వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దుబాయిలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ క్యాంపస్

Posted On: 07 OCT 2024 4:05PM by PIB Hyderabad

అంతర్జాతీయ వాణిజ్య అధ్యయన సంస్థ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ (ఐఐఎఫ్టీ) తొలి విదేశీ శాఖకు ‘దుబాయి ఎక్స్ పో సిటీ’ లోని ప్రతిష్ఠాత్మక ‘ఇండియన్ పెవిలియన్’ వేదిక కానుంది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఐఐఎఫ్టీ ఉప కులపతి ప్రొఫెసర్ రాకేశ్ మోహన్ జోషి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి/‘ఎక్స్ పో సిటీ దుబాయి అథారిటీ’ సీఈఓ రీమ్ అల్ హషీమీ సంతకాలు చేశారు. పరిశోధన కార్యక్రమాలు, స్వల్పకాలిక, మధ్యకాలిక కోర్సులు సహా త్వరలో ప్రధాన కార్యక్రమమైన ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టే యోచనలో ఉన్న ఐఐఎఫ్టీ, 2025 నాటికి సొంత భవనంలోకి మారగలదని భావిస్తున్నారు.   

అత్యున్నత ప్రమాణాల అధ్యయన, శిక్షణ, విద్యాసంస్థగా పేరుబడ్డ ఐఐఎఫ్టీ, తన తొలి విదేశీ శాఖను పూర్వపు ‘ఎక్స్పో 2020’ లోని ఇండియన్ పెవిలియన్ లో ప్రారంభిస్తోంది. యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) లో నివశిస్తున్న 35 లక్షల భారతీయులకు ప్రయోజనకారిగా ఉండడమే కాక, ఐఐఎఫ్టీ బ్రాండ్ కు గల విలువ పెంపు, సంస్థ అంతర్జాతీయ విస్తరణకు కూడా ఈ చర్య దోహదపడుతుంది.       

వాణిజ్యంలో స్థానిక మారకం వినియోగం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం వంటి అనేక ఒడంబడికల పునాదిగా ఐఐఎఫ్టీ, దుబాయి ఎక్స్ పో సిటీల మధ్య ఈ అవగాహన ఒప్పందం కుదిరింది. అబూ ధాబీ రాజవంశీకుడు షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్, ఈ ఏడాది సెప్టెంబర్ 2న ఢిల్లీ ఐఐటీ-అబూ ధాబీ శాఖను, బి టెక్ కోర్సుతో  ప్రారంభించారు.  

ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన కేంద్ర వాణిజ్యమంత్రి శ్రీ పీయూష్ గోయల్, దుబాయి క్యాంపస్ ప్రారంభం, ఐఐఎఫ్టీకు  సిసలైన ప్రపంచ స్థాయి విద్యాసంస్థ హోదా కల్పించగలదని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య అధ్యయనంలో తనకు గల విశేష అనుభవాన్ని యూఏఈ విద్యార్థులు, నిపుణులు, అధికారులకే గాక, అనేక దేశాలవారికి కూడా ఐఐఎఫ్టీ పంచగలదని అభిప్రాయపడ్డారు.  

దుబాయిలో తొలి విదేశీ శాఖను ప్రారంభిస్తున్న ఐఐఎఫ్టీకి అభినందనలు తెలిపిన వాణిజ్య కార్యదర్శి, సంస్థ ఛాన్సలర్ సునీల్ బర్థ్వాల్, ఈ చర్య సంస్థ- అంతర్జాతీయ విస్తరణకు దోహదపడటమే కాక, యూఏఈ సహా గల్ఫ్ ప్రాంతం అంతటితో మరిన్ని వాణిజ్యావకాశాలకు తలుపులు తెరుస్తుందని అన్నారు.

అత్యాధునిక సాంకేతికత కలిగిన శిక్షణ, పరిశోధనల ప్రపంచ స్థాయి సంస్థగా ఐఐఎఫ్టీకు  గుర్తింపును అందించడంలో, దుబాయి క్యాంపస్ ప్రారంభం కీలక అడుగని సంస్థ ఉప కులపతి ప్రొఫెసర్ రాకేశ్ మోహన్ జోషీ అన్నారు.

ఐఐఎఫ్టీ నేపథ్యం: అంతర్జాతీయ వాణిజ్యంలో పరిశోధన, శిక్షణ, విద్యను అందించే ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరు తెచ్చుకున్న ఐఐఎఫ్టీ- కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖలో స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా 1963లో ప్రారంభమయ్యింది. డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందిన ఐఐఎఫ్టీ, విదేశీ వాణిజ్యాన్ని అధ్యయనం చేస్తున్న ముఖ్య సంస్థ. దుబాయి ఎక్స్ పో సిటీతో చేతులు కలిపిన ఐఐఎఫ్టీ- సృజనాత్మకత, నిర్వహణ సౌలభ్య కేంద్రంగా పరిశోధన సహా అనేక విద్యాసంబంధిత కార్యకలాపాల్లో పాలుపంచుకుంటుంది.  

 

***



(Release ID: 2063113) Visitor Counter : 13


Read this release in: English , Urdu , Marathi , Tamil