ఉక్కు మంత్రిత్వ శాఖ
నేడు సంస్థ 52 వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
ముందువరసలో కొనసాగేందుకు నిరంతర కృషి: 52 వ ఏజీఎంలో సంస్థ ఛైర్మన్
Posted On:
26 SEP 2024 1:44PM by PIB Hyderabad
న్యూఢిల్లీ లోఢీ రోడ్ లోని కంపెనీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్), సంస్థ 52వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. ‘సెయిల్’ ఛైర్మన్ శ్రీ అమరేందు ప్రకాష్ వీడియో మాథ్యమం ద్వారా కంపెనీ వాటాదార్లను ఉద్దేశించి ప్రసంగించారు.
“గత ఏడాది పనితీరుని, రాబోయే రోజుల్లో సంస్థకు గల అవకాశాలని పరిశీలిస్తే, ఈ రంగంలో నెంబర్ వన్ గా నిలిచే సత్తా మన సంస్థకు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు” అన్నారు. 2047 కల్లా ‘వికసిత్ భారత్’ ఆశయ సాకారంలో భాగంగా, దేశ సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలని మెరుగుపరచాలన్న భారత ప్రభుత్వ నిరంతర ప్రయత్నం వల్ల, వివిధ రంగాల్లో ఉక్కుకి భారీగా డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు.
2023-24 ఆర్ధిక సంవత్సరంలో సెయిల్ ఉత్పాదన వివరాలను అందిస్తూ.. 2024 ఆర్ధిక సంవత్సరంలో 20.5 మిలియన్ టన్నుల ద్రవరూప లోహం, 19.24 మిలియన్ టన్నుల ముడి లోహం, 18.44 మిలియన్ టన్నుల వాడకానికి సిద్ధంగా ఉన్న ఉక్కుని ఉత్పత్తి చేసి సంస్థ నూతన ప్రమాణాలని నెలకొల్పిందని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా విభాగాల్లో వరసగా 5.6%, 5.2%, 6.9% పెరుగుదల నమోదయ్యిందని చెప్పారు. ఇదే సంవత్సరంలో 1,04,545 కోట్ల వార్షిక టర్నోవర్ తో అత్యుత్తమ గణాంకాలని సెయిల్ సాధించిందని చెప్పారు.
ఉత్పాదక సామర్ధ్యాన్ని పూర్తిస్థాయిలో సాధించడం, వినియోగదారులకు ఉత్తమ ఉత్పత్తులని అందించడం అనే రెండు ముఖ్య లక్ష్యాల సాధనలో సెయిల్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందన్న ఛైర్మన్ “భాగస్వాములతో అనుసంధానాన్ని కొనసాగిస్తాం. వనరుల వినియోగాన్ని పెంచుకుంటూ, పరిశ్రమలో ముందువరసలో నిలిచేందుకు కృషి చేస్తాం’’ అని చెప్పారు.
***
(Release ID: 2059279)
Visitor Counter : 45