ప్రధాన మంత్రి కార్యాలయం
ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ – వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన పారిశ్రామికవేత్తలు
డిజిటల్ ఇండియా కోసం ప్రధానమంత్రి సాహసోపేత దార్శనికతను అభినందించడంతో పాటు సంస్కరణలు,
ఆవిష్కరణలు, భాగస్వామ్యాల దిశగా ప్రభుత్వం అందిస్తున్న మద్దతును కొనియాడిన పారిశ్రామికవేత్తలు
డిజిటల్ పాలన కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక సమగ్ర దృక్కోణం ఆవశ్యకతపై ప్రధాన మంత్రి నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించిన పరిశ్రమ నాయకులు
Posted On:
15 OCT 2024 2:23PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ - వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ) - 2024 సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎనిమిదో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించారు. డబ్ల్యుటిఎస్ఎ అనేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రామాణికీకరణ కార్యకలాపాలకు పాలక వర్గ సమావేశం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ సదస్సును ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో- భారతదేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఇది టెలికాం, డిజిటల్, ఐసిటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 190 దేశాలకు చెందిన 3,000 మందికి పైగా పారిశ్రామిక నాయకులు, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చిన ఒక కీలకమైన అంతర్జాతీయ సదస్సు.
రిలయెన్స్ జియో-ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ... భారతదేశ విశేష డిజిటల్ మార్పును శరవేగంగా ముందుకు తీసుకువెళ్లడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని ప్రశంసించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన శ్రీ మోదీ... ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి) ను సృజనాత్మకత, భాగస్వామ్య సహకారానికి ఒక ముఖ్యమైన వేదికగా నిలబెట్టారని, డిజిటల్ రంగంలో అపూర్వమైన వృద్ధికి సారధ్యం వహిస్తున్నారని ఆయన అన్నారు. 2జీ వేగం సరిపోక ఇబ్బంది పడే స్థాయి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద డేటా మార్కెట్ గా భారత్ ఎదిగిందని అంబానీ పేర్కొన్నారు. మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ను అన్వయించుకోవడంలో 155వ స్థానం నుంచి ప్రస్తుత స్థితికి భారత్ ప్రయాణం- ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమన్వయ శక్తికి నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. జన్ ధన్ ఖాతా వంటి కార్యక్రమాల ద్వారా బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న 530 మిలియన్లకు పైగా భారతీయులను చేర్చుకున్నామని, వీరిలో గణనీయమైన భాగం మహిళలేనని ఆయన పేర్కొన్నారు. ఆవిష్కరణల పట్ల మోదీ నిబద్ధత వల్ల దేశంలోని ప్రతి మూలకూ సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చారని, ఇందులో ఎవరూ వెనకబడిలేరని అంబానీ పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యంగా కృత్రిమ మేధ (ఎఐ)ను వివిధ రంగాల్లో మార్పునకు సాధనంగా ఉపయోగించాలని ఆయన ప్రతిపాదించారు. భారతీయ డేటాను దేశంలోనే ఉంచేందుకు డేటా సెంటర్ విధానాన్ని నవీకరించవలసిన అవసరం ఉందని, ఇది బలమైన ఏఐ అనుకూల వ్యవస్థను ప్రోత్సహించగలదని ఆయన అన్నారు.
భారతీ ఎయిర్ టెల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ శ్రీ సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా దార్శనికత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. భారత దేశ టెలికాం ప్రయాణం గురించి మాట్లాడుతూ టెలికాం మౌలిక సదుపాయాలు, డిజిటల్ సాంకేతికతలలో భారత్ సాధించిన విప్లవాత్మక పురోగతిని వివరించారు. 2014లో ప్రధానమంత్రి మోదీ ‘డిజిటల్ ఇండియా’ దృష్టితో నిజమైన మార్పు ప్రారంభమైందని, ఇది 4జీ విప్లవానికి నాంది పలికిందని అన్నారు. ఇది మన గ్రామీణ ప్రాంతాలతో నివసించే వారితో సహా లక్షలాది మంది స్మార్ట్ ఫోన్లు, అవసరమైన డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడానికి సామర్ధ్యాన్ని అందించింది. ఉత్పాదక అనుసంధానిత ప్రోత్సాహక (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ -పిఎల్ఐ) పథకం ద్వారా స్థానిక తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రధానంగా వివరించారు. టెలికాం పరికరాల తయారీ కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టారని అన్నారు. “దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మనం కట్టుబడి ఉన్నాం. ఉత్పాదక అనుసంధానిత ప్రోత్సాహక పథకం వంటి కార్యక్రమాలతో భారత్ ను టెలికాం పరికరాల తయారీ కేంద్రంగా మారుస్తున్నాం” అన్నారు. భవిష్యత్తు ప్రణాళికలను వివరిస్తూ- 5జీ టెక్నాలజీలో భారతదేశం ముందంజలో ఉందని, రాబోయే 12 నుండి 18 నెలల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో దీనిని విస్తృతంగా అమలు చేయాలని యోచిస్తున్నట్లు మిట్టల్ ప్రకటించారు. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ ఇ ఒ) నెట్ వర్క్ ల సామర్థ్యాలను కూడా ఆయన ప్రస్తావించారు. “ఈ నెట్వర్కులు మన దేశంలోని అత్యంత సవాలుతో కూడుకున్న ప్రాంతాల్లో కనెక్టివిటీలో ఉన్న అంతరాలను అధిగమించేందుకు సహాయపడతాయి. భారతీయులందరికీ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండేలా చూస్తాయి" అని అన్నారు.
