వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మరింత వేగంతో ‘‘మేక్ ఇన్ ఇండియా’’: ‘వ్యాపార సంస్కరణలు- కార్యాచరణ ప్రణాళిక-2024 ఇక దేశవ్యాప్తంగా లోపరహిత నియంత్రణ విధానం
प्रविष्टि तिथि:
30 SEP 2024 12:32PM by PIB Hyderabad
సరళతర వ్యాపార నిర్వహణలో భాగంగా- ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేస్తూ వాణిజ్య సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బీఆర్ఏపీ)- 2024 దేశవ్యాప్తంగా లోప రహిత వ్యాపార నియంత్రణ విధానాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నది. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడమే ఈ విధానం ఉద్దేశం. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) మార్గదర్శకత్వంలో బీఆర్ఏపీ-2024 ఇటు వ్యాపార సంస్థల, అటు పౌరుల అవసరాలను తీర్చేందుకు నూతన సంస్కరణలను ప్రవేశపెట్టనుంది. ఇదివరకటి విధానాలు సత్ఫలితాలను ఇవ్వడంతో ఆ విధానాలకు కొనసాగింపుగాను, వ్యాపార సంస్థలు పాటించవలసిన నిబంధనల భారాన్ని మరింత తగ్గించడం, అపరాధాలుగా పేర్కొన్న అంశాల పట్టికలో నుంచి అనేక నిబంధనలను తొలగించడం, ప్రపంచ బ్యాంకు త్వరలో తీసుకు రానున్న బి-రెడీ (B-READY) కార్యక్రమంలో ప్రధాన అంశాల స్ఫూర్తిని కలుపుకోవడం వంటి ప్రభుత్వ కీలక కార్యక్రమాల లక్ష్యాలకు అనుగుణంగా ‘బీఆర్ఏపీ- 2024’ రూపొందింది. ఈ మేలు కలయిక నియంత్రణ సంబంధిత ప్రక్రియలను క్రమబద్ధీకరించడంతో పాటు ఆర్థికవృద్ధికి అండగా నిలిచి, భారతదేశంలో వ్యాపారానికి సంబంధించిన విధానాలపై పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని ఇప్పటి కన్నా పెంచనుంది.
త్వరలో అమలులోకి రానున్న బీఆర్ఏపీ-2024 విధానం ఒక సరికొత్త మదింపు పద్ధతిని ప్రవేశపెట్టనుంది. దీనిలో సాక్ష్యాలతోను, ప్రతిస్పందనలతోను ముడిపడి ఉండే మూల్యాంకనాలను జోడించి ఒక సమగ్ర, చైతన్య భరిత దృక్పథాన్ని తీర్చిదిద్దారు. ఏదైనా నిర్ణయానికి సంబంధించిన ఆమోదాన్ని తెలియజేయడానికి పడుతున్న కాలాన్ని తగ్గించడం, ఇంటర్ నెట్ ఆధారిత సేవల అందజేతకు కూడా అవకాశాలను కల్పించడం, జాతీయ ఏక గవాక్ష వ్యవస్థ, పీఎమ్ గతిశక్తి వంటి కార్యక్రమాల ప్రయోజనాలను అందుకునేందుకు వీలు కల్పించడం ద్వారా మరింత పారదర్శకత్వంతో కూడిన సమర్థమైన, చురుకైన నియంత్రణ వ్యవస్థకు బీఆర్ఏపీ-2024 బాటను పరచనుంది.
పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపే దేశంగా భారతదేశాన్ని మలచడానికి ప్రక్రియలను సులభ తరం చేయడాన్ని, నియమాల పాలన తాలూకు భారాన్ని తగ్గించడాన్ని, డిజిటల్ మాధ్యమ సంబంధిత సేవలను అమలు పరుస్తుండడాన్ని బీఆర్ఏపీ-2024 కొనసాగిస్తున్నది. బీఆర్ఏపీ ముందుగా అనుకున్న అంశాలకు తోడు కార్మిక శక్తి, పర్యావరణం, పన్నులు, భూ నిర్వహణ, యుటిలిటీ పర్మిట్లు, తనిఖీ, ఇంకా నిర్మాణం వంటి ముఖ్య రంగాలనన్నింటిని లెక్క లోకి తీసుకొంది. అలాగే సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ)ని అక్కున చేర్చుకోవడం, ప్రక్రియలలో మార్పుచేర్పులను చేయడం వంటి కొత్త రంగాలను కూడా తన పరిధి లోకి చేర్చుకొని, ప్రభుత్వం వైపు నుంచి వ్యాపార రంగానికి సేవలను అందించడం మరింత వేగంగాను, మరింత సమర్థంగాను ఉండేటట్లుగా ఈ విధానం చూస్తుంది.
బీఆర్ఏపీని 2014-2015 లో మొదటిసారిగా తీసుకు వచ్చారు. ఇది భారతదేశంలో వ్యాపార ముఖచిత్రానికి సరికొత్త రూపు, రేఖలను ఇచ్చి, పోటీతత్వంతో కూడిన సమాఖ్య వాదానికి స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పటి వరకు బీఆర్ఏపీ ఆరు సంచికలు ఫలప్రదం అయ్యాయి. సంస్కరణలను ఏ స్థాయిలో అమలుపరిచాయనే అంశంపై రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను మూల్యాంకనం చేయడమనే బీఆర్ఏపీ విశిష్ట దృష్టికోణం చాలా దేశాలలో అరుదుగా మాత్రమే చోటు చేసుకొనే ప్రక్రియ. వేరు వేరు రంగాలకు ఎదురయ్యే సవాళ్ళకు సమాధానాలను వెతకడంతో పాటు వ్యాపార నిర్వహణకు సానుకూల పరిస్థితులను ఏర్పరచి దేశవ్యాప్తంగా అనేక పెట్టుబడి కేంద్రాలను ఏర్పాటు చేయడంపైన శ్రద్ధ వహించారు.
పౌరుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సంస్కరణలను ప్రవేశపెట్టడంలో భాగంగా బీఆర్ఏపీ- సేవలను అందించడంలో పారదర్శకతపై దృష్టిని సారించింది. విధానాలు, రుసుములు, గడువులకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఇటు వ్యాపార సంస్థలకు, అటు పౌరులకు లభ్యమయ్యేలా జాగ్రత తీసుకొంది. ఈ కార్యక్రమం వ్యాపారాలు వృద్ధి చెందేటట్లుగా, మరింత దక్షతతో కూడిన ప్రతిస్పందన ప్రధాన పాలన వ్యవస్థ పౌరులకు అందేటట్లుగా ఒక వ్యవస్థను తీర్చి దిద్దాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణానికి సరిపోలినదిగా ఉంటున్నది.
***
(रिलीज़ आईडी: 2060485)
आगंतुक पटल : 124