ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉక్కు పరిశ్రమలో డీకార్భనైజేషన్‌ దిశగా బీహెచ్‌పీ, సెయిల్ మధ్య అవగాహనా ఒప్పందం

Posted On: 07 OCT 2024 1:53PM by PIB Hyderabad

ఉక్కు ఉత్పత్తిలో కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అతి పెద్ద ఉక్కు కర్మాగారం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్), ప్రముఖ అంతర్జాతీయ ఖనిజ సంస్థ బీహెచ్‌పీ మధ్య ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై రెండు సంస్థలు సంతకాలు చేశాయి. భారత్‌లో బ్లాస్ట్ ఫర్నేస్ విధానంలో చేస్తున్న ఉక్కు ఉత్పత్తిలో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రక్రియను ప్రోత్సహించే దిశగా సెయిల్, బీహెచ్‌పీ మధ్య ఈ కీలక ఒప్పందం కుదిరింది.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం సెయిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్)లు ఉన్న సమీకృత స్టీల్ ప్లాంట్లలో కర్బన ఉద్గారాలు తగ్గించే మార్గాల అన్వేషణ ఇప్పటికే రెండు సంస్థలు ప్రారంభించాయి. అలాగే గ్రీన్ హౌస్ ఉద్గారాల(జీహెచ్‌జీ)ను తగ్గించే వ్యూహాలను అంచనా వేసేందుకు ప్రాథమిక అధ్యయనం చేపడుతున్నాయి.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు స్థానికంగా పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలను పెంపొందించే ఉద్దేశంతో బీఎఫ్‌ల నిర్వహణకు హైడ్రోజన్, బయోచార్ వాడకం లాంటి ప్రత్యామ్నాయ వనరుల వినియోగాన్ని పరిశీలిస్తారు. సాంకేతికత విస్తరణ, బ్లాస్ట్ ఫర్నేస్‌ల వాడకాన్ని నియంత్రించే చర్యలు భారత్, అంతర్జాతీయ ఉక్కు పరిశ్రమలను డీకార్బనైజ్ చేసే క్రమంలో క్లిష్టమైనవి. ఈ ప్రక్రియలో మాధ్యమిక, దీర్ఘకాలిక భాగస్వామ్యాలు కీలకంగా మారతాయి.

సెయిల్ చైర్మన్ శ్రీ అమరేందు ప్రకాష్ మాట్లాడుతూ “ఉక్కు ఉత్పత్తి చేయడానికి స్థిరమైన మార్గాలను అభివృద్ధి చేసే దిశగా మరో ముందుడుగు వేసేందుకు బీహెచ్‌పీతో కలసి పనిచేయడానికి సెయిల్ ఎదురుచూస్తోంది. వాతావరణ పరమైన నిబంధనలకు అనుగుణంగా ఉక్కు రంగాన్ని నిర్వహించాల్సిన ఆవశ్యకతపై ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. భారత్ లో ఉక్కు పరిశ్రమకు వినూత్న భవిష్యత్తు కల్పించడం ద్వారా పర్యావరణ మార్పుల సమస్యను పరిష్కరించేందుకు సెయిల్ కట్టుబడి ఉంది’’ అని  అన్నారు.

బీహెచ్‌పీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాగ్ ఉడ్ మాట్లాడుతూ, “సెయిల్ సంస్థతో బీహెచ్‌పీ దీర్ఘకాల సంబంధాన్ని కొనసాగిస్తోంది. సెయిల్ బ్లాస్ట్ ఫర్నేస్‌లను డీకార్బనైజేషన్ దిశగా నడిపించే మార్గాలను అన్వేషించడానికి, ఈ బంధాన్ని మరింత విస్తరిస్తూ, బలోపేతం చేయడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ఈ పరిశ్రమలో కర్బన ఉద్గారాలు లేకుండా చేయడమనేది ఒంటరిగా ఎదుర్కోలేని సవాలుగా మేము గుర్తించాం. కర్బన ఉద్గారాల విషయంలో దీర్ఘకాలిక మార్పులు తీసుకొచ్చే విధంగా సమర్థమైన సాంకేతికతను అభివృద్ధికి చేసేందుకు, నైపుణ్యాలు, వనరులు వాడుకునేందుకు భాగస్వామ్య విధానంలో పనిచేయాల్సి ఉంటుంద"ని తెలిపారు.

 

***


(Release ID: 2063028) Visitor Counter : 57