ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అక్టోబర్ 5 న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన

వ్యవసాయ, పశుసంవర్ధక రంగాలకు సంబంధించి సుమారు రూ.23,300 కోట్ల విలువైన వివిధ కార్యక్రమాలను వాషిమ్ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

బంజారా సమాజం సుసంపన్న వారసత్వాన్ని ప్రదర్శించే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని

మహారాష్ట్ర ప్రాంతంలో పట్టణ చలనశీలతను పెంచడం పై ప్రాజెక్టుల ప్రధాన దృష్టి

ముంబై మెట్రో లైన్ మూడో దశ - 1 లో ఆరే జెవిఎల్ఆర్ నుండి బికెసి విభాగాన్ని కూడా ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు, ఎలివేటెడ్ ఈస్టర్న్ ఫ్రీవే ఎక్స్ టెన్షన్ కు మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన

నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ఇన్ ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా (ఎన్ ఎ ఐ ఎన్ ఎ) ప్రాజెక్టుకూ ప్రధాని శంకుస్థాపన

Posted On: 04 OCT 2024 5:39AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం (అక్టోబర్ 5న) మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఉదయం 11.15 గంటలకు వాసిమ్ చేరుకుని పోహరాదేవి జగదాంబ మాత ఆలయంలో దర్శనం చేసుకుంటారు. వాసిమ్ లోని సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రామ్ రావ్ మహారాజ్ సమాధుల వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 11.30 గంటలకు బంజారా సమాజం గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పే బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ, పశుసంవర్ధక రంగానికి సంబంధించిన సుమారు రూ.23,300 కోట్ల విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు బీకేసీ మెట్రో స్టేషన్ నుంచి ముంబైలోని ఆరే జేవీఎల్ఆర్ వరకు నడిచే మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. బీకేసీ, శాంతాక్రజ్ స్టేషన్ల మధ్య మెట్రోలో శ్రీ మోదీ ప్రయాణం చేయనున్నారు.

వాసిమ్ లో ప్రధాని కార్యక్రమాలు

రైతుల సాధికారత పట్ల తమ నిబద్ధతకు అనుగుణంగా, సుమారు రూ.20,000 కోట్ల విలువైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత నిధులను సుమారు 9.4 కోట్ల మంది రైతులకు ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు. 18వ విడత విడుదలతో పీఎం కిసాన్ కింద రైతులకు విడుదలయ్యే మొత్తం నిధులు రూ.3.45 లక్షల కోట్లు కానున్నాయి. అలాగే, నమో షెట్కారీ మహాసన్మాన్ నిధి యోజన ఐదో విడత నిధులు సుమారు రూ.2,000 కోట్లను కూడా ప్రధాని విడుదల చేస్తారు.

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ - ఏఐఎఫ్) కింద రూ.1,920 కోట్లకు పైగా విలువైన 7,500 ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేసారు. ఈ భారీ ప్రాజెక్టులలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాములు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, కోత అనంతర నిర్వహణ ప్రాజెక్టులు ఉన్నాయి. సుమారు రూ.1,300 కోట్ల టర్నోవర్ కలిగిన 9,200  వ్యవసాయ ఉత్పత్తిదారుల (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ - ఎఫ్ పీఓ) సంఘాలను  కూడా ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

పశువుల కోసం యూనిఫైడ్ జెనోమిక్ చిప్ ను, స్వదేశీ సెక్స్ సార్టెడ్ వీర్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. రైతులకు చౌక ధరలో సెక్స్ సార్టెడ్ వీర్యం లభ్యతను పెంచడం, ఒక్కో డోసు ధరను సుమారు రూ.200 వరకు తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యం. జెనోటైపింగ్ సేవలతో పాటు యూనిఫైడ్ జెనోమిక్ చిప్, స్వదేశీ పశువుల కోసం గౌచిప్, గేదెల కోసం మాహిష్ చిప్ ను అభివృద్ధి చేశారు. జీనోమిక్ ఎంపిక ద్వారా చిన్న వయసులోనే నాణ్యమైన ఎద్దులను గుర్తించవచ్చు.

ముఖ్యమంత్రి సౌర్ కృషి వాహిని యోజన - 2.0 కింద మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు సోలార్ పార్కులను ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన లబ్ధిదారులను ప్రధానమంత్రి సన్మానించనున్నారు.

థానేలో ప్రధాని కార్యక్రమాలు

ఈ ప్రాంతంలో పట్టణ రవాణా సదుపాయాలను పెంపొందించే ప్రధాన చర్యగా, ప్రధాన మంత్రి కీలకమైన మెట్రో రోడ్డు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.14,120 కోట్ల విలువైన ముంబై మెట్రో లైన్ - 3లో బీకేసీ నుంచి ఆరే జేవీఎల్ఆర్ విభాగాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ విభాగంలో 10 స్టేషన్లు ఉంటాయి, వీటిలో 9 స్టేషన్లు భూగర్భంలో ఉంటాయి. ముంబై మెట్రో లైన్ - 3 ఒక కీలకమైన ప్రజా రవాణా ప్రాజెక్టు, ఇది ముంబై నగరం-  శివారు ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని మెరుగుపరుస్తుంది. పూర్తిస్థాయిలో పనిచేసే లైన్-3 ద్వారా రోజుకు 12 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంది.

సుమారు రూ.12,200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రాజెక్టు మొత్తం పొడవు 29 కిలోమీటర్లు కాగా, 20 ఎలివేటెడ్, 2 భూగర్భ స్టేషన్లు ఉంటాయి. మహారాష్ట్రలో ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా ఉన్న థానేలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఒక కీలక చొరవ.

చడ్డానగర్ నుంచి థానేలోని ఆనంద్ నగర్ వరకు సుమారు రూ.3,310 కోట్ల విలువైన ఎలివేటెడ్ ఈస్టర్న్ ఫ్రీవే ఎక్స్ టెన్షన్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు దక్షిణ ముంబై నుండి థానేకు నిరంతరాయ అనుసంధానాన్ని (కనెక్టివిటీ)  అందిస్తుంది.

అలాగే, సుమారు రూ.2,550 కోట్ల విలువైన నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ఇన్ ఫ్లుయెన్స్  నోటిఫైడ్ ఏరియా (నైనా) ఫేజ్-1 ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాన రహదారులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం ఈ ప్రాజెక్టులో భాగం.

దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించనున్న థానే మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. థానే మునిసిపల్ కార్పొరేషన్ ఎత్తైన పరిపాలనా భవనం చాలా మునిసిపల్ కార్యాలయాలతో ఒకే కేంద్రీకృత భవనంగా థానే పౌరులకు ప్రయోజనాలను అందిస్తుంది.

 

***


(Release ID: 2061821) Visitor Counter : 63