భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాతావరణ రంగ పరిశోధనల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ‘హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్.పి.సి.)’ వ్యవస్థను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భూమికి ప్రాథమిక శక్తిప్రదాత సూర్యుడు స్ఫురణకు వచ్చేలా నూతన వ్యవస్థలకు ‘అర్క’, ‘అరుణిక’ గా నామకరణం

Posted On: 27 SEP 2024 1:42PM by PIB Hyderabad

భూవిజ్ఞాన మంత్రిత్వశాఖకు చెందిన అత్యాధునిక వాతావరణ రంగ పరిశోధనల ‘హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్.పి.సి.)’ వ్యవస్థలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.

850 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మితమైన ఈ భారీ ప్రాజెక్ట్, పెను ప్రకృతి విపత్తుల గురించి కచ్చితమైన అంచనాలను అందించే గణన సామర్థ్యాన్ని భారత్ కు సమకూర్చింది. పుణేలోని ఉష్ణమండల వాతావరణ అధ్యయన సంస్థ (ఐఐటిఎం), నోయిడాలోని జాతీయ మధ్యమ స్థాయి వాతావరణ అంచనా సంస్థ (ఎన్సిఎంఆర్డబ్ల్యూఎఫ్) ల్లో ఈ ఉన్నతస్థాయి హెచ్.పి.సి. వ్యవస్థలను నెలకొల్పారు.  

పుణే ‘ఐఐటిఎం’ వ్యవస్థ 11.77 పెటా ఫ్లాప్స్ వేగాన్నీ, 33 పెటా బైట్ల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా,  ‘ఎన్సిఎంఆర్డబ్ల్యూఎఫ్’ 8.24 పెటా ఫ్లాప్స్ వేగాన్నీ, 24 పెటా బైట్ల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇవేకాక, కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ అప్లికేషన్లతో కూడిన, 1.9 పెటా ఫ్లాప్స్ వేగం గల ప్రత్యేక వ్యవస్థను కూడా ఇక్కడ స్థాపించారు. ఈ సామర్థ్య జోడింపుతో, భూవిజ్ఞాన శాస్త్ర విభాగపు గణన సామర్థ్యం 6.8 పెటా ఫ్లాప్స్ వేగం నుంచి 22 పెటా ఫ్లాప్స్ వేగానికి ఇనుమడించింది.

సంప్రదాయాన్ని అనుసరించి ఈ వ్యవస్థలకు సూర్య సంబంధిత పేర్లను పెట్టారు. గత వ్యవస్థలకు ఆదిత్య, భాస్కర, ప్రత్యూష, మిహిర్ వంటి పేర్లనివ్వగా, కొత్త హెచ్.పి.సి. వ్యవస్థలకు ‘అర్క’, ‘అరుణిక’ అనే పేర్లు సముచితమని భావించారు. నూతన వ్యవస్థలకు భూమి ప్రాథమిక శక్తిప్రదాత సూర్యుడిని తలపించే పేర్లను పెట్టడం మంత్రిత్వశాఖలో ఆనవాయితీగా వస్తోంది.

నూతన గణన వ్యవస్థల వల్ల, కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను వినియోగించుకుంటూ ఉన్నత స్థాయి వాతావరణ అంచనా వ్యవస్థలను రూపొందించడం సాధ్యపడుతుంది. తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే వీలు కలుగుతుంది.  

కొత్త హెచ్.పి.సి. వ్యవస్థలు వల్ల ఒనగూడిన మెరుగైన గణన సామర్థ్యం వల్ల ప్రస్తుతం లభ్యమవుతున్న డేటాను మరింత సమర్థవంతంగా అవగతం చేసుకుని, ప్రపంచ వాతావరణం గురించి వేసే అంచనాలను, నాణ్యతతో అందించే వీలు కలుగుతుంది. దేశంలోని ప్రాంతాలకు కిలోమీటర్, లేదా అంతకన్నా సూక్ష్మస్థాయిగల సమాచారాన్ని స్థానిక నమూనాలు అందించగలుగుతాయి. తుఫాన్లు, భారీ వర్షాలు, ఉరుములతో కూడిన గాలివానలు, వడగళ్ళ వానలు, తీవ్రమైన ఎండలు, కరువు వంటి ప్రకృతి విపత్తుల గురించి కచ్చితమైన ముందస్తు సమాచారాన్ని ఈ అత్యాధునిక వ్యవస్థలు అందించగలవు.

హెచ్.పి.సి. వ్యవస్థలు అందించే అత్యాధునిక సాంకేతికత సహాయంతో, కచ్చితమైన, విశ్వసనీయ వాతావరణ అంచనాలను అందించాలని భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ భావిస్తోంది. దాంతో, వాతావరణ మార్పులు, తీవ్రమైన ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సన్నద్ధత పెరగగలదని మంత్రిత్వశాఖ భావిస్తోంది. 

 

***


(Release ID: 2059571) Visitor Counter : 118