ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయాసియా ప్రాంతీయ 77వ సమావేశాన్ని
ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా
ఏకముఖ ప్రభుత్వం, ఏకముఖ సమాజం.. అన్న కోణంలో భారత ఆరోగ్య వ్యవస్థ
భారంలేని ఆరోగ్య సేవల దిశగా ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థతోపాటు ముఖ్యమైన సేవల్ని బలోపేతం చేస్తున్నాం: జేపీ నడ్డా
‘‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి - జన్ ఆరోగ్య యోజన పేరిట ప్రభుత్వ నిధులతో ప్రపంచంలోనే అత్యంత భారీదైన ఆరోగ్య హామీ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం; ఈ కార్యక్రమంతో 12 కోట్ల కుటుంబాలకు లబ్ధి; ఒక్కో కుటుంబానికి ఏటా ఆసుపత్రి ఖర్చులకు 6 వేల అమెరికన్ డాలర్ల మేర ఆర్థిక సహాయాన్ని ఈ పథకం అందిస్తోంది’’
‘‘అసాంక్రామిక వ్యాధుల నియంత్రణ జాతీయ పథకం వల్ల 753 వైద్యశాలలు, 356 తాత్కాలిక ఉపశమన కేంద్రాలు, 6238 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవడానికే ప్రథమ ప్రాధాన్యం
డిజిటల్ ఆరోగ్య రంగంలో భారత్ ఓ దీపస్తంభం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఈ-సంజీవినీ, ఐహెచ్ఐపీ, సాక్షం వంటి డీపీఐలను పంచుకుంటాం. డబ్ల్యూహెచ్ఓ కార్యక్రమం- డిజిటల్ హెల్త్ ప్రారంభం
Posted On:
07 OCT 2024 12:07PM by PIB Hyderabad
భారంలేకుండా అందరికీ ఆరోగ్య సేవలు అందించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఏకముఖ ప్రభుత్వం, ఏకముఖ సమాజం అన్న భావనతో భారత ఆరోగ్య వ్యవస్థ పనిచేస్తోంది. ఈ దిశగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు ఇతర ముఖ్యమైన సేవల్ని బలోపేతం చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన 77వ ఆగ్నేయాసియా ప్రాంతీయ సమావేశం (ఎస్ఈఏఆర్ఓ)లో ఆయన మాట్లాడారు.
ప్రాంతీయ సంఘ ప్రారంభ సదస్సులో కార్యవర్గ ఎన్నిక, ‘‘తీర్మానాలు, నిర్ణయాల కోసం ఉద్దేశించిన ఒక ముసాయిదా రూపకల్పన సమూహాన్ని’’ ఏర్పాటు చేయడం, సదస్సు నిర్వహణతో పాటు తాత్కాలిక చర్చాంశాల పట్టికకు ఆమోదం తెలపడానికి ‘‘ప్రత్యేక విధి విధానాల’’ను ఆమోదించడం వంటివి ఈ ప్రారంభ సదస్సులో భాగాలుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన కేంద్రం షెఫ్ డీ కేబినెట్ డాక్టర్ రజియా పెండ్ సే, భూటాన్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ల్యోన్ పో టండిన్ వాంగ్ చుక్, మాల్దీవ్స్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ అబ్దుల్లా నాజిమ్ ఇబ్రహీమ్, నేపాల్ ఆరోగ్యం- జనాభా శాఖ మంత్రి శ్రీ ప్రదీప్ పౌదెల్, తిమోర్ లెస్తే ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఎలియా ఎంటనియో డీ అరుజో డాస్ రీస్ అమరల్, బంగ్లాదేశ్ ఆరోగ్య- కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నత కార్యదర్శి శ్రీ ఎమ్.ఎ. అక్ మల్ హుసైన్ ఆజాద్, ఇండోనేషియా ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ కుంటా విబావా దాసానుగ్రహ, శ్రీ లంక ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ పి.జి. మహీపాల, భారతదేశంలో డీపీఆర్ కొరియా రాయబారి శ్రీ చోయి హుయి చోల్ లతో పాటు థాయీలాండ్ సార్వజనిక ఆరోగ్య శాఖ డిప్యూటీ పర్మనెంట్ సెక్రటరీ డాక్టర్ వీరావుత్ ఇమ్ సమ్ రాన్ లు ఉన్నారు.
