వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
వాషింగ్టన్ డీసీలో 6వ భారత్-అమెరికా వాణిజ్య సమావేశానికి గినా రైమాండోతో కలిసి అధ్యక్షత వహించనున్న శ్రీ పియూశ్ గోయల్
ప్రముఖ అమెరికన్, భారతీయ సీఈఓలతో సమావేశమై భారత్‌లో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించనున్న వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి
Posted On:
29 SEP 2024 9:45AM by PIB Hyderabad
అమెరికా వాణిజ్య మంత్రి గినా రైమాండో ఆహ్వానం మేరకు భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూశ్ గోయల్ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు.
అక్టోబరు 2న జరగనున్న భారత్-అమెరికా సీఈఓ ఫోరమ్ సమావేశానికి, 3న వాషింగ్టన్ డీసీలో జరగనున్న 6వ భారత్-అమెరికా వాణిజ్య చర్చలకు అమెరికా వాణిజ్య మంత్రి రైమాండోతో కలిసి శ్రీ పియూశ్ గోయల్ సహ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా సుస్థిరమైన ఆర్థిక వృద్ధికి, వ్యాపార, పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు, భారతీయ, అమెరికన్ వ్యాపార సమాజాల మధ్య సంబంధాలను పటిష్ఠం చేసేందుకు ఉన్న మార్గాలపై ఇరు పక్షాలు చర్చించనున్నాయి.
భారత్‌లో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను ప్రధానంగా వెల్లడిస్తూ ప్రముఖ అమెరికన్, భారతీయ సీఈఓలు, పరిశ్రమ ముఖ్యులతో మంత్రి గోయల్ సమావేశమవుతారు. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ నిర్వహించనున్న రౌండ్‌టేబుల్ సమావేశంలో వ్యాపార, పరిశ్రమ ముఖ్యులతో ఆయన చర్చించనున్నారు. భారత్, అమెరికా ఆర్థిక వ్యవస్థ మధ్య సంయుక్త బలాలు, సమ్మేళనాలను మరింత ప్రభావితం చేసే మార్గాలపై ప్రధానంగా చర్చలు ఉంటాయి. యువ వ్యాపార ప్రముఖుల రౌండ్‌టేబుల్ సమావేశంతో పాటు, భారత్-అమెరికా జెమ్స్ ఆండ్ జువెలరీ వాణిజ్య రౌండ్‌టేబుల్ సమావేశాలకు సైతం ఆయన అధ్యక్షత వహించనున్నారు.
భారత్, అమెరికా మధ్య కీలకమైన ఖనిజాల సరఫరా వ్యవస్థలను విస్తరించే, వైవిధ్యపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా శ్రీ గోయల్, కార్యదర్శి రైమాండో చర్చిస్తారు. అవసరమైన కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలను పెంచుకోవడానికి, వైవిధ్యపర్చడానికి, సంయుక్త బలాలను పెంచుకోవడానికి అవసరమైన ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన ఒప్పందంపైనా ఇరుపక్షాలు చర్చలు జరుపనున్నాయి.
వాషింగ్టన్ డీసీలో యూఎస్‌టీఆర్ రాయబారి కాథెరీన్ తైతోనూ మంత్రి గోయల్ సమావేశమవుతారు. ట్రేడ్ పాలసీ ఫోరమ్ కింద ప్రస్తుతం కొనసాగుతున్న సహకారంతో పాటు, ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచే మార్గాలపై ఇరువురు చర్చించనున్నారు.
భారతదేశం, అమెరికా మధ్య బలమైన, వృద్ధి చెందుతున్న వాణిజ్య, పెట్టుబడి సంబంధాలకు మంత్రి పర్యటన మరింత ఊతమిస్తుంది. కీలకమైన ఖనిజాలు, దృఢమైన సరఫరా వ్యవస్థ నిర్మాణం, అనువైన వాతావరణం కల్పించడం, స్వచ్ఛ సాంకేతిక సహకారం, సమ్మిళిత డిజిటల్ వృద్ధి, ప్రమాణాలు, సానుకూల సహకారం, పర్యాటకం వంటి ఇరువైపులా ప్రాధాన్యత కలిగిన రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాలను, వ్యాపారులు-వ్యాపారుల మధ్య సంబంధాలను మంత్రి అమెరికా పర్యటన ప్రోత్సహించనుంది.
***
(Release ID: 2060135)
Visitor Counter : 36