రాష్ట్రపతి సచివాలయం
భారతీయ కళా మహోత్సవానికి రాష్ట్రపతి శ్రీకారం
సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో అక్టోబరు 6దాకా ప్రజలకు అనుమతి
Posted On:
28 SEP 2024 6:55PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (2024 సెప్టెంబరు 28న) సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవం తొలి సంచికకు శ్రీకారం చుట్టారు. నేటినుంచి 8 రోజులపాటు కొనసాగే ఈ వేడుకలను ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల సహకారంతో రాష్ట్రపతి నిలయం నిర్వహిస్తోంది. ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల సుసంపన్న విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం ఈ వేడుకల లక్ష్యం.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- దేశంలోని సుసంపన్న సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతోపాటు కళలను ప్రోత్సహించడం మన సమష్టి బాధ్యతని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యం, వారి జానపద నృత్యాలు, సంగీతం, కళలు, సంప్రదాయ వస్త్రధారణ వంటివి మన దేశ వారసత్వంలో అంతర్భాగం. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత సంప్రదాయాలు, సమాజాలను పౌరులందరికీ సుపరిచితం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
సాంస్కృతిక ఆదానప్రదానం పెంపొందడానికి ఈ మహోత్సవం ఒక అవకాశమని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశంలోని ఈశాన్య, దక్షిణ ప్రాంతాల మధ్య ఈ వేడుక ఒక వారధి కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈశాన్య ప్రాంత హస్తకళా నిపుణులు, కళాకారులు, సంప్రదాయాలు, ప్రతిభా ప్రదర్శన ద్వారా వారి సాధికారతకు ఈ మహోత్సవం దోహదం చేస్తుందని ఆమె విశ్వాసం వెలిబుచ్చారు.
తెలంగాణ గవర్నర్, కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రిసహా 8 ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతీయ కళా మహోత్సవాలు తిలకించేందుకు సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 6 వరకూ ఉదయం 10:00 నుంచి రాత్రి 8:00 గంటల మధ్య ప్రజలను అనుమతిస్తారు. అలాగే https://visit.rashtrapatibhavan.gov.in ద్వారా కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటు నేరుగా వచ్చే సందర్శకులకు తక్షణ బుకింగ్ సౌలభ్యం కూడా ఉంది.
***
(Release ID: 2059935)
Visitor Counter : 59