ఆయుష్
ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే కీలక మైలురాళ్లను చేరుకున్న కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ
ఆయుష్‌లో పారిశ్రామికీకరణ, వాణిజ్యంపై పరిశోధనా ప్రాజెక్టు చేపట్టేందుకు జేఎన్‌యూతో ఒప్పందం కుదుర్చుకున్న సీఏఆర్ఐ
ప్రత్యేక శిబిరాల ద్వారా 1500 మంది అట్టడుగు వర్గాల వారికి చికిత్స
ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందిన తొలి సీసీఆర్ఏఎస్ సంస్థగా సీఏఆర్ఏ
Posted On:
08 OCT 2024 3:35PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ఆయుర్వేద పరిశోధనా మండలి(సీసీఆర్‌ఏఎస్) ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ(సీఏఆర్‌ఐ) సరికొత్త మైలురాయిని అందుకుంది. ప్రభుత్వం ఏర్పాటైన తొలి వంద రోజుల్లో సాధించాలని నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది. ఆయుర్వేద విధానం ద్వారా వైద్య సదుపాయాలను మెరుగుపరిచే అంశంలో, ఆయుష్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో సీఏఆర్ఐ నిబద్ధతను ఈ విజయం తెలియజేస్తుంది.
1. లక్ష్యాన్ని చేరుకున్న వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం: వయోధికుల అవసరాలకు అనుగుణంగా ఆరోగ్యసేవలను అందించేందుకు ఉద్దేశించిన ప్రత్యేక కార్యక్రమ లక్ష్యాన్ని సీఏఆర్ఐ అధిగమించింది. దీని ద్వారా 2000 మంది వృద్ధులకు ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవుట్ పేషెంట్ విభాగం ద్వారా 2,272 మందికి వైద్య సేవలు అందించారు. ఓపీడీ ద్వారా వైద్యులను సంప్రదించిన వారికి సంపూర్ణ ఆయుర్వేద పద్ధతులను అనుసరించి చికిత్స అందించి, జీవనశైలి మార్పులను సూచించారు. ఇది వయోధికుల ఆరోగ్య సమస్యలను నయం చేయడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచింది.
2. ఎస్సీఎస్పీ ద్వారా అట్టడుగు వర్గాలకు చేరువ: షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక(ఎస్సీఎస్పీ)లో భాగంగా తొలి వంద రోజుల్లో 80 పర్యటనలు, 8 శిబిరాలు నిర్వహించింది. వీటి ద్వారా సుమారుగా 1500 మంది రోగులకు చికిత్సను సీఏఆర్ఐ అందించింది. అలాగే 480 మంది వ్యక్తులపై సమగ్ర సర్వే నిర్వహించి వారి జీవన పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, తరచూ సంక్రమించే వ్యాధులపై అధ్యయనం చేశారు. 1,980 స్క్రీనింగ్ పరీక్షలు చేసి జీవనశైలి సమస్యలను గుర్తించారు. ఇది వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న అట్టడుగు వర్గాల్లో ఆరోగ్య సంరక్షణకు మెరుగైన విధానాన్ని సూచిస్తుంది.
3. లేడీ హార్డింగ్ ఆసుపత్రిలో సమీకృత ఔషధ విభాగం ఏర్పాటు: న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రాంగణంలో సమీకృత ఔషధ విభాగాన్ని సీఏఆర్ఐ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఆధునిక వైద్య సేవలు అందించి, ఆయుష్ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తారు. అలాగే జాతీయ ఆరోగ్య విధానం(ఎన్‌హెచ్‌పీ) 2017 ప్రకారం సమగ్ర ఆరోగ్య సేవలను అందిస్తారు. ఓపీడీ సేవలు, పంచకర్మ పద్ధతిలో చికిత్స అందించే ప్రక్రియను ప్రారంభించడం ద్వారా ఈ మార్గదర్శక విభాగానికి సీఏఆర్ఐ పునాది వేసింది.
4. జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంతో వ్యూహాత్మక భాగస్వామ్యం:
ఆయుష్‌లో పారిశ్రామికీకరణ, వాణిజ్యాన్ని పెంపొందించడంపై పరిశోధన ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు జేఎన్‌యూతో సీఏఆర్ఐ విద్యా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆయుష్ ఉత్పత్తులు, సేవల నిర్వహణ సూత్రాలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. మొదటి వంద రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభమైంది. ఆయుష్ పరిశోధన, పరిశ్రమ వృద్ధిలో ఇది కొత్త దశను సూచిస్తుంది
5. పరిశోధన, ప్రచురణల్లో ముందడుగు: ఢిల్లీ కంటోన్మెంట్ బేస్ ఆసుపత్రి, హిండన్ లోని ఎయిర్ ఫోర్స్ ఆసుపత్రుల్లో రెండు ప్రతిష్టాత్మక సర్వేలను సీఏఆర్ఐ పూర్తి చేసింది. ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, జేఎన్‌యూ లాంటి అగ్రశ్రేణి సంస్థలతో భాగస్వామ్యంతో చేపడుతున్న తొమ్మిది అధ్యయనాలతో పాటు 19 పరిశోధన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో అలెర్జీ రినైటిస్‌పై పరిశోధనా పత్రాన్ని జర్నల్ ఆఫ్ మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్(జేఎంఐఆర్)లోని పబ్ మెడ్ స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ ఇండెక్స్ లో ప్రచురించింది. ఇది ఆయుర్వేద పరిశోధనపై శాస్త్రీయ విశ్వసనీయతను మరింత పెంచుతుంది .
6. ఆయుర్వేదం ద్వారా రోగి సంరక్షణ: సెప్టెంబర్ 17న రోగుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్పీవీసీసీ, న్యూఢిల్లీలోని ఏఐఐఏ సహకారంతో రెండు రోజుల జాతీయ సెమినార్‌ను సీఏఆర్ఐ నిర్వహించింది. ఆయుష్ విభాగంలో నిర్ధారణ పద్ధతుల పాత్ర అనే అంశంపై లోధీ రోడ్ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఈ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 150 మంది విద్యార్థులు, రీసెర్చి స్కాలర్లు, అధ్యాపకులు హాజరయ్యారు. ఆయుష్ పద్ధతుల ద్వారా రోగుల సంరక్షణపై ఈ సెమినార్ అవగాహనను పెంపొందించింది.
7. గుర్తింపు, సాధికారత కార్యక్రమాలు: ఎన్ఏబీహెచ్ గుర్తింపు పొందిన తొలి సీసీఆర్ఏఎస్ సంస్థగా సీఏఆర్ఐ అవతరించింది. పాథాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌లకు సైతం ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించింది. అలాగే ఆయుష్ అధికారుల్లో నిర్వహణా నైపుణ్యాలను పెంచేందుకు ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన శిక్షణ అందించింది,
8. ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు: స్వచ్ఛత పఖ్వాడా, పోషణ మాహ్‌తో సహా జాతీయ ప్రచారాల్లో తన సిబ్బంది, అధికారులను చురుగ్గా పాల్గొనేలా చేసి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, వెబినార్లు, శుభ్రతా కార్యక్రమాలను సీఏఆర్ఏ నిర్వహిస్తోంది.
9. తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం: ఈ నెల 29న జరిగే తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ సంస్థ సిద్ధమవుతోంది. ఔషధ మొక్కల పంపిణీ, పాఠశాలల్లో పోటీలు తదితర కార్యక్రమాలతో పాటు అవగాహన సదస్సులు, వెబినార్లు, ప్రసంగాలు నిర్వహిస్తుంది.
***
(Release ID: 2063344)
Visitor Counter : 53