‘‘అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఎబి పిఎమ్-జెఎవై) పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ నిధులతో ప్రపంచంలో అత్యంత పెద్ద ఆరోగ్య హామీ పథకం ఇది. ఈ కార్యక్రమం ఒక్కో కుటుంబానికి ఏటా 6 వేల అమెరికన్ డాలర్లను అందిస్తోంది. ప్రస్తుతం 12 కోట్ల కుటుంబాలు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనాలను అందుకొంటున్నాయి’’ అని శ్రీ జె.పి. నడ్డా అన్నారు. ప్రభుత్వం ఇటీవలే ఈ పథకాన్ని 70 ఏళ్ళ వయస్సు, అంతకు పైబడిన వయస్సు కలిగిన వ్యక్తులకు వర్తింప జేసింది అని మంత్రి ప్రముఖంగా ప్రకటించారు. ‘‘ఈ చర్య తో దాదాపుగా నాలుగున్నర కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతాయి. అందులో 6 కోట్ల వరకు వయోవృద్ధులు ఉంటారు; వీరందరికీ ఉచిత ఆరోగ్య బీమా రక్షణ అందుబాటు లోకి రానుంది. వయస్సు మళ్ళిన పౌరుల సంఖ్య భారతదేశంలో నానాటికీ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో వారిని కూడా కలుపుకొని అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం చాటిచెబుతోంది’’ అని ఆయన అన్నారు.
అసాంక్రామిక వ్యాధులు (నాన్ కమ్యూనికబల్ డిసీజెస్- ఎన్సీడీ స్) వల్ల సార్వజనీన ఆరోగ్య రంగానికి ఎదురవుతున్న సవాళ్ళను గుర్తించి, ‘‘భారతదేశం 2010 నుంచి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎన్‌సీడీస్ ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులకు చికిత్సలను అందిస్తున్నారు. ఈ కార్యక్రమం అమలైనప్పటి నుంచి ఇంత వరకు 753 వైద్యశాలలు, 356 చికిత్సా కేంద్రాలతోపాటు 6,238 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. వ్యాధి ఆరంభ దశలోనే నివారక చర్యల పట్ల శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడమైంది’ అని వివరించారు.
డిజిటల్ మాధ్యమం ద్వారా ఆరోగ్య పర్యవేక్షణ రంగంలో భారతదేశం ఒక ఆశాకిరణంలా నిలుస్తోందని మంత్రి శ్రీ జె.పి. నడ్డా అన్నారు. జి-20 కూటమికి భారతదేశం అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన కాలంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ)- ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించిన డిజిటల్ హెల్త్ కార్యక్రమం ద్వారా సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తూ, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను(డిపిఐ స్)ను తీసుకునేందుకు ఆసక్తి ఉన్న ఇతర దేశాలకు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది అని మంత్రి తెలిపారు. డీపీఐస్ లో ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’, ‘ఇ-సంజీవని’, ‘ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్‌ఫర్మేషన్ ప్లాట్‌ఫార్మ్ (ఐహెచ్ఐపి)’, ‘ఎస్ఎకెఎస్‌హెచ్ఎఎమ్’ (సక్షమ్) మొదలైనవి భాగంగా ఉన్నాయని ఆయన అన్నారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రవేశపెట్టిన డిజిటల్ వేదిక - కోవిన్ (CoWIN) ప్రశంసనీయ విజయాన్ని నమోదు చేసిన మీదట భారతదేశం అందరికీ టీకా మందులను ఇప్పించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం యుడబ్ల్యుఐఎన్ (UWIN) పేరుతో ఒక ఆన్ లైన్ డిజిటల్ వేదికకు రూపకల్పన చేసిందని కూడా మంత్రి తెలిపారు. టీకాల కార్యక్రమాల కోసం వ్యక్తుల పేర్లను ఈ పోర్టల్ నమోదు చేసుకోవడం, ఎంత మందికి ఇచ్చాురు, వారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పర్యవేక్షిస్తుందన్నారు.
