సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
సామాజిక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పన దిశగా సామాజిక న్యాయం-సాధికారత విభాగం... జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ (నల్సా) మధ్య అవగాహన ఒప్పందం
‘సార్తీ 1.0’ ప్రారంభం: అత్యంత దుర్బల సామాజిక వర్గాలకు అవగాహన పెంపు.. న్యాయపరంగా మద్దతు సహా ప్రభుత్వ సంక్షేమ పథకాల సౌలభ్య కల్పనే లక్ష్యం
Posted On:
30 SEP 2024 8:40PM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ, జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (నల్సా) మధ్య ఒక అవగాహన ఒప్పందంపై ఇవాళ న్యూఢిల్లీలో సంతకాలు పూర్తయ్యాయి. వివిధ చట్టాలు-నిబంధనలు, మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకాలపై... ముఖ్యంగా సమాజంలోని అణగారిన, దుర్బల వర్గాల కోసం రూపొందించిన వాటిపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కీలక భాగస్వామ్య ఒప్పందం లక్ష్యం.
దేశంలోని అణగారిన వర్గాలకు న్యాయ సహాయం, చట్టాలపై చైతన్య కల్పన ధ్యేయంగా న్యాయసేవా ప్రాధికార సంస్థల చట్టం-1987 కింద ‘నల్సా’ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అవగాహన ఒప్పందం కింద మంత్రిత్వ శాఖ, ‘నల్సా’ సంయుక్తంగా అనేక ప్రచార కార్యక్రమాలు, సదస్సులు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తాయి. తద్వారా సాంఘిక సంక్షేమ పథకాలను బలహీన వర్గాలకు చేరువ చేయడమేగాక వాటి ప్రభావం ఇనుమడించేలా కృషి చేస్తాయి.
కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ సహా సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి, నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శ్రీ జస్టిస్ సంజీవ్ ఖన్నాల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. ఇదే వేదికపై ‘సార్తీ 1.0’ (SARTHIE) పేరిట సరికొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అణగారిన వర్గాల సాధికారత లక్ష్యంగా దీన్ని కూడా సంయుక్తంగా అమలు చేస్తారు. ఈ మేరకు దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసి), వృద్ధులు, లింగమార్పిడి వ్యక్తులు, మద్యపాన/మాదక ద్రవ్య వ్యసన పీడితులు సహా యాచకులు, విముక్త-సంచార తెగల సంక్షేమం దిశగా కార్యక్రమాలు చేపడతారు.
సుస్థిర ప్రగతిపై ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 2030 లక్ష్యాల (ఎస్‌డిజి)కు అనుగుణంగా ‘సార్తీ 1.0’ కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్యంగా పేదరిక నిర్మూలన, అసమానతల తగ్గింపు, అందరికీ మరింత సమానత్వం దిశగా సామాజిక భద్రత విధానాలకు ప్రోత్సాహం తదితర అంశాలపై ‘ఎస్‌డిజి’లు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. తదనుగుణంగా అవగాహనలో అంతరం తగ్గించడంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా న్యాయ సహాయం అందించడం ఈ సంయుక్త భాగస్వామ్యం ధ్యేయం. ఈ నేపథ్యంలో అత్యంత దుర్బల సామాజిక వర్గాలకు అవగాహన పెంపు, న్యాయ సహాయంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల సౌలభ్యానికి భరోసా ఇస్తూ ‘సార్తీ 1.0’ కార్యక్రమం ప్రారంభం కావడం ఒక ముందడుగు. కార్యనిర్వాహక-న్యాయ వ్యవస్థల మధ్య ఈ సమన్వయంతో అందరికీ సామాజిక న్యాయ ప్రదానం మరింత బలోపేతం కాగలదు.
‘నల్సా’ సహకారంతో మంత్రిత్వశాఖ చేపట్టే కార్యక్రమాలు అట్టడుగు స్థాయిదాకా ప్రజలకు అవగాహన కల్పన, సమాచార విస్తరణకు దోహదం చేస్తాయి. ఈ భాగస్వామ్యం కింద దేశమంతటా రాష్ట్ర/జిల్లా న్యాయసేవా సంస్థల అధికారులు, పారా లీగల్ వలంటీర్లు, ప్యానెల్ లాయర్ల సహకారంతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తారు. మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే ఐదు కీలక చట్టాలపై చైతన్యం కల్పన మీద ఈ శిబిరాలు దృష్టి సారిస్తాయి:
1. పౌర హక్కుల రక్షణ చట్టం-1955
2. షెడ్యూల్డ్ కులాలు/తెగల (అఘాయిత్యాల నిరోధక) చట్టం-1989
3. తల్లిదండ్రులు/వృద్ధుల సంరక్షణ/సంక్షేమ చట్టం-2007
4. లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల రక్షణ) చట్టం-2019
5. అశుద్ధం తొలగింపు పని చేయించడంపై నిషేధం/వారి పునరావాస చట్టం-2013
మంత్రిత్వ శాఖ పరిధిలో అమలయ్యే వివిధ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ 5 చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా తమకు గల చట్టపరమైన హక్కులు-రక్షణ సహా ప్రభుత్వ సంక్షేమ పథకాల సౌలభ్యంపై లక్షిత ప్రజానీకంలో చైతన్యం పెంచుతారు.
***
(Release ID: 2060533)
Visitor Counter : 64