నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఐదేళ్లలో క్రూయిజ్ కాల్స్, ప్రయాణికులను రెట్టింపు చేసే లక్ష్యంతో ‘క్రూయిజ్ భారత్ మిషన్’ను ప్రారంభించిన కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలశాఖా మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్
భారత్‌లో క్రూయిజ్ రంగాన్ని పునర్‌వ్యవస్థీకరించి 4 లక్షల ఉద్యోగాలు
కల్పించాలనేది ఈ మిషన్ లక్ష్యం: శ్రీ సర్బానంద సోనోవాల్
భారతదేశ సాంస్కృతిక, చారిత్రక, సహజ వారసత్వాన్ని
ప్రపంచస్థాయిలో ప్రోత్సహించేలా క్రూయిజ్ సర్క్యూట్ల రూపకల్పన: శ్రీ సోనోవాల్
మూడు దశల్లో మిషన్ అమలు. సముద్ర, హార్బర్ క్రూయిజ్,
నది, ఇన్‌ల్యాండ్ క్రూయిజ్, దీవి క్రూయిజ్ అనే మూడు అంశాలు ఇందులో భాగం
క్రూయిజ్ భారత్ మిషన్ ఫలితంగా భారత్‌లో 5,000 కిలోమీటర్లకు పైగా
జలమార్గాల్లో నదీ క్రూయిజ్‌లో ప్రయాణించనున్న 15 లక్షల మంది
Posted On:
30 SEP 2024 3:41PM by PIB Hyderabad
ముంబై ఓడరేవులో ‘క్రూయిజ్ భారత్ మిషన్’ను కేంద్ర ఓడరేవుల, షిప్పింగ్, జలమార్గాల (ఎంఓపీఎస్‌డబ్ల్యూ) మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. దేశంలో జల రవాణా (క్రూయిజ్) పర్యాటకానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ మిషన్ లక్ష్యం. రానున్న ఐదేళ్లలో, అంటే 2029 నాటికి క్రూయిజ్ ప్రయాణికుల సంఖ్యను రెట్టింపు చేయడంతో ద్వారా దేశ జల రవాణా పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించాలని ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఈ మిషన్‌ను ప్రారంభించింది. ఈ చారిత్రక కార్యక్రమంలో ఎంఓపీఎస్‌డబ్ల్యూ కేంద్ర సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ సైతం పాల్గొన్నారు.
ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఎంప్రెస్ క్రూయిజ్ ఓడ నుంచి ఈ మిషన్‌ను శ్రీ సర్బానంద సోనోవాల్ సోమవారం ప్రారంభించారు. జలరవాణా పర్యాటకంలో ప్రపంచ కేంద్రంగా ఎదగాలని, ప్రపంచ జలరవాణా గమ్యస్థానంగా దేశాన్ని ప్రోత్సహించాలనే భారతదేశ సంకల్పాన్ని సాధించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వచ్చే నెల 1వ తేదీ నుంచి 2029 మార్చి 31 వరకు మూడు దశల్లో క్రూయిజ్ ఇండియా మిషన్‌ను అమలు చేస్తారు. మొదటి దశ (01.10.2024 - 30.09.2025) ప్రధానంగా అధ్యయనాలు చేయడం, ప్రణాళిక రూపొందించడం, పొరుగు దేశాలతో జలరవాణా ఒప్పందాలు కుదుర్చుకోవడంపై దృష్టి సారిస్తుంది. అధిక సామర్థ్యం కలిగిన జలరవాణా ప్రాంతాలు, మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు గానూ ప్రస్తుతం ఉన్న క్రూయిజ్ టెర్మినళ్లు, మెరీనా ఓడరేవులు, గమ్యస్థానాల ఆధునికీకరణ కూడా ఈ దశలో జరుగుతుంది. అధిక సామర్థ్యం కలిగిన క్రూయిజ్ లొకేషన్లు, మార్గాలను అందుబాటులోకి తెచ్చేందుకు గానూ కొత్త క్రూయిజ్ ఓడరేవులు, మెరీనా ఓడరేవుల గమ్యస్థానాలను అభివృద్ధి చేయడంపై రెండో దశలో (01.10.2025 - 31.03.2027) దృష్టి సారిస్తారు. భారత ఉపఖండంలోని అన్ని క్రూయిజ్ మార్గాలను అనుసంధానం చేయడంపై మూడో దశ (01.04.2027 - 31.03.2029) దృష్టి సారిస్తుంది. క్రూయిజ్ టెర్మినళ్లు, మెరీనాలు, గమ్యస్థానాల అభివృద్ధి కొనసాగిస్తూనే జల మార్గాల అనుకూల వ్యవస్థను ఈ దశలో సిద్ధం చేస్తారు.
