కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్ నేరాలకు టెలీకమ్యూనికేషన్స్ విభాగం అడ్డుకట్ట: మోసపూరిత కాల్స్ నిరోధానికై త్వరలో ప్రత్యేక కేంద్రీయ విభాగం


‘చక్షు’ సాయంతో స్పామ్ కాల్స్ ను ఫిర్యాదు చేయండి: పౌరులకు సూచన

భారతీయ ఫోన్ నంబర్లతో ప్రతిరోజూ విదేశాలనుంచి వచ్చే 45 లక్షలకు పైగా అంతర్జాతీయ స్పామ్ కాల్స్ ను బ్లాక్ చేస్తున్న టెలిఫోన్ సేవల సంస్థలు

Posted On: 04 OCT 2024 4:31PM by PIB Hyderabad

ఇటీవలి  కాలంలో విదేశాల నుంచి వచ్చే అనేక మోసపూరిత కాల్స్ వల్ల భారతీయ వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు. ‘కాలింగ్ లైన్ ఐడెంటిటీ’ ద్వారా ఎవరు ఫోన్ చేస్తున్నదీ గుర్తించే సదుపాయం ఉన్నప్పటికీ, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న నేరస్తులు,  భారతీయ నంబర్ల నుంచే కాల్స్ వస్తున్నట్టు భ్రమింపజేస్తున్నారు. అటుపై,  మీ ఫోన్ నంబర్ డిస్కనెక్ట్ చేసి మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని భయపెట్టడమో, లేదా తాము ప్రభుత్వ అధికారులమని నమ్మబలికో, బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం, వ్యభిచారం వంటి నేరాలలో మీ ప్రమేయం ఉందంటూ  ఫోన్లు వస్తూండడంతో ప్రజల్లో ఆందోళన అధికమవుతోంది.  

నానాటికీ ఇటువంటి మోసాలు పెరుగుతూ ఉండడంతో, టెలికాం సేవల సంస్థలతో చేతులు కలిపిన ప్రభత్వ టెలి  కమ్యూనికేషన్స్ విభాగం, వినియోగదారులు మోసపూరిత కాల్స్ బారిన పడకుండా వాటిని ముందస్తుగా గుర్తించి,  బ్లాక్ చేసే అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టింది.  రెండు దశల్లో చేపట్టిన రక్షణ పథకంలో భాగంగా తొలి దశలో టెలికాం సేవల సంస్థలు తమ వినియోగదారుల జాబితాల్లోని ఫోన్ నంబర్లతో జరిగే మోసాలను గుర్తిస్తాయి. ఇక రెండో  దశలో, కేంద్రీయ స్థాయిలో ఇతర టెలికాం సేవల సంస్థల వినియోగదారుల జాబితా నుంచి వచ్చే కుట్రపూరిత కాల్స్ ను గుర్తిస్తారు.

ప్రస్తుతం దేశంలోని నాలుగు ముఖ్య టెలికాం సేవల సంస్థలూ ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. నేరస్థులు ప్రతిరోజూ దాదాపు 45 లక్షల ఫేక్ కాల్స్ చేస్తూ ఉండగా, వీటిలో మూడో వంతు కాల్స్ భారతీయ టెలికాం వ్యవస్థలోకి ప్రవేశించకుండా నిరోధించగలుగుతున్నాయి. మిగతా మోసపూరిత కాల్స్ ని నిరోధించగలిగే కేంద్రీయ వ్యవస్థ రూపకల్పన అతి త్వరలో జరగనుంది.

ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ, నేరస్థులు టెలిఫోన్ వినియోగదారులను మోసగించే కొత్త మార్గాలను కనుగొంటూనే ఉన్నారు. వీటి గురించి సమాచారం అందిన వెంటనే టెలికమ్యూనికేషన్స్ విభాగం సకాలంలో చర్యలు తీసుకుంటోంది. రోజురోజుకీ పెరుగుతున్న సాంకేతిక దృష్ట్యా, టెలికాం రంగాన్ని మరింత సురక్షితంగా ఉంచేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే, ఎంత బలమైన రక్షణ వ్యవస్థలు ఏర్పరిచ్చినప్పటికీ, నేరస్థులు అడపాదడపా వాటిని ఛేదించి మోసం చేయడంలో కృత్యకృత్యులవుతున్నారు.  

ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, వెంటనే తమకు తెలియజేయాలని, తద్వారా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను నిలువరించగలమని  టెలికమ్యూనికేషన్స్ విభాగం పౌరులకు సూచిస్తోంది. నేరగాళ్ళను ముందుగానే గుర్తించి వారు వినియోగదారులను మోసం చేయకుండా క్రియాశీల చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని చెబుతోంది.  

కేంద్రప్రభుత్వ సంచార్ సాథీ (https://sancharsaathi.gov.in/) వేదికలోని  ‘చక్షు’ సదుపాయాన్ని వినియోగించుకుని పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. అనుమానాస్పదంగా ఉన్న కాల్స్, సంక్షిప్త సందేశాలు (ఎస్సెమ్మెస్), వాట్స్ అప్ సందేశాల గురించిన ఫిర్యాదులను స్క్రీన్ షాట్ల ద్వారా తెలియచేయవచ్చు. మోసపూరిత కాల్ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా అందుకున్నదీ నమోదు చేయవచ్చు. ఫిర్యాదు నమోదు అవగానే వినియోగదారుడి ఫోన్ కు ఓటీపీ పంపడం ద్వారా, ఫిర్యాదు నిర్ధారణ జరుగుతుంది.

సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడటంలో చక్షు కీలక ముందడుగు. అనుమానాస్పద కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందించేందుకు స్పష్టమైన విధివిధానాలతో రూపొందిన చక్షు, నేరాలు జరగకుండా నిరోధించి, తద్వారా ప్రజలు ఆర్థికంగా కానీ, మరోరకంగా కానీ నష్టపోకుండా కాపాడగలుగుతుంది.

టెలికాం వనరులు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ప్రభుత్వం పలు ఇతర చర్యలను తీసుకుంటోంది:

i.             టెలికాం వనరులను సైబర్ నేరాలకు, ఆర్థిక మోసాలకు దుర్వినియోగపరచకుండా ఉండేందుకు టెలికాం విభాగం ‘డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్’ పేరిట ప్రాజెక్టును చేపట్టింది.

ii.     పౌరుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, టెలికాం విభాగం ఏర్పాటు చేసిన సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsaathi.gov.in) లో కింది విభాగాల్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు:

అ.    అనుమానాస్పద కాల్స్/సంక్షిప్త సందేశాలు, అనవసర వ్యాపార ప్రకటనల గురించి ఫిర్యాదులు.

ఆ.     తమ పేరిట నమోదైన మొబైల్ కనెక్షన్ల వివరాలు తెలుసుకుని, తాము అసలు కనెక్షన్ తీసుకోని సందర్భాల్లో కానీ, ఇకపై ఆ కనెక్షన్ అనవసరం అనుకున్నసందర్భాల్లోనూ నంబర్ ను డిస్కనెక్ట్ చేయించే సదుపాయం.

     ఇ.    ఫోన్ చోరీ అయినా లేదా పోగొట్టుకున్నా, ఆ విషయాన్ని తెలియచేస్తూ ఫిర్యాదు చేస్తే ట్రేసింగ్ ద్వారా ఆచూకీ/నంబర్ బ్లాకింగ్ సాధ్యం.    

     ఈ.     కొత్త లేదా వాడిన ఫోన్ ను కొనుక్కునేటప్పుడు, మొబైల్ పనితీరును, నాణ్యతను పరిశీలించే అవకాశాన్ని కల్పించడం.

