ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

21వ ఆసియాన్-ఇండియా సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 10 OCT 2024 8:36PM by PIB Hyderabad

గౌరవ దేశాధినేతలకు,

నమస్కారం!

మీ అవగాహనను, సూచనలను పంచుకున్న అందరికీ ధన్యవాదాలు. భారత్-ఆసియాన్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం మేము కట్టుబడి ఉన్నాం. మనమంతా కలిసి మానవ సంక్షేమం, ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం ఐక్యంగా కృషిని కొనసాగిస్తామని నేను నమ్ముతున్నాను.

భౌతిక అనుసంధానానికి మాత్రమే కాకుండా ఆర్థిక, డిజిటల్, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలను సైతం పెంపొందించడానికి మేము చర్యలు కొనసాగిస్తాం.

మిత్రులారా,

ఈ ఏడాది ఆసియాన్ సదస్సు నినాదం అయిన “అనుసంధానాన్ని, అనుకూలతను పెంపొందించడం” గురించి నేను నా ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను.

ఈరోజు పదో నెలలో పదో రోజు, కాబట్టి నేను పది సూచనలు చేయాలనుకుంటున్నాను.

మొదటి అంశం, మన దేశాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, 2025ని "ఆసియాన్-ఇండియా పర్యాటక సంవత్సరం"గా మనం ప్రకటించవచ్చు. ఈ కార్యక్రమం కోసం, భారత్ 5 మిలియన్ డాలర్లు వెచ్చించనుంది.

రెండో అంశం, భారత యాక్ట్ ఈస్ట్ పాలసీ దశాబ్దోత్సవాల సందర్భంగా, భారత్-ఆసియాన్ దేశాల మధ్య అనేక రకాల కార్యక్రమాలను మేము నిర్వహించగలం. మా కళాకారులు, యువత, వ్యాపారవేత్తలు, మేధావులను అనుసంధానించడం ద్వారా, మేము ఈ వేడుకల్లో భాగంగా మ్యూజిక్ ఫెస్టివల్, యూత్ సమ్మిట్, హ్యాకథాన్, స్టార్ట్-అప్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలను నిర్వహించవచ్చు.

మూడో అంశం, "ఇండియా-ఆసియాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్" ద్వారా, మేము వార్షిక మహిళా శాస్త్రవేత్తల సదస్సును నిర్వహించగలం.

నాల్గో అంశం, కొత్తగా స్థాపించిన నలంద విశ్వవిద్యాలయంలో ఆసియాన్ దేశాల విద్యార్థులకు మాస్టర్స్ స్కాలర్‌షిప్‌ల సంఖ్యను రెండు రెట్లు పెంచనున్నాం. అదనంగా, భారతదేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ఆసియాన్ విద్యార్థుల కోసం కొత్త స్కాలర్‌షిప్ పథకం కూడా ఈ ఏడాది నుండి ప్రారంభిస్తాం.

ఐదో అంశం, "ఆసియాన్-ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం" సమీక్ష 2025 నాటికి పూర్తవ్వాలి. ఇది మన ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుంది, సురక్షితమైన, అనుకూలమైన, నమ్మదగిన సప్లయి చైన్ రూపొందించడంలో సహాయపడుతుంది.

ఆరో అంశం, విపత్తులను ఎదుర్కోవడం కోసం, "ఆసియాన్-ఇండియా ఫండ్" నుండి 5 మిలియన్ డాలర్లు కేటాయిస్తాం. భారత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, ఆసియాన్ మానవతా సహాయ కేంద్రం ఈ రంగంలో కలిసి పని చేయవచ్చు.

ఏడో అంశం, ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కునేందుకు, ఆసియాన్-ఇండియా ఆరోగ్య మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. భారత వార్షిక జాతీయ క్యాన్సర్ గ్రిడ్ ‘విశ్వం కాన్ఫరెన్స్’కు హాజరు కావడానికి ప్రతి ఆసియాన్ దేశం నుంచి  ఇద్దరు నిపుణులను మేం ఆహ్వానిస్తున్నాం.
ఎనిమిదో అంశం, డిజిటల్, సైబర్ సంబంధ సమస్యలను ఎదుర్కోవడం కోసం, భారత్-ఆసియాన్ దేశాల మధ్య సైబర్ పాలసీ గురించి చర్చలను నిర్వహించవచ్చు.

తొమ్మిదో అంశం, గ్రీన్ ఫ్యూచర్‌ను ప్రోత్సహించడానికి, భారత్-ఆసియాన్ దేశాల నిపుణులతో గ్రీన్ హైడ్రోజన్‌పై కార్యగోష్టులను నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.
పదో  అంశం, వాతావరణ సమస్యలను ఎదుర్కోవడం కోసం, "ఏక్ పేడ్ మా కే నామ్" (తల్లి కోసం ఒక మొక్క) అనే మా ప్రచారంలో బాగస్వాములు కావాలని నేను మీ అందరినీ కోరుతున్నాను.

నా పది ఆలోచనలకు మీ మద్దతు ఉంటుందని నాకు నమ్మకం ఉంది. వాటి అమలు కోసం మా బృందాల సహకారం ఉంటుంది.

ధన్యవాదాలు!

గమనిక: ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో మాట్లాడారు.


 

***



(Release ID: 2064016) Visitor Counter : 46