మొదటి దశలో 5 లక్షల మంది సముద్ర జల మార్గాల్లో ప్రయాణిస్తుండగా మూడో దశలో 10 లక్షల మంది ప్రయాణించడం, విదేశీ క్రూయిజ్ నౌకలకు తాత్కాలిక అనుమతి (క్రూయిజ్ కాల్స్) 125 నుంచి 500కు పెంచడం వంటివి ఈ మూడు దశల్లో లక్ష్యాలుగా ఉన్నాయి. మొదటి దశలో 5 లక్షల మంది నదీ జలాల్లో ప్రయాణిస్తే మూడో దశ నాటికి 15 లక్షల మంది ప్రయాణించడం మరో లక్ష్యం. మొదటి దశలో 2 అంతర్జాతీయ క్రూయిజ్ ఓడరేవులు ఉంటే మూడో దశకు వాటిని 10కి పెంచడం, ఇదే సమయంలో నదీ మార్గాల రేవులను 50 నుంచి 100కు పెంచడం వంటివి లక్ష్యాలుగా నిర్దేశించారు. ఇదే విధంగా చివరి దశ కల్లా మెరీనా ఓడరేవులను సైతం ఒకటి నుంచి ఐదుకు పెంచడం, ఉద్యోగాల సంఖ్యను లక్ష నుంచి నాలుగు లక్షలకు పెంచడం కూడా దీని లక్ష్యాలు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ... “భారత్‌లో క్రూయిజ్ రంగాన్ని పునర్‌వ్యవస్థీకరించేందుకు ‘క్రూయిజ్ భారత్ మిషన్’ అతిపెద్ద కార్యక్రమం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో భారతదేశ సముద్ర ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేశంలో క్రూయిజ్ రంగానికి అపారమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలాకాలంగా ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. క్రూయిజ్ పర్యాటకం ద్వారా భారతదేశ విస్తారమైన సముద్ర తీరాన్ని, జలమార్గాల సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని, మన సముద్ర ఆర్థిక వ్యవస్థను సమూలంగా మర్చాలనే లక్ష్యాలతో ఈ మిషన్ ను చేపట్టారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటకుల క్రూయిజ్ అనుభవాలను మెరుగుపర్చడం, వనరుల సుస్థిర వినియోగం అనేది కీలక స్తంభాల ఆధారంగా మూడు దశల్లో చేపట్టనున్న ఈ కార్యక్రమం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు క్రూయిజ్ పర్యాటకం, సముద్ర వాణిజ్యం వృద్ధికి దోహదపడుతుంది.” అని పేర్కొన్నారు.
