పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పర్యాటక రంగ అభివృద్ధితోనే... ఆర్థికాభివృద్ధి సాధ్యం: ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్

సంస్కృతులూ, దేశాల మధ్య అంతరాన్ని తగ్గించే వారధి...పర్యాటక రంగం: కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్



50 పర్యాటక ప్రాంతాల పరిధిలో... పర్యటన్ మిత్ర, పర్యటన్ దీదీ ప్రారంభం



8 ప్రముఖ ఆతిథ్య సంస్థలు, 21 సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ల మధ్య అవగాహన ఒప్పందం

ఉత్తమ పర్యాటక గ్రామం-2024 విజేతల ప్రకటన

పర్యాటకం, ఆతిథ్య రంగాలకు పరిశ్రమ హోదా కల్పించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం కరదీపిక విడుదల

ఇన్‌క్రెడిబుల్ ఇండియా కంటెంట్ హబ్, డిజిటల్ పోర్టల్ ప్రారంభం

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ 'ఛలో ఇండియా' ప్రచారం కింద విదేశీయులకు లక్ష ఉచిత వీసాల ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 27 SEP 2024 4:12PM by PIB Hyderabad


కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 27న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవాల్లో ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవ ఇతివృత్తం 'పర్యాటకం, శాంతి'గా ప్రకటించారు.


ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, పర్యాటక, పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి, పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి వి. విద్యావతి పాల్గొన్నారు. వీరితో పాటు కార్యక్రమంలో దేశంలోని విదేశీ రాయబారులు, వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నాతాధికారులు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ఉన్నతాధికారులు, వాణిజ్య పర్యాటక సంస్థలు, ఆతిథ్య పరిశ్రమ, పర్యాటక, ఆతిథ్య సంస్థల విద్యార్థులు, ఉత్తమ పర్యాటక గ్రామ పోటీల తరఫున విజేతలు పాల్గొన్నారు.


ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని గౌరవ ఉప రాష్ట్రపతి ఈ కింది కేంద్ర పర్యాటక శాఖకు చెందిన కార్యక్రమాలను ప్రారంభించారు:

  • 50 పర్యాటక ప్రాంతాల్లో జాతీయ బాధ్యతాయుత పర్యాటక కార్యక్రమాలైన పర్యాటన్ మిత్ర, పర్యాటన్ దీదీ ప్రారంభం.

  • 8 ప్రముఖ ఆతిథ్య సంస్థలు, 21 సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ల మధ్య అవగాహన ఒప్పందం.

  • 2024 ఏడాదికిగానూ ఉత్తమ పర్యాటక గ్రామం పోటీ విజేతల ప్రకటన.

  • పర్యాటకం, ఆతిథ్య రంగాలకు పరిశ్రమ హోదా కల్పించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం కరదీపిక విడుదల

  • ఇన్‌క్రెడిబుల్ ఇండియా సమాచార కూడలి, డిజిటల్ పోర్టల్ ప్రారంభం.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ, పర్యాటకంలో ఆతిథ్యం, సేవా సమర్థతలో అత్యున్నత ప్రమాణాలను సాధించాల్సిన ఆవశ్యకతను తెలిపారు. గత దశాబ్ద కాలంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు ద్వారా, అనుసంధానత కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, జాతీయ రహదారులు, ప్రపంచ స్థాయి ఎక్స్‌ప్రెస్‌వే ల నిర్మాణంలో వచ్చిన మార్పులు పర్యాటకంపై చూపిన ప్రభావాన్ని ఆయన వివరించారు. ఆర్థికాభివృద్ధి పర్యాటక రంగ అభివృద్దితో పెనవేసుకుని ఉందని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై పర్యాటక రంగ తీవ్ర ప్రభావం, సామాజిక పురోగతి, సాంస్కృతిక వినిమయం, సామాజిక అభివృద్ధికి ఒక సాధనంగా పర్యాటక రంగం అనే అంశాలపై శ్రీ జగదీప్ ధన్కడ్ మాట్లాడారు. 2024 ఉత్తమ పర్యాటక గ్రామాల విజేతలను అభినందించారు.