ఉ.     కాలింగ్ లైన్ గుర్తింపు సౌలభ్యం ద్వారా భారతీయ నంబర్ తో వస్తున్న కాల్         అంతర్జాతీయ మోసపూరిత కాల్ గా నిర్ధారణ అయిన సందర్భాల్లో ఫిర్యాదు చేయడం.

iii.     సైబర్/ఆర్థిక నేరాల నివారణ నిమిత్తం భాగస్వాములందరూ అక్రమ కార్యకలాపాల గురించి సమాచారాన్ని పంచుకునే సురక్షిత అంతర్జాల వేదిక -‘డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్  ఫామ్ ’ ను టెలికాం విభాగం ఏర్పాటు చేసింది. టెలికాం విభాగం, అన్ని టెలికాం సేవల సంస్థలు, దేశీయాంగ మంత్రిత్వశాఖ, 460 బ్యాంకులూ/వివిధ ఆర్థిక సంస్థలూ, 33 రాష్ట్రాలూ/కేంద్రపాలిత ప్రాంతాలూ, కేంద్రీయ సంస్థలూ, ఇతర భాగస్వాములు ఇప్పటికే వేదికపై నమోదయ్యారు. డిస్కనెక్ట్ చేసిన  ఫోన్ల తాజా జాబితా అందజేత, అందుకు గల కారణాలను తెలపడం సహా అనేక సేవలను ఈ వేదిక అందిస్తుంది. దానితో ఆయా          ఫోన్ నంబర్లతో గల ఫోన్ కు సేవలు నిలిపివేయడం సహా అవసరమైన చర్యలు తీసుకునే వీలు కలుగుతుంది.

iv.     నకిలీ పత్రాల ద్వారా తీసుకున్న, లేదా పరిమితికి మించి తీసుకున్న కనెక్షన్లను, కృత్రిమ మేధ సహాయంతో టెలికాం విభాగం గుర్తించింది. ఇటువంటి అక్రమ కనెక్షన్ల, మోసాల్లో వినియోగించే ఫోన్ల ఏరివేతను,  టెలికాం విభాగం చేపట్టింది.

 టెలికాం విభాగం తీసుకున్న చర్యల వల్ల కలిగిన ఫలితాలు,  క్లుప్తంగా:

అ. నకిలీ పత్రాల ద్వారా తీసుకున్న 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లకు సేవల నిలిపివేత

ఆ. దేశంలో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలు/జిల్లాలను గుర్తించి, అక్కడ అక్రమ కార్యకలాపాల్లో వినియోగిస్తున్న 33.48 లక్షల మొబైల్ నంబర్లకు సేవల నిలుపుదల, మరో 49,930 మొబైల్ నంబర్ల   బ్లాకింగ్

ఇ.  ఒక్కో వ్యక్తికి కేటాయించిన గరిష్ఠ పరిమితికి మించి ఉన్నట్లు కనుగొన్న 77.61 లక్షల మొబైల్ కనెక్షన్లకు సేవల నిలిపివేత.

ఈ. సైబర్ నేరాలు, ఇతర అక్రమ కార్యకలాపాల్లో సంబంధమున్న 2.29 లక్షల  మొబైళ్ళ బ్లాకింగ్

ఉ.  దొంగిలించిన /పోగొట్టుకున్న 21.03 లక్షల ఫోన్లలో 12.02 లక్షల ఫోన్ల ఆచూకీ కనుగొన్నారు.

ఊ. హానికర ఎస్సెమ్మెస్ లను పంపే  20,000 బృందాల కార్యకలాపాల నిలిపివేత, ఈ పనిలో వినియోగించిన 32,000 ఎస్సెమ్మెస్ పరికరాలు, ఇతర సామగ్రి పట్టివేత.

ఎ. నకిలీ పత్రాలతో తీసుకున్న 11 లక్షల బ్యాంక్ అకౌంట్లు, ఆన్లైన్ ఆప్ ఖాతాల మూసివేత.

ఏ. నకిలీ పత్రాల ద్వారా తీసుకున్న అక్రమ ఫోన్లతో అనుసంధానమైన 11 లక్షల వాట్స్ అప్ ఖాతాలను సంస్థ తొలగించింది.

ఐ. వివిధ రాష్ట్రాలూ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 365 అక్రమ సిమ్ కార్డుల అమ్మకందార్ల పై కేసులు నమోదు, 71,000 సిమ్ ఏజెంట్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు.

 

***


(Release ID: 2063031) Visitor Counter : 57