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, గమ్యస్థానాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం ఈ మిషన్ లక్ష్యం. దీంతో పాటు సాంకేతికతను వినియోగించుకొని క్రూయిజ్ ఓడల్లోకి ప్రయాణికులు ఎక్కడం, దిగడం, గమ్యస్థానాల్లో పర్యటించినప్పుడు వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నది ప్రధాన ఉద్దేశం. భారత ఉపఖండ సాంస్కృతిక, చారిత్రక, సహజసిద్ధ జల మార్గాలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తుంది. ఇదే సమయంలో ఓడరేవులు, క్రూయిజ్ నిర్వహణ సంస్థలు, ఓడల నిర్వాహకులు, టూర్ ఆపరేటర్లు, సేవలు అందించే సంస్థలు, స్థానిక ప్రజలు సహా భాగస్వామ్యులందరి సమాన, సమ్మిళిత వృద్ధికి ఇది భరోసానిస్తుంది. పైగా నియంత్రణాధికారాలు కలిగిన కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, సీఐఎస్ఎఫ్, రాష్ట్రాల పర్యాటక శాఖలు, రాష్ట్రాల సముద్ర సంస్థలు, జిల్లాల యంత్రాంగాలు, స్థానికుల పోలీసుల బాధ్యతాయుతమైన ప్రమేయానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వం కింద ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 2014 నుంచి క్రూయిజ్ ప్రయాణికుల సంఖ్యలో 400 శాతం గణనీయ పెరుగుదల కనిపించింది. ‘క్రూయిజ్ భారత్ మిషన్’ ద్వారా ఇది మరింత పెరుగుతుంది. 2024లో విదేశీ క్రూయిజ్ లు తాత్కాలిక అనుమతితో ఆగే చోట్లు 254 ఉండగా 2030 నాటికి 500కు, 2047 నాటికి 1,100కు పెరగాలనేది ఈ మిషన్ లక్ష్యం. 2024లో 4.6 లక్షలుగా ఉన్న క్రూయిజ్ ప్రయాణికుల సంఖ్య 2047 నాటికి 50 లక్షలు పెరుగుతుందని మేం అంచనా వేస్తున్నాం. ఈ కాలవ్యవధిలో క్రూయిజ్ రంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ఈ మిషన్ లక్ష్యం,” అని సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు.
క్రూయిజ్ ఇండియా మిషన్ ప్రధానంగా మూడు కీలక క్రూయిజ్ భాగాలపై దృష్టి సారిస్తుంది. మొదటిది సముద్ర, హార్బర్ క్రూయిజ్ విభాగం. ఇందులో తీర ప్రాంత క్రూయిజ్‌లు, సముద్ర లోతులను అన్వేషించే క్రూయిజ్‌లతో పాటు ఓడరేవు ఆధారిత యాచింగ్, సెయిలింగ్ క్రూయిజ్‌లు ఉంటాయి. రెండోది నదీ, ఇన్‌ల్యాండ్ క్రూయిజ్ విభాగం. కాలువలు, బ్యాక్‌వాటర్, సముద్రపు పాయల్లో, సరస్సుల్లో నదీ, ఇన్‌ల్యాండ్ క్రూయిజ్‌లపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది. చివరిది ఐలాండ్ క్రూయిజ్ విభాగం. ఒక దీవి నుంచి ఇంకో దీవికి మధ్య క్రూయిజ్‌లు, లైట్‌హౌజ్ సందర్శనలు, వినోదాన్ని పంచే, మారుమూల ప్రాంతాలను అన్వేషించే క్రూయిజ్‌లు, ఎక్కువగా ప్రాచూర్యం పొందని ప్రదేశాలకు చిన్న క్రూయిజ్‌లపై ఈ విభాగంలో ప్రధాన దృష్టి ఉంటుంది.
ఈ సందర్భంగా ఎంపీఎస్‌డబ్ల్యూ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ మాట్లాడుతూ... “భారతదేశాన్ని ప్రపంచ స్థాయి క్రూయిజ్ పర్యాటక కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ నిబద్ధత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వం కింద చేపట్టిన ఈ మిషన్ ద్వారా ప్రతిబింబిస్తోంది. క్రూయిజ్ ఆపరేటర్లు, పర్యాటకులు, స్థానిక ప్రజలకు ప్రయోజనం కలిగించే సుస్థిరమైన, అనుకూల వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ మిషన్ లక్ష్యం. దూరదృష్టితో చేపట్టిన ఈ మిషన్ భారతదేశ సముద్ర రంగానికి శక్తినివ్వడంతో పాటు పర్యాటక రంగంలో కొత్త మార్గాలను తెరుస్తుంది. సముద్ర ఆర్థిక వ్యవస్థను సద్వినియోగించుకునేలా చేస్తుంది.” అని పేర్కొన్నారు.