ఆగ్నేయాసియా ప్రాంత దేశాలు చాలా వాటిలో సాంప్రదాయిక, సహాయ వైద్యాలదే ముఖ్య పాత్ర అనే విషయాన్ని భారతదేశం గ్రహించి, ఈ వ్యవస్థలను అందరికీ అందించాలన్న ధ్యేయంతో- గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్న డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదనను భారతదేశం బలపరిచినట్లు శ్రీ నడ్డా చెప్పారు. ‘‘ఈ వ్యవస్థను సాంప్రదాయిక వైద్య వ్యవస్థతో జతపరచడంలో భారతదేశం గడించిన అనుభవం సమగ్ర ఆరోగ్య సంరక్షణకు రంగాన్ని సిద్ధం చేసి, దేశంలో ఆరోగ్య సంరక్షణ సేవల శ్రేణిని విస్తృత పరిచి మొత్తం మీద పౌరులలో భేషైన ఆరోగ్యానికి సమర్థనను అందించింది’’ అని ఆయన అన్నారు. ‘‘మా దేశంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు సాముదాయిక ఆరోగ్య శ్రేయో కేంద్రాలుగా ఉన్నాయి. ఈ కేంద్రాలు మందులలో రెండు రకాలైన విధానాలనూ అనుసరించి మా పౌరుల శారీరక, మానసిక స్వస్థతకు పూచీ పడుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ (సమష్టి భాగస్వామ్యం, సమష్టి అభివృద్ధి, సమష్టి విశ్వాసం, సమష్టి ప్రయత్నాలు) అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ దార్శనికతను గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి వివరించి ప్రసంగాన్ని ముగించారు. ప్రధాని దృష్టికోణం ప్రపంచ సవాళ్ళను పరిష్కరించడంలో ఏకత్వం, అన్ని వర్గాల శ్రేయస్సునూ కాంక్షించడం, మానవ ప్రయోజనాలకు ప్రాధాన్యాన్ని కట్టబెడుతూ వృద్ధి పథంలో ముందుకు సాగిపోవడం, ప్రపంచ హితం కోసం అన్ని దేశాల ఆకాంక్షలను గుర్తించి, ప్రతి దేశం తమ శక్తియుక్తులను వినియోగించుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు. ‘‘ఉమ్మడి జ్ఞానం, వివిధ దేశాలలో మార్పులకు దోహదం చేయగలుగుతుందని మేం నమ్ముతున్నాం. ఆరోగ్య పరిరక్షణ అన్ని దేశాలకూ అత్యవసరమే అని చెప్పాలి. ఆరోగ్య సంరక్షణలో ఒక సంపూర్ణ, సహకార పూర్వక విధానాన్ని అవలంబించవలసి ఉంటుంది. ప్రతి ఒక్క దేశం సాధించిన సాఫల్యాలను నుంచి, అలాగే సవాళ్ళ నుంచి పాఠాలను నేర్చుకొని, ఆరోగ్య వ్యవస్థలలో ప్రతికూలతలను అధగమించే స్థాయిని మనం పెంచుకోవచ్చు’’ అని మంత్రి అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎస్ఈఏఆర్ఓ రీజనల్ డైరెక్టర్ సైమా వాజెద్ ఈ సదస్సులో ప్రసంగిస్తూ, ‘‘ఎస్ఈఏఆర్ఓ మొదటిసారిగా 1948లో ఏర్పాటైనప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా శిశు మరణాల రేటు సుమారు 147 గా ఉంది. ఈ రేటు ప్రస్తుతం 25గా ఉంది. అప్పట్లో, సూక్ష్మజీవి నాశక ధోరణులు మొదలయ్యాయి. మరి ప్రస్తుతం మనం సూక్ష్మజీవి నిరోధక శక్తినే సవాలు చేసే ధోరణులను ఎదుర్కొంటున్నాం. అంటే మనం పాతవైన ముప్పులతో తలపడి వాటిపై పైచేయిని సాధించే సరికి, ఇక వర్తమాన కాలపు సరికొత్త ప్రతికూలతలను ఎదుర్కొనవలసి వస్తోందన్న మాట. నేటి సమస్యల్ని ఎదుర్కోవాల్సింది మనమేనని, మన ముందు తరాల జ్ఞానాన్నీ, 21వ శతాబ్దం అందించిన అవకాశాలను ఉపయోగించుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలీల శ్రీవాస్తవ, ఆ శాఖ అదనపు కార్యదర్శులు శ్రీమతి హెకాలీ జిమోమీ, శ్రీమతి ఆరాధన పట్ నాయక్, భారతదేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ రోడ్రిగో ఆఫ్ రీన్ లతో పాటు ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
(Release ID: 2063020)
Visitor Counter : 68