ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
‘‘భారతదేశంలో వాతావరణం- ఆరోగ్య పరిష్కారాలు- భవిష్యత్ కార్యాచరణ’’ అంశంపై
ముగిసిన సదస్సు, ఏడీబీతో కలిసి సదస్సుని నిర్వహించిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వాతావరణ ఆటుపోట్లను తట్టుకునే, ప్రతిస్పందించే వైద్య వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ఆవశ్యకపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, కేరళ, తమిళనాడు సహా 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు
ప్రజారోగ్య వ్యూహాల్లో వాతావరణ కార్యాచరణను జోడించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రధానంగా గుర్తిస్తూ దృఢమైన, ఆచరణాత్మక, ముందుచూపుతో కూడిన పరిష్కారాల అభివృద్ధి దిశగా చర్చలు
భారతదేశం కీలక దశలో ఉన్నందున వాతావరణ మార్పు సవాళ్లు, ప్రజారోగ్యంపై స్పందించడమే కాకుండా ఈ అంశాలపై అంతర్జాతీయ అజెండాకు నేతృత్వం వహించే అవకాశం మనకు ఉంది: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
Posted On:
27 SEP 2024 1:07PM by PIB Hyderabad
భారతదేశంలో వాతావరణ మార్పులు- ఆరోగ్య పరిష్కారాల (సీహెచ్ఎస్) దిశగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ(ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ), ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నిర్వహించిన సంయుక్త సదస్సు రెండో రోజు ఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. భారత్‌లో వాతావరణ మార్పుల్నీ, ప్రజారోగ్యాన్నీ అనుసంధానించాల్సిన అత్యవసర స్థితిపై ఈ రెండు రోజుల సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సవాళ్లను ఎదుర్కొనేలా ఆరోగ్య రంగంలో ఆచరణాత్మక వ్యూహాలను అభివృద్ధి చేసేందుకు విధాన రూపకర్తలు, నిపుణులు, భాగస్వాములతో ఈ సదస్సు జరిగింది.
లోతైన ఆలోచనాత్మక సమావేశాలతో సదస్సు ప్రారంభమైంది. అసంక్రామిక వ్యాధులు (ఎన్సీడీ), మానసిక ఆరోగ్యం, పోషకాహారం, వాతావరణ సంసిద్ధతతో ఆరోగ్యసేవలు అందించగల మానవ వనరులు, వాతావరణం-ఆరోగ్యం అంశాల్లో ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యం, డిజిటల్ సాంకేతికతలు, డాటా, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే, స్పందించే ఆరోగ్య వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై సదస్సు లోతుగా చర్చించింది.
ఈ సదస్సుకు దాదాపు 330 మంది హాజరయ్యారు. “ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునేలా, ప్రతిస్పందించే ఆరోగ్య వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు” అనే అంశంపై రెండో రోజు కీలకమైన రౌండ్‌టేబుల్ చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, కేరళ, తమిళనాడు సహా 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు ఈ చర్చలో పాల్గొన్నారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు పెరుగుతున్నందున, వాటిని తట్టుకునేలా మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అత్యవసరమనే అభిప్రాయం ఈ చర్చా కార్యక్రమంలో ప్రధానంగా వెల్లడైంది.
“అసంక్రామిక వ్యాధులు, పోషకాహారం, మానసిక ఆరోగ్యం” అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో విభిన్న అంశాలపై కీలక చర్చలు జరిగాయి. కేరళ వరదలు, అసంక్రామిక వ్యాధుల (ఎన్‌సీడీ) సామాజిక నిర్ణాయకాలపై వాతావరణ మార్పు ప్రభావం వంటి అంశాలపై డాక్టర్ చెరియన్ వర్ఘీస్ చర్చించారు. అత్యంత దుర్బల పరిస్థితుల్లో ఉన్న వారిపై జీవనోపాధి, వైద్యసేవల లభ్యత వంటి ప్రభావాలపై ఆయన మాట్లాడారు. మానసిక ఆరోగ్య సమస్యలు, వాటి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలపై డాక్టర్ సీ. నవీన్ కుమార్ ప్రసంగించారు. వాతావరణ మార్పు, పోషకాహారాన్ని అనుసంధానం చేయాల్సిన అంశంపై గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ (గెయిన్)కు చెందిన డాక్టర్ భువనేశ్వరి బాల సుబ్రమణియం మాట్లాడారు.
“బ్లెండెడ్ ఫైనాన్స్ ఫర్ క్లైమేట్-హెల్త్ బోల్డ్ బెట్స్” అనే అంశంపై జరిగిన చర్చలో యునైటెడ్ కింగ్‌డమ్ ఫారిన్, కామన్‌వెల్త్, డెవెలప్‌మెంట్ ఆఫీస్‌లో ఆసియా పసిఫిక్ ప్రాంత పాలసీ ఆండ్ ప్రోగ్రామ్ ప్రధానాధికారి జయ సింగ్ మాట్లాడారు. వాతావరణం, ఆరోగ్య రంగాల్లో ప్రైవేటు పెట్టుబడుల కోసం నిబంధనలు, రక్షణ రూపకల్పనలో ప్రభుత్వ పాత్రను ఆమె పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్యలో లక్షిత రంగాలకు మద్దతునిచ్చేందుకు గ్రీన్ కేటలిక్ ఫండింగ్, హామీ ఆధారిత నిధులు వంటి ఆకర్షణీయ నిధుల సమీకరణ నమూనాలను రూపొందించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. పహల్ సమృధ్ ప్రోగ్రామ్ లీడ్ హిమాన్షు సిక్కా మాట్లాడుతూ... ప్రపంచంలో అనారోగ్య సమస్యలకు 25 శాతం వరకు వాతావరణపరమైన కారణాలే అయినప్పటికీ, అంతర్జాతీయ వాతావరణ నిధుల్లో కేవలం 0.5 శాతం మాత్రమే ఆరోగ్యానికి కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.
