

భారతీయ రైల్వేల్లోని ముఖ్య జోన్లను అనుసంధానించే కీలక స్టేషన్ గా ఉన్న వారణాసి, అటు తీర్థ యాత్రికులకు, పర్యాటకులకు, స్థానిక ప్రజలకూ ముఖ్య కేంద్రంగా నిలుస్తోంది. వారణాసి-పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ  జంక్షన్ మార్గం, యాత్రికులకు, వస్తు రవాణా వ్యవస్థలకూ కీలకంగా ఉండడంతో అత్యంత రద్దీని ఎదుర్కొంటుంది. బొగ్గు, సిమెంటు, ఆహారాధాన్యాల రవాణా సహా, పెరుగుతున్న పర్యాటక, పారిశ్రామిక అవసరాలకు వారణాసి జంక్షన్ మార్గం కీలకంగా ఉంది,  దాంతో ఈ మార్గంపై ఒత్తిడిని తగ్గించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరమవుతోంది. ఈ దిశగా ప్రభుత్వం గంగానది పై నూతన రైలు, రోడ్డు మార్గాల బ్రిడ్జి, ప్రస్తుతం ఉన్న రెండు లైన్లకు అదనంగా 3వ, 4వ  లైన్లు  నిర్మించాలని తలపెట్టింది. రవాణా పరిమాణం, సామర్ధ్యం, సహకారాలను మెరుగుపరిచి,  ఈ ప్రాంత సామాజిక ఆర్ధిక ప్రగతికి బాటలు వేయాలన్న లక్ష్యంతో నూతన ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రస్తావిత ప్రాజెక్టు ద్వారా ఈ మార్గంలో రద్దీ తగ్గడమే కాక, కొత్త మార్గాలకు ఏటా 27.83 మెట్రిక్ టన్నుల మేర సరుకు రవాణా  జరగగలదని భావిస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాల నూతన భారతంలో భాగంగా, కొత్త ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి జరిగి,  స్థానిక ప్రజలకు స్వయం ఉపాధి సహా మెరుగైన ఉపాధి అవకాశాలు లభించి, వారు ఆత్మనిర్భరత సాధించగలరని భావిస్తున్నారు.    

'పీఎం గతిశక్తి జాతీయ బృహత్ పథకం' కింద ఆమోదం పొందిన ఈ బహుళ మార్గాల అనుసంధాన ప్రాజెక్టు, సమగ్రమైన ప్రణాళిక ద్వారా రూపుదిద్దుకుంది. వివిధప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచి ప్రజలు, వస్తువులు, సేవల రవాణాను సులభతరం చేస్తుంది.

ఉత్తర ప్రదేశ్ లోని రెండు జిల్లాల్లో అమలవబోయే ఈ ప్రాజెక్టు వల్ల భారతీయ రైల్వేల నెట్వర్క్ 30 కిలోమీటర్ల మేర పెరుగుతుంది.

రైల్వే పర్యావరణ హిత, సమర్ధమైన ఇంధన పద్ధతులను కలిగిన రవాణా వ్యవస్థ. ఈ శాఖకు చెందిన నూతన ప్రాజెక్టు వల్ల రవాణా ఖర్చులు తగ్గి,   దేశ పర్యావరణ లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుంది.  అంతే కాక, 149 కోట్ల కిలోల కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ప్రాజెక్టు  సహాయపడుతుంది, ఇది 6 కోట్ల మొక్కలు నాటడానికి సమానం.

 

***



(Release ID: 2065438) Visitor Counter : 17