నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

“వయోవృద్ధుల సంరక్షణ బలోపేతం” పై జాతీయ వర్క్‌షాప్ నీతి ఆయోగ్ స్టేట్ సపోర్ట్ మిషన్ (ఎస్ఎస్ఎమ్) ఆధ్వర్యంలో కార్యక్రమం

Posted On: 30 SEP 2024 4:36PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ సెప్టెంబర్ 27న కేరళలోని తిరువనంతపురంలో “భారతదేశంలో వయోవృద్ధుల సంరక్షణ బలోపేతం” పై జాతీయ వర్క్‌షాప్‌ నిర్వహించింది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఎస్‌జేఈ), భారత ప్రభుత్వం, సామాజిక న్యాయం, సాధికారత విభాగం, కేరళ ప్రభుత్వ సహకారంతో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. వయోవృద్ధుల సంరక్షణలో అంతరాలు, సవాళ్లపై రాష్ట్రాలు, ఇతర వాటాదారుల అభిప్రాయాలను సేకరించడం, అలాగే రాష్ట్రాలు, ఇతర వాటాదారులు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను గురించి తెలుసుకుని సందర్భోచితంగా వాటిని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశ్యం.

నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్. వి.కె. పాల్ అధ్యక్షత వహించిన ఈ ఒకరోజు జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను కేరళ ప్రభుత్వ ఉన్నత విద్య, సామాజిక న్యాయశాఖా మంత్రి డాక్టర్ ఆర్. బిందు ప్రారంభించారు. శ్రీమతి శారదా మురళీధరన్, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహా, కేరళ, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పలు మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, అలాగే పీఎఫ్ఆర్‌డీఏ, ప్రపంచ బ్యాంకు, డబ్ల్యూహెచ్ఓ ఇండియా, ఐఆర్‌డీఏఐ సహా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన ఆయా రంగాల ప్రముఖులు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ సపోర్ట్ మిషన్ (ఎస్ఎస్ఎమ్) ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్ఐటీఐ-స్టేట్ వర్క్‌షాప్ శ్రేణిలో భాగంగా ఈ వర్క్‌షాప్ నిర్వహించారు.

ప్లీనరీ చర్చా కార్యక్రమంలో, వర్క్‌షాప్ ఉద్దేశ్యాన్ని వివరించడం కోసం నీతి ఆయోగ్ ఒక సంక్షిప్త ప్రజెంటేషన్ అందించింది. అనంతరం “వయోవృద్ధుల సంరక్షణ కోసం విధానపరమైన సంస్కరణలు: కేరళ అనుభవాల వివరణ” గురించి కేరళ ప్రభుత్వం వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చింది. దీనిలో భాగంగా వయోవృద్ధుల సంరక్షణ సంబంధిత ఇబ్బందులను పరిష్కరించడం కోసం కేరళ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రధానంగా ప్రస్తావించారు. 

వర్క్‌షాప్‌ను, ప్యానెల్ చర్చ, మూడు ఇంటరాక్టివ్ రౌండ్‌ టేబుల్ చర్చా కార్యక్రమాలతో మొత్తం నాలుగు చర్చా కార్యక్రమాలుగా విభజించారు. ఇది వృద్ధుల సంరక్షణలో సవాళ్లను పరిష్కరించడం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యక్రమాలు, అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడం అలాగే దేశంలో వయోవృద్దుల సంపూర్ణ సంరక్షణ కోసం మార్గం సుగమం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించింది.

వయోవృద్ధుల సంరక్షణను బలోపేతం చేయడం కోసం ముఖ్యంగా విధాన ప్రణాళికలు, ఆరోగ్య సంరక్షణ నిబంధనల నుంచి డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక భద్రత వరకు వివిధ కోణాలకు సంబంధించి ప్రతినిధులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు క్షేత్రస్థాయి అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలను ప్రస్తావిస్తూ చర్చలో కీలక పాత్ర పోషించారు.

నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీ. కే. పాల్ చర్చా కార్యక్రమ ముగింపు సందర్భంగా, వయోవృద్ధుల సంరక్షణ, సహాయం విషయంలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో ఒక కొత్త వయోవృద్ధుల సంరక్షణ కార్యక్రమాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశంలోని వయోవృద్ధుల సంరక్షణ కోసం సమగ్రమైన, సమర్ధవంతమైన సేవలందించుటపై విస్తృతంగా దృష్టిసారించడం మన ముందున్న మార్గమని తెలిపారు.

 

***


(Release ID: 2060545) Visitor Counter : 78


Read this release in: Tamil , Urdu , English , Hindi