ఎండ వేడి, ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని గుర్తించే, నిర్వహణకు ఉపయోగపడే క్లైమేట్ రిస్క్ అబ్జర్వేటరీ టూల్, ప్లస్ సాంకేతికతలు, బ్లాక్ ఫ్రాగ్ టెక్నాలజీలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాలు, ఆర్ట్ పార్క్ కార్యక్రమాలు, ఐఐఎస్సీ బెంగళూరుకు చెందిన వాతావరణ, ఆరోగ్యానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థలు వంటి ఆవిష్కరణలను ఈ సదస్సులో ప్రదర్శించారు.
సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఏడీబీ ప్రతినిధుల నేతృత్వంలో వాతావరణం, ఆరోగ్య పరివర్తనపై ప్రధాన దృష్టితో ముగిసిన ఈ సదస్సుకు హాజరైన వారు వాతావరణ లక్ష్యాలను ఆరోగ్య వ్యవస్థలకు అనుసంధానం చేసే విధానాలను రెండురోజుల పాటు ప్రదర్శించారు. ప్రజారోగ్య వ్యూహాలతో వాతావరణ కార్యచరణను అనుసంధానం చేయాల్సిన తక్షణ అవసరంపై ప్రధాన దృష్టితో దృఢమైన, ఆచరణాత్మక, ముందుచూపు పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఈ సదస్సు కీలక వేదికగా నిలిచింది. వివిధ రాష్ట్రాలు, రంగాల నుంచి ఈ సదస్సులో పాల్గొన్న వారు రానున్న సంవత్సరాల్లో ఆరోగ్యం, వాతావరణం పట్ల భారతదేశ విధానాన్ని రూపొందించే చర్చలు, కార్యచరణ ప్రణాళికలను ఆరంభించారు.
సదస్సు ముగింపు సందర్భంగా ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ కార్యదర్శి శ్రీ అపూర్వచంద్ర మాట్లాడుతూ... సదస్సుకు హాజరైన భాగస్వాములుకు, నిపుణులకు, విధాన రూపకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. “వాతావరణ, ఆరోగ్య పరిష్కారాలపై ఈ కీలకమైన సదస్సులో రెండు రోజుల పాటు వాతావరణ మార్పు, ప్రజారోగ్యానికి ముడిపడి ఉన్న సంక్షోభాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి. ఇది సమష్టి కార్యచరణ శక్తిని ప్రదర్శిస్తోంది. లోతైన చర్చలతో జరిగిన చర్చా కార్యక్రమాలు అందించిన పరిష్కారాలు ఆరోగ్య విధానాల్లో వాతావరణ కోణాన్ని అనుసంధానం చేయడానికి ఆచరణాత్మక వ్యూహాలకు మార్గం సుగమం చేశాయి. ప్రస్తుతం భారత్ కీలక దశలో ఉన్నందున కేవలం ఈ సవాళ్లకు స్పందించడం మాత్రమే కాకుండా వాతావరణం, ఆరోగ్యం విషయంలో ప్రపంచ అజెండాకు నేతృత్వం వహించే అవకాశం మనకు ఉంది. ఇక్కడ పొందిన లోతైన అవగాహనను దృఢమైన భవిష్యత్తు కోసం స్పష్టమైన కార్యచరణలుగా అనువదిద్దాం.” అని పేర్కొన్నారు.
ఈ సదస్సులోని ఎనిమిది కీలకమైన అంశాలు, గుర్తించిన ఫలితాలతో పాటు జాతీయ, ప్రాంతీయ, ఉప-జాతీయ వాతావరణ, ఆరోగ్య కార్యచరణ ప్రణాళికలతో కూడిన సమగ్ర పత్రాన్ని ఏడీబీ, ఎంహెచ్ఎఫ్‌డబ్ల్యూ ప్రచురించనున్నాయి. క్లైమేట్ ఆండ్ హెల్త్ సొల్యూషన్స్ (సీహెచ్ఎస్) మల్టీ-స్టేక్ హోల్డర్ థాట్ ఆండ్ యాక్షన్ ఇండియా కాంక్లేవ్ భవిష్యత్తులో వాతావరణ-ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలను భారత్‌లో వేగం పెంచడానికి, బూట్ క్యాంపుల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి నమూనాగా ఉపయోగపడుతుంది.
భారత ఆరోగ్య రంగంలో కీలక మలుపుగా భావిస్తున్న ఈ సదస్సుకు హాజరైన వారిని ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ ప్రజారోగ్య అదనపు కార్యదర్శి ఎల్ఎస్ చంగ్‌సన్, సంయుక్త కార్యదర్శి లతా గణపతి అభినందించారు. ఆసియా, పసిఫిక్‌తో పాటు మిగతా ప్రాంతాల్లో వాతావరణ; ఆరోగ్య అజెండా నిర్మాణానికి, కార్యచరణకు భారతదేశ అనుభవం ఒక ఉదాహరణగా పని చేస్తుందని ఏషియన్ డెవెలప్‌మెంట్ బ్యాంక్ హ్యూమన్ ఆండ్ సోషల్ డెవెలప్‌మెంట్ సెక్టార్ కార్యాలయ సీనియర్ డైరెక్టర్ అయాకో ఇనాగాకి, హెల్త్ ప్రాక్టీస్ టీమ్ ప్రిన్సిపల్ హెల్త్ స్పెషలిస్ట్ డాక్టర్ దినేశ్ అరోరా పేర్కొన్నారు.
***
(Release ID: 2059957)
Visitor Counter : 84