అయిదు వ్యూహాత్మక అంశాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఈ మిషన్ గుర్తించింది. సుస్థిరమైన మౌలిక సదుపాయాలు, మౌలధనం అనే అంశం మౌలిక సదుపాయాల అంతరాలను పూడ్చడం, ప్రపంచ స్థాయి టెర్మినళ్లు, మెరీనాలు, వాటర్ ఏరోడ్రోమ్‌లు, హెలీపోర్ట్‌లు అభివృద్ధి చేయడం, డిజిటలైజేషన్ (ఉదాహరణకు.. ముఖ గుర్తింపు), కాలుష్య నియంత్రణ (ఉదాహరణకు., తీరంలో నిలిచి ఉన్నప్పుడు క్రూయిజ్‌కు తీరం నుంచి విద్యుత్ సరఫరా చేయడం) వంటి అంశాలు ఈ మిషన్‌లో కీలకమైనవి. 2047 కోసం జాతీయ క్రూయిజ్ మౌలిక సదుపాయాల మాస్టర్‌ప్లాన్ తయారీ, ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ (ఐపీఏ) కింద క్రూయిజ్‌పై ప్రధాన దృష్టితో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు, క్రూయిజ్ అభివృద్ధి నిధిని ప్రారంభించడం ఇందులో భాగం. కార్యకలాపాల్లో సాంకేతికత వినియోగం అనే అంశంలో ప్రధానంగా క్రూయిజ్ ప్రయాణాలను క్రమబద్ధం చేయడం, ప్రయాణికులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, గమ్యస్థానాల సందర్శనలో ఇబ్బందులు లేకుండా చూడటం, ఈ-క్రియరెన్స్ వ్యవస్థలు, ఈ-వీసా సౌకర్యాలు కల్పించడం వంటి డిజిటల్ సేవలపై దృష్టి సారిస్తారు.
క్రూయిజ్ ప్రచారం, సర్క్యూట్ అనుసంధానం అనే అంశంలో ప్రధానంగా క్రూయిజ్ మార్గాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, "క్రూయిజ్ ఇండియా సమ్మిట్" వంటి కార్యక్రమాలను నిర్వహించడం, పొరుగు దేశాలతో కలిసి పనిచేయడంపైనా దృష్టి కేంద్రీకరిస్తారు. నియంత్రణ, ఆర్థిక విధానం అనే అంశంలో పన్నులు, క్రూయిజ్ నిబంధనలపై ప్రధాన దృష్టితో సరైన ఆర్థిక విధానాల రూపొందించడం, జాతీయ క్రూయిజ్ పర్యాటక విధానం ప్రారంభిచడంపై దృష్టి పెడతారు. చివరగా, సామర్థ్య నిర్మాణం, ఆర్థిక పరిశోధన అంశంలో నైపుణ్యాల అభివృద్ధి, క్రూయిజ్ ఆధారిత ఆర్థిక పరిశోధనకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, క్రూయిజ్ పరిశ్రమలో యువతకు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయి వృత్తి ప్రమాణాలను రూపొందించడంపై దృష్టి సారిస్తారు.
క్రూయిజ్ భారత్ మిషన్ భారతదేశ క్రూయిజ్ పర్యాటక రంగాన్ని ఉన్నతంగా మార్చడంతో పాటు భావి తరాలకు అవకాశాలను కల్పిస్తుంది.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్, భారతదేశ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టీకే రామచంద్రన్, కార్డిలియా క్రూయెజెస్ సీఈఓ జుర్గెన్ బైలోమ్‌తో పాటు పలువురు ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, భాగస్వాములు పాల్గొన్నారు.
****
(Release ID: 2061012)
Visitor Counter : 38