 



పర్యాటకం మనందరినీ కలిపే రంగమని, సంస్కృతులను, దేశాల మధ్య అంతరాన్ని తగ్గించే రంగం అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. పర్యాటక రంగంపై ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన 'సంపూర్ణ ప్రభుత్వ' విధానం ద్వారా నెలకొన్న సానుకూల ప్రభావాన్ని మంత్రి వివరించారు. కేంద్రం సుమారు 1,50,000 కిలోమీటర్ల రోడ్డు మార్గాల నిర్మాణం, 500 కొత్త విమాన మార్గాలు, 150 కొత్త విమానాశ్రయాలు పెరిగిన విమాన అనుసంధానత, హైస్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టడం వంటి అంశాలను ప్రస్తావించారు. సుమారు 100 పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు. భారత్ జి20 అధ్యక్షత వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అరవైకి పైగా గమ్యస్థానాలకు నెలకొల్పిందన్నారు. స్వచ్ఛ భారత్ కారణంగా పరిశుభ్రమైన గమ్యస్థానాలు, మెరుగైన సౌలభ్యం, యుపిఐ ద్వారా డిజిటల్ కనెక్టివిటీతో దేశం నూతన శిఖరాలకు చేరుకుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
పర్యాటక మంత్రిత్వ శాఖ త్వరలో అభివృద్ధి కోసం పర్యాటక గమ్యస్థానాల ప్రాధాన్య జాబితాను విడుదల చేస్తుందని కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సమావేశంలో ప్రకటించారు. ఈ పర్యాటక గమ్యస్థానాలను రానున్న మూడేళ్లలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. సాంస్కృతిక, పౌర విమానాయానం, రైల్వే, రోడ్డు రవాణా, ఓడరేవులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో కలిసి పని చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు అనుగుణంగా ప్రైవేట్ రంగ సంస్థలు తమ భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలను రూపొందించుకోవడానికి వీలుగా ఈ ప్రాధాన్య జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ చేపట్టిన 'ఛలో ఇండియా' ప్రచార కార్యక్రమం ద్వారా ప్రవాస భారతీయులను ఇన్‌క్రెడిబుల్ ఇండియా రాయబారులుగా మార్చేందుకు వీలుగా 'ఛలో ఇండియా' కింద భారత్ కు వచ్చే తొలి లక్ష మంది విదేశీయులకు భారత ప్రభుత్వం ఉచితంగా వీసాను అందిస్తుందని, వీసా ఫీజును మాఫీ చేస్తుందని మంత్రి సమావేశంలో ప్రకటించారు.



'ఇండియా బై ఎయిర్' అనే అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు  ప్రసంగించారు. పౌర విమానయానంపై జరిగిన 2వ ఆసియా పసిఫిక్ మంత్రివర్గ సమావేశంలో ఢిల్లీ డిక్లరేషన్ ను ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని ఆయన ప్రస్తావించారు. ఉడాన్ (ప్రాంతీయ అనుసంధాన పథకం), డిజి యాత్ర, విమానాశ్రయాల సంఖ్య పెంపు వంటి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రయత్నాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పౌర విమానయాన సేవలు పెంపొందించడం ద్వారా పర్యటక రంగం వృద్ధిపరంగా ప్రభావితమైందని మంత్రి తెలిపారు.



కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి వి.విద్యావతి స్వాగతోపన్యాసంలో పర్యాటకం ఆంగ్ల అక్షరం ‘పి’తో మొదలయ్యే పదాలతో- వ్యక్తులు, ప్రదేశం, ఉత్పత్తి, గ్రహం, ప్రోత్సాహం గురించి మాట్లాడారు. పర్యాటక విలువ ప్రదేశం నుండి ప్రజలకు మారుతున్న తీరును గుర్తించాలని, అందువల్ల ఇన్‌క్రెడిబుల్ ఇండియా... ఇన్‌క్రెడిబుల్ ఇండియన్స్‌గా మారిందని ఆమె తెలిపారు.

 

BY/SKT


(రిలీజ్ ఐడి: 2060174) సందర్శకుల సూచీ సంఖ్య : : 72
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil