పర్యటక మంత్రిత్వ శాఖ
దేశంలోని విమానాశ్రయాలు-రైల్వే స్టేషన్లలో ప్రభుత్వపరంగా పర్యాటక అభిప్రాయ సేకరణ వ్యవస్థకు త్వరలో శ్రీకారం
నాడు పోస్టు చేయడమైనది:
27 SEP 2024 2:43PM by PIB Hyderabad
పర్యాటక ప్రగతి-వృద్ధిలో దేశ పౌరులను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని అన్ని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో పర్యాటక అభిప్రాయ సేకరణ వ్యవస్థను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ త్వరలో ఏర్పాటు చేయనుంది. దేశంలో తాము సందర్శించిన వివిధ పర్యాటక ప్రదేశాలు, అక్కడి ఆకర్షణీయ అంశాల గురించి ఈ వ్యవస్థ ద్వారా పర్యాటకులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
ఈ మేరకు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలోని పర్యాటక శాఖ సంబంధిత పాయింట్ల వద్ద ఏర్పాటు చేసే ‘క్యుఆర్’ కోడ్‌ను ప్రయాణికులు స్కాన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా 30 సెకన్ల వ్యవధిలో తమ అభిప్రాయంతోపాటు ఆయా ప్రదేశాల్లో అనుభవాలను రేటింగ్ పూర్వకంగా వారు తెలియజేయవచ్చు.
ఈ ప్రక్రియ యావత్తూ ప్రత్యక్ష, గతిశీల స్వభావం కలది కాబట్టి, వివిధ భాగస్వాముల సహకారంతో మంత్రిత్వ శాఖ ఆయా సమస్యలను చురుగ్గా పరిష్కరించే వీలుంటుంది. ఈ విధంగా సేకరించే గణాంకాలు పర్యాటకుల అభిప్రాయాల నిధిగా ఉపయోగపడగలదు.
కేంద్ర పర్యాటక శాఖ అందజేసే ‘క్యుఆర్’ కోడ్‌ను ఆ శాఖతో సమన్వయం ద్వారా పౌర విమానయాన, రైల్వే మంత్రిత్వ శాఖలు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. కాలక్రమంలో పర్యాటక విధానం-వ్యూహాల రూపకల్పనకు అవసరమైన నిశిత దృష్టితోపాటు సమాచారానికి ఇది విశ్వసనీయ వనరుగా మారుతుంది.
****
(రిలీజ్ ఐడి: 2059567)
సందర్శకుల సూచీ సంఖ్య : : 51