రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

వాయుసేన కొత్త అధిపతిగా ఏపీ సింగ్ బాధ్యతల స్వీకారం

Posted On: 30 SEP 2024 9:43PM by PIB Hyderabad

భారత వైమానిక దళం అధిపతి (సీఏఎస్)గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ వాయుసేన ప్రధాన కార్యాలయం (వాయు భవన్)లో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.

సీఏఎఫ్ 1984, డిసెంబరు 21న భారత వైమానిక దళం ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ అలాగే నేషనల్ డిఫెన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి. ఆయన అధీకృత వైమానిక శిక్షకులుఅలాగే వివిధ రకాలయిన ఫిక్స్‌డ్ వింగ్, రొటేటరీ వింగ్ విమానాలను 5000 గంటల కంటే ఎక్కువ సమయం పాటు నడిపిన అనుభవం గల ప్రయోగాత్మక టెస్ట్ పైలట్.

ఆయన తన ఉద్యోగ కాలంలో మిగ్-27 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్‌గా, ఎయిర్ బేస్- ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్‌గా పనిచేశారు. టెస్ట్ పైలట్‌గా, రష్యాలోని మాస్కోలో మిగ్ 29 అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ బృందానికి నాయకత్వం వహించారు. తేజస్ విమాన పరీక్షలను చూస్తున్న నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఫ్లైట్ టెస్ట్)గా కూడా సేవలందించారు. నాలుగు దశాబ్దాల తన ఉద్యోగ జీవితంలో, సీఏఎస్ సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌ ప్రధాన కార్యాలయంలో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సమయంలో సిబ్బంది నియామకాలను చేపట్టారు. వాయుసేన అధిపతిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆయన వాయుసేన ఉప అధిపతిగా ఉన్నారు.

 

సీఏఎస్ తన విధి నిర్వహణలో పరమ విశిష్ట సేవా పతకం (పీవీఎస్ఎమ్), అతివిశిష్ట సేవా పతకం (ఏవీఎస్ఎమ్)లను అందుకున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వాయుసేనను ఉద్దేశించి ప్రసంగిస్తూ... భారత వైమానిక దళానికి నాయకత్వం వహించే బాధ్యత తనకు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి, నాన్ కంబాటెంట్లు (నమోదు చేసుకున్నవారు), డీఎస్‌సీ సిబ్బంది, పౌరులు, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ... వాయుసేన కార్యాచరణ సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చడంలో వారి అపూర్వమైన మద్దతు, అంకితభావం పట్ల సీఏఎస్ సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 గతంలో వైమానిక దళాన్ని ముందుకు నడిపించిన అనుభవజ్ఞులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఐఏఎఫ్ విజయానికి వారి అత్యున్నత కృషి, గొప్ప నాయకత్వమే కారణమని పేర్కొన్నారు. ‘సశక్త్, సక్షమ్, ఆత్మనిర్భర్’ ఐఏఎఫ్ నిర్మాణం కోసం దృష్టిసారించాల్సిన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ, కమాండర్లు మెరుగైన నాయకత్వాన్ని అవలంబించాలని అలాగే ఐక్యతను, సమష్టితత్వాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ప్రస్తుత అనిశ్చిత భౌగోళిక-రాజకీయ పరిస్థితులపై దృష్టి సారించాలని ఆయన పిలుపునిచ్చారు. "భారత వైమానిక దళం మంచి కార్యాచరణ సామర్థ్యం కలిగి ఉండి, ఎల్లప్పుడూ అప్రమత్తంగా, యుద్ధాన్ని నివారించేదిగా ఉండటం చాలా ముఖ్యం" అని అన్నారు. గొప్ప సంప్రదాయాలను అనుసరిస్తూ మనమంతా కలిసికట్టుగా సగర్వంగా ఆకాశమంత ఎత్తున నిలబడదామని అన్నారు.

 

***



(Release ID: 2060540) Visitor Counter : 31