ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశను కేంద్ర ప్రాజెక్టుగా మంత్రివర్గం ఆమోదించడంతో, అంచనా వ్యయంలో దాదాపు 65 శాతం నిధులు సమకూర్చనున్న కేంద్ర ప్రభుత్వం

Posted On: 05 OCT 2024 4:08PM by PIB Hyderabad

మొత్తం రూ.63,246 కోట్ల అంచనా వ్యయంతో చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో  దశను కేంద్ర రంగ (సెంట్రల్ సెక్టార్)  ప్రాజెక్టుగా 03.10.2024న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.

ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును రాష్ట్ర రంగ (స్టేట్ సెక్టార్) ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా ప్రాజెక్టుకు అంచనా వ్యయం లో 90 శాతం నిధులు సమకూర్చే బాధ్యత ప్రధానంగా తమిళనాడు ప్రభుత్వంపై ఉంది. మెట్రో రైల్ విధానం -2017 ప్రకారం భూమి వ్యయం, మరికొన్ని అంశాలను మినహాయించి ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం నిధులు సమకూర్చడం కేంద్ర ప్రభుత్వ పాత్రగా ఉంది.  ద్వైపాక్షిక, బహుపాక్షిక సంస్థల నుంచి నేరుగా రూ.32,548 కోట్ల రుణాలను సమీకరించడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించగా , ఇందులో ఇప్పటివరకు రూ.6,100 కోట్లు వినియోగించారు.  

కాగా, తాజా ఆమోదంతో చెన్నై రెండో దశ అంచనా వ్యయంలో దాదాపు 65 శాతం కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ ఆర్థిక సహాయం మొత్తం అవసరమైన రూ. 33,593 కోట్ల రుణంతో పాటు, రూ. 7,425 కోట్ల ఈక్విటీ , అనుబంధ రుణాన్ని కూడా కలిగి ఉంటుంది. మిగిలిన 35 శాతం అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

బహుళ, ద్వైపాక్షిక అభివృద్ధి సంస్థల నుంచి తీసుకున్న రుణాలను కేంద్ర ప్రభుత్వ  రుణాలుగా పరిగణించి కేంద్ర బడ్జెట్ నుంచి నేరుగా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ ఎల్ )కు అందిస్తారు.

 కేంద్రం ఆమోదం తెలపడానికి ముందు, ఈ ప్రాజెక్టుకు రుణ సహాయం అందించడం లేదా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉండేది.

కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ వనరులను రూ.33,593 కోట్ల మేర ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సమకూర్చేందుకు వీలు కల్పించారు.

కేంద్ర మంత్రివర్గం ఆమోదం మేరకు, కింది  వాటి కోసం రుణం , ప్రాజెక్ట్ ఒప్పందాలు , సంబంధిత పత్రాలను గురించి తిరిగి చర్చించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, ఏషియన్  డెవలప్‌మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ అనే ద్వైపాక్షిక ,బహుపాక్షిక ఏజెన్సీలను సంప్రదిస్తుంది.

1 . ఈ రుణాలను రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే రుణాలుగా పరిగణించడం,

2 .  సంబంధిత ఏజెన్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి సీఎంఆర్ ఎల్ కు ప్రస్తుతం ఉన్న పంపిణీ మార్గానికి బదులుగా సంబంధిత ఏజెన్సీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి సీఎంఆర్ ఎల్ కు నేరుగా చేర్చే (పాస్ త్రూ) సాయంగా రుణ సహాయం నిధుల చేరవేత మార్గాన్ని మార్చడం.

3 . సిఎమ్ ఆర్ ఎల్ ద్వారా పనిచేసే గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సిఎమ్ ఆర్ ఎల్ ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా నియమించడం, సిఎంఆర్ ఎల్ ను ప్రాజెక్ట్ అమలు చేసే సంస్థగా నియమించడం.

రుణం, ప్రాజెక్టు ఒప్పందాలు, సంబంధిత డాక్యుమెంట్లలో ఈ మార్పుల ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేస్తారు.

రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యత కంపెనీపై ఉంటుంది.  రుణం తిరిగి చెల్లించడం సాధారణంగా కనీసం ఐదు సంవత్సరాల గడువు తర్వాత ప్రారంభమవుతుంది, అంటే ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఎక్కువ లేదా తక్కువ కావచ్చు. ఒకవేళ సి ఎం ఆర్ ఎల్ రుణాన్ని తిరిగి చెల్లించే స్థితిలో లేనట్లయితే, ఆ సంవత్సరాల్లో తిరిగి చెల్లించడానికి వీలుగా కంపెనీకి ఆర్థిక సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.


 

****



(Release ID: 2062520) Visitor Counter : 6