హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రముఖ పారిశ్రామికవేత్త, దివంగత రతన్ టాటాకు నివాళులర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ తరపున రతన్ టాటా పార్ధివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన హోం మంత్రి

దేశభక్తి, సమగ్రత మూర్తీభవించిన వ్యక్తిగా రతన్ టాటా జీ చిరస్మరణీయులు

ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందిన పారిశ్రామికవేత్త

ప్రపంచస్థాయిలో టాటా సంస్థను విజయవంతంగా నడిపారు

రతన్ టాటా జీవితం, దేశం పట్ల ఆయన నిబద్ధత భారత పారిశ్రామిక రంగంలో ధ్రువతారగా నిలుపుతాయి

దేశంలో పారిశ్రామిక రంగానికి నాయకత్వం వహించే వారికి రతన్ టాటా జీ వారసత్వం సదా మార్గదర్శకం

తరాలు మారినా రతన్ టాటా జీ భారతావని గుండెల్లో ఉంటారు

మన దేశం, ప్రజల సంక్షేమం పట్ల రతన్ టాటా నిబద్ధత లక్షలాది మంది కలలను సాకారం చేసింది

Posted On: 10 OCT 2024 5:29PM by PIB Hyderabad

ప్రముఖ పారిశ్రామికవేత్త, దివంగత రతన్ టాటాకు కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ముంబయిలో నివాళులర్పించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ తరపున రతన్ టాటా భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు.

అనంతరం ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో ఆయన ఇలా రాశారు, “రతన్ టాటా జీ మరణంతో దుఃఖంతో నిండిన హృదయం గల లక్షలాది మందిలో ఒకరిగా ఆయనకు నివాళులర్పించాను. అలాగే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ తరపున రతన్ టాటా జీ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించాను. దేశభక్తి, సమగ్రత మూర్తీభవించిన గొప్ప వ్యక్తిగా రతన్ టాటా జీ చిరస్మరణీయులు. ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందిన పారిశ్రామికవేత్తగా, ఆయన టాటా గ్రూప్‌ను ప్రపంచ స్థాయిలో విజయవంతంగా ముందుకు నడిపించారు. ఆయన జీవితం, దేశం పట్ల ఆయనకు గల నిబద్ధత భారతదేశ పారిశ్రామిక రంగంలో ఒక ధ్రువతారగా నిలుపుతాయి”.

“ఆయన విలువలకు కట్టుబడి, స్వచ్ఛమైన కార్పొరేట్ నియమాలతో టాటా గ్రూప్‌ను ముందుకు నడిపించారు, టాటా ట్రస్ట్‌ ద్వారా మెరుగైన సమాజ నిర్మాణం కోసం కృషి చేశారు. రతన్ టాటా జీ వారసత్వం దేశంలోని పారిశ్రామిక రంగానికి నాయకత్వం వహించే వారికి సదా మార్గదర్శకంగా ఉంటుంది.” అని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

మరో పోస్ట్‌లో కేంద్ర హోం, సహకార మంత్రి ఇలా రాశారు, “లెజెండరీ పారిశ్రామికవేత్త, నిజమైన జాతీయవాది అయిన శ్రీ రతన్ టాటా జీ మరణం చాలా బాధను కలిగించింది. ఆయన నిస్వార్థంగా మన దేశాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, భారత్, దేశ ప్రజల అభ్యున్నతి పట్ల ఆయనకు గల ఆరాటం, నిబద్ధత నన్ను ఆశ్చర్యపరిచేవి. మన దేశం, ప్రజల సంక్షేమం పట్ల ఆయన నిబద్ధత లక్షలాది మంది కలలను సాకారం చేసింది. కాలం రతన్ టాటా జీని దేశం నుంచి  ఎన్నటికీ వేరు చేయలేదు. ఆయన మన హృదయాలలో సదా జీవించి ఉంటారు. టాటా గ్రూప్‌కి, ఆయనను ఆరాధించే అసంఖ్యాక జనులకు నా సానుభూతి.


(Release ID: 2064012) Visitor Counter : 38