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ శ్రీ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ- డిజిటల్ కనెక్టివిటీ ప్రాముఖ్యతను నిరంతరం గుర్తిస్తూ భారతదేశాన్ని మరింత అనుసంధానితంగా శక్తిమంతమైన, సమగ్ర డిజిటల్ దేశంగా మలిచేందుకు సంవత్సరాలుగా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతను ప్రముఖంగా పేర్కొన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ప్రజలు, వ్యాపారాలకు సమానంగా డిజిటల్ అనుసరణను వేగవంతం చేయడంపై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన ప్రశంసించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గరిష్ట మద్దతు అని అర్థం వచ్చే ఎంఎస్ఎంఇ పై ప్రధాన మంత్రి చెప్పిన మాటలను గుర్తు చేసిన శ్రీ బిర్లా... దేశంలో చిన్న వ్యాపారాలకు డిజిటల్ మార్పును ప్రోత్సహించడం ద్వారా గరిష్ట మద్దతును అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. 5జీ, ఐఒటి, ఎఐ, క్లౌడ్ సర్వీసెస్ వంటి టెక్నాలజీలపై దృష్టి సారించడంతోపాటు, ఆర్థిక వృద్ధి కోసం భారత ఎంఎస్ఎంఇ లకు సాధికారత కల్పించే డిజిటల్ సానుకూల వ్యవస్థను సృష్టించగలమన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. టెలీ మెడిసిన్ లో 10 కోట్ల టెలికమ్యూనికేషన్ కన్సల్టేషన్ల ఘనతను భారత్ సాధించిందని, ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన అన్నారు. గత సంవత్సరంలో ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, పరిశ్రమ పరిష్కరించిన అత్యంత ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించిన శ్రీ బిర్లా, స్పామ్, మోసాల నియంత్రణ, వాటి నుంచి రక్షణ కోసం తీసుకున్న చర్యలను వివరించారు. భారత టెలికాం రంగం సామర్థ్యం గురించి మాట్లాడుతూ... డిజిటల్ ఇండియా కోసం ప్రధాన మంత్రి సాహసోపేతమైన దార్శనికతను ఆయన ప్రశంసించారు. ప్రభుత్వ నిరంతర మద్దతుతో తమ వంతు కృషి చేస్తామని, ప్రధాని ఆశిస్తున్న డిజిటల్ ఇండియా భవితవ్యాన్ని సాకారం చేయడంలో సహకరిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత సంవత్సరం నిజంగా విశేషమైనదిగా మారేందుకు కృషి చేసిన ప్రభుత్వం, భాగస్వాములు, మొత్తం టెలికాం సమాజానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
2024 వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ, ఇండియా మొబైల్ కాంగ్రెస్ సందర్భంగా ప్రధాన మంత్రితో కలిసి కార్యక్రమానికి హాజరుకావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఐటీయూ సెక్రటరీ జనరల్ శ్రీమతి డోరీన్ బొగ్డాన్ మార్టిన్ తెలిపారు. ఐటియు, భారతదేశం మధ్య ప్రగాఢ సంబంధాలకు ఇది శక్తిమంతమైన చిహ్నమని అన్నారు. గత సంవత్సరం ఐటియు ఏరియా ఆఫీస్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రితో జరిగిన అర్థవంతమైన సంభాషణను ఆమె గుర్తు చేశారు. కొద్ది వారాల కిందట న్యూయార్క్ లో ప్రపంచ నాయకులు సమావేశమై ఫ్యూచర్ ఒప్పందాన్ని, దాని గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ను స్వీకరించడం గురించి ఆమె మాట్లాడారు. అక్కడ డిజిటల్ భవిష్యత్తు గురించి ప్రపంచానికి శక్తిమంతమైన సందేశాన్ని పంపారని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ పాలన (గ్లోబల్ డిజిటల్ గవర్నెన్స్) ఆవశ్యకతను ప్రధాని స్పష్టంగా చెప్పారని, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను యావత్ ప్రపంచంతో పంచుకోవాలనే భారతదేశ ఆకాంక్షను వ్యక్తం చేశారని ఆమె గుర్తు చేశారు. భారతదేశ జి 20 అధ్యక్ష హోదా సమయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) ప్రధాన ప్రాధాన్యతగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఐటియు విజ్ఞాన భాగస్వామిగా మారడంపై సంతోషం వ్యక్తం చేశారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ కు సంబంధించి భారత్ సాధించిన విజయాల నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రమాణాలు నమ్మకాన్ని పెంపొందిస్తాయని, మొబైల్ పరికరాల వాడకం ద్వారా ప్రతి భారతీయుని జీవితాన్ని మార్చే సేవలను అందించే సంస్థలు ఉన్నత స్థాయిలో పని చేయడానికి అవి శక్తిని ఇస్తాయని ఆమె చెప్పారు. విశ్వసనీయత, అందరినీ కలుపుకునిపోవడంతోపాటు తాజా సాంకేతికతల పూర్తి సామర్థ్యాన్ని ఇప్పటికీ ఆఫ్ లైన్ లో ఉన్న మానవాళిలో మూడో వంతు సహా ప్రతి ఒక్కరికీ అందిస్తుందని బొగ్డాన్ మార్టిన్ అన్నారు. ఆసియాలోనే ఇదే తొలి సమావేశం అని అంటూ, సాహసోపేతమైన సమిష్టి కార్యాచరణకు ఆమె పిలుపునిచ్చారు. రాబోయే 10 రోజుల్లో గ్లోబల్ డిజిటల్ గవర్నెన్స్ కు పునాదిగా అంతర్జాతీయ ప్రమాణాల పాత్రను బలోపేతం చేయగలమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ నైతిక ఉపయోగాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తూ, సాంకేతిక పురోగతికి అందరినీ డిజిటల్ రంగానికి జోడించాలని కోరారు.
***
(Release ID: 2065154)
Visitor Counter : 71
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam