హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

అహ్మదాబాద్‌లో పోలీసు కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా

‘సంయుక్త విచారణ కేంద్రం’, ‘తేరా తుజ్కో అర్పణ్’ పోర్టల్ ప్రారంభం, సైబర్ సాథీ పుస్తకావిష్కరణ

క్రియాశీలక పోలీసింగ్ కోసం వేగవంతమైన, ముందుచూపు కలిగిన, శాస్త్రీయమైన విధానాన్ని తీసుకొచ్చిన మోదీ
‘ఈ-గుజ్‌కాప్’, ‘బాడీ-వోర్న్ కెమెరాలు’, ‘విశ్వాస్ ప్రాజెక్టు’ లాంటి వినూత్న ప్రయత్నాల ద్వారా గుజరాత్ పోలీసులకు దేశంలోనే ఆధునిక బలగాలుగా గుర్తింపు

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గుజరాత్ పోలీసుల చేపట్టిన ప్రచారం అభినందనీయం

మూడు కొత్త నేరచట్టాల్లో సాంకేతికత వినియోగం ద్వారా బాధితులకు సకాలంలో న్యాయం

Posted On: 03 OCT 2024 10:19PM by PIB Hyderabad

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు కమిషనర్ భవనాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

 



అహ్మదాబాద్ లో నూతనంగా నిర్మించిన పోలీసు కమిషనర్ కార్యాలయం సౌకర్యాలు మెరుగుపరచడమే కాకుండా నగర పోలీసులకు కొత్త తరహా కార్యకలాపాల వ్యవస్థను అందిస్తుందని శ్రీ అమిత్ షా అన్నారు.

 

 



దాదాపు 18వేల చ. మీ.ల విస్తీర్ణంలో సుమారు రూ.140 కోట్ల నిధులు వెచ్చించి అధునాతన టెక్నాలజీతో ఏడంతస్తుల పోలీసు కమిషనర్ భవనాన్ని నిర్మించినట్టు హోంమంత్రి తెలిపారు. దీనిలో వ్యాయామశాల, ప్రజలకు పార్కింగ్ సదుపాయం, సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ తదితర సౌకర్యాలు కల్పించారు. ఈ భవనం ప్రజలకు భద్రత విషయంలో  భరోసా ఇస్తుంది. ఆరంభం నుంచి అహ్మదాబాద్ నగర భద్రతకు తీసుకున్న చర్యలను ప్రదర్శించే మ్యూజియంను ఈ భవనంలో ఏర్పాటు చేశారు.

 



ప్రజా సంరక్షణకై ప్రాణ త్యాగం చేసిన పోలీసుల సంస్మరణార్థం స్మృతి చిహ్నాన్ని నిర్మించినట్టు ఆయన తెలిపారు.  అహ్మదాబాద్‌ భద్రతను పటిష్టం చేసేందుకు నగరంలోని ప్రతి మూలను పర్యవేక్షించే విధంగా పబ్లిక్ కన్వీనియన్స్ సెంటర్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు..

నూతన పోలీసు కమిషనర్ కార్యాలయ భవనంలో ‘సంయుక్త విచారణ కేంద్రం’, ‘తేరా తుజ్కో అర్పణ్’ పోర్టల్ ప్రారంభించామని, సైబర్ సాథీ పుస్తకావిష్కరణ జరిగిందని శ్రీ అమిత్ షా వివరించారు. వీటిలో మొదటి రెండు వ్యవస్థలు సైబర్ నేరాల బారిన పడిన వారికి అవగాహన కల్పించడంతో పాటు, వారు పోగొట్టుకున్న సొమ్మును రికవరీ చేసేందుకు తోడ్పడతాయి. అల్లర్లు, ఉగ్రదాడులు, ఇతర కల్లోల సమయాల్లో కేంద్ర సంస్థలు, అహ్మదాబాద్ పోలీసులు కలిసి శాస్త్రీయ పద్ధతుల్లో విచారణ చేసేందుకు ‘సంయుక్త విచారణ కేంద్రం’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.



గడచిన పదేళ్లలో భారత అంతర్గత భద్రతా వ్యవస్థ గణనీయంగా మెరుగైనట్లు కేంద్ర హోం మంత్రి తెలిపారు. దశాబ్ద కాలం క్రితం, దేశంలో మూడు అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉండేవి. అవి కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలు. అక్కడ బాంబు పేలుళ్లు సర్వసాధారణంగా జరిగేవి. వాటిలో కొన్ని వార్తల్లోకి వచ్చేవి కావు. ఈ ఘటనలను మామూలు విషయంగా పరిగణించేవారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో గత పదేళ్లలో తీసుకున్న శాశ్వత, వ్యవస్థీకృత చర్యలు, భద్రతా దళాల అంకితభావం, అభివృద్ధి పనుల ద్వారా ఈ మూడు ప్రాంతాల్లో హింస 70 శాతం మేర తగ్గింది. కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మరణాల రేటును 72 శాతానికి తగ్గించేందుకు జాతీయ భద్రతా సంస్థలు, రాష్ట్ర పోలీసు బలగాలతో కలసి పనిచేసినట్టు శ్రీ షా వెల్లడించారు. ఈ విజయం రానున్న రోజుల్లో ‘నక్సల్ రహిత భారత్’, ‘ఉగ్రరహిత భారత్’ కలను సాకారం చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

 



పోలీసు సంస్కృ తిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అనేక చర్యలు చేపట్టినట్టు శ్రీ అమిత్ షా తెలిపారు. క్రియాశీలక పోలీసు వ్యవస్థకు చురుకైన, ముందుచూపు కలిగిన, శాస్త్రీయమైన పద్ధతులతో కూడిన విధానాన్ని ప్రధాని దేశ ప్రజల ముందు ఉంచారని తెలిపారు. మూడు కొత్త క్రిమినల్ చట్టాలు రూపొందించడం ద్వారా దేశంలో వలస పాలన కాలం నాటి నేర చట్టాలను భారత్ సమూలంగా తొలగించిందని శ్రీ షా తెలిపారు. వాటి అమలు ఇప్పటికే దేశంలో ప్రారంభమైంది. నేరాల పరిష్కారం, వాటి నియంత్రంణ, తక్కువ సమయంలో విచారణ పూర్తి చేసి నేరస్తులకు శిక్ష విధించేందుకు గాను టెక్నాలజీని వాడేందుకు ఈ చట్టాలు, నిబంధనలు రూపొందించారు. రాబోయే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని, భవిష్యత్ సాంకేతికతలను పరిగణనలోకి తీసుకునేలా వీటిని తయారుచేశారు. కాబట్టి రానున్న శతాబ్దకాలం పాటు వీటిని సవరించాల్సిన అవసరం ఉండదు. దర్యాప్తు, విచారణ, న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు  న్యాయవ్యవస్థలో 83 సందర్భాల ఆధారంగా పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులపై పరిమితులు విధించారు.

 



మూడు న్యాయ చట్టాలు అమలు చేయడం ప్రారంభించిన తర్వాత, వాటికి తగినట్లుగా మౌలిక వసతులను మెరుగుపరిచే ప్రక్రియ ప్రారంభించామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఇది పూర్తయితే రానున్న మూడేళ్లలో భారత నేర న్యాయ వ్యవస్థ  ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా మారుతుంది. కొత్త చట్టాల అమలుతో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం నుంచి సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు న్యాయ ప్రక్రియ మూడేళ్లలో పూర్తవుతుందని, ప్రజలకు సకాలంలో న్యాయం జరిగేలా చూస్తామని వివరించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి చేర్చారని, 2027 నాటికి కచ్చితంగా మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని అమిత్ షా తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సైబర్ భద్రతతో సహా జాతీయ భద్రతను మెరుగుపరచడానికి, ఆర్థిక నేరాలను నిరోధించడానికి పోలీసులకు న్యాయపరమైన మద్దతు అవసరం. ఈ మూడు చట్టాలు పోలీసులకు అవసరమైన సహాయాన్ని అందజేస్తాయి.  



గుజరాత్ పోలీసులు అనేక చరిత్రాత్మక సాంకేతిక ఆవిష్కరణలు చేశారని కేంద్ర హోంమత్రి అన్నారు. ‘ఈ-గుజ్‌కాప్’, ‘బాడీ-వోర్న్ కెమెరాలు’, ‘విశ్వాస్ ప్రాజెక్టు’ తదితర కార్యక్రమాల ద్వారా దేశంలోనే గుజరాత్ పోలీసులు ఆధునిక బలగాలుగా గుర్తింపు పొందాయి. ఇది గర్వించదగిన విషయం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గుజరాత్ పోలీసులు ప్రారంభించిన ప్రచారం అభినందనీయమన్నారు. వారి దర్యాప్తు విధానాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

2047 నాటికి వికసిత భారత్ సాధించాలని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ లక్ష్యంగా నిర్దేశించారని శ్రీ అమిత్ షా తెలిపారు. గుజరాత్  ప్రగతిపథంలో నడుస్తుందన్నారు. ఇదే రాష్ట్రంలో 1980, 1990ల్లో తరచూ కర్ఫ్యూలు జరిగేవని, ఇప్పుడు పరిస్థితి మారిందని, రాష్ట్రమంతా సురక్షితమైన వాతావరణం ఉందన్నారు.  

 

****



(Release ID: 2062002) Visitor Counter : 9