రక్షణ మంత్రిత్వ శాఖ
జైపూర్‌లో సైనిక పాఠశాలను లాంఛనంగా ప్రారంభించిన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్
“దేశభక్తి గల యువతను ఈ పాఠశాల అందిస్తుంది.
సాయుధ దళాల్లో చేరడానికి, మాతృభూమికి సేవ చేయడానికి సరైన మార్గనిర్దేశం చేస్తుంది”
“సైనిక పాఠశాల విద్యాసంబంధ జ్ఞానాన్ని అందించడంతోపాటు
Posted On:
23 SEP 2024 3:08PM by PIB Hyderabad
యువత సమగ్రాభివృద్ధి కోసం క్రమశిక్షణ, విలువలు, దేశభక్తి, ధైర్యాన్ని బోధిస్తుంది”
దేశవ్యాప్తంగా భాగస్వామ్య పద్ధతిలో 100 కొత్త సైనిక పాఠశాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో సైనిక పాఠశాలను సోమవారం రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ లాంఛనంగా ప్రారంభించారు. 100 పాఠశాల్లో 45 పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్జీవోలు, ప్రైవేటు పాఠశాలల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 40 పాఠశాలలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించగా, వీటిల్లో జైపూర్ పాఠశాల ఒకటి.
రాష్ట్రంలోని దేశభక్తి గలిగిన యువతకు ఈ పాఠశాల వరంగా మారుతుందని, సాయుధ దళాల్లో చేరడానికి, దేశానికి సేవ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, సరైన మార్గనిర్దేశం చేస్తుందని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. “మహారాణా ప్రతాప్, పృథ్విరాజ్ చౌహాన్, మహారాజ్ సూరజ్మల్, సవాయి జై సింగ్ లాంటి ధైర్యవంతుల నేల రాజస్థాన్. యువతరం సైన్యంలో చేరేందుకు ఈ వీరులే స్ఫూర్తి. మాతృభూమికి సేవ చేసేందుకు యువతకు ఈ కొత్త సైనిక పాఠశాల దిశానిర్దేశం చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
పీపీపీ పద్ధతిని సాధారణంగా ‘పబ్లిక్-ప్రైవేటు-పార్ట్‌నర్షిప్’ అని సంబోధిస్తుంటారని, అయితే ఇప్పుడు ఈ భాగస్వామ్యం నిర్దిష్ట అర్థం మార్చుకుంటున్నదని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. “ఇప్పుడు ప్రైవేటు రంగమే దేశ ఆర్థక వ్యవస్థకు చోదక స్థానంలో ఉంది. వ్యవసాయ, తయారీ, సేవా రంగాలకు గణనీయంగా దోహదపడుతోంది. ఈ కొత్త సైనిక పాఠశాలల ద్వారా ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు ఏకతాటి మీదకు వచ్చి మన భావి తరాలకు ఉత్తమ విద్యను అందిస్తాయి” అని ఆయన అన్నారు.
దేశాభివృద్ధికి విద్య అత్యంత ప్రాథమిక అంశమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి భరోసా కల్పిస్తూ దృఢమైన భావితరాన్ని తయారు చేయడంలో సైనిక పాఠశాలలు చేస్తున్న కృషిని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. సైనిక పాఠశాలలు కేవలం విద్యా సంబంధమైన జ్ఞానాన్ని అందించడంతో పాటు పిల్లల్లో క్రమశిక్షణ విలువలను, దేశభక్తినీ, ధైర్యాన్నీ నింపుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల సర్వతోముఖ వికాసం దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారిలో స్ఫూర్తిని నింపుతుందని ఆయన అన్నారు.
ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే త్రిపాఠి- రేవాలోని సైనిక పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులేనని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేవలం సాయుధ దళాలే కాకుండా విద్యార్థులు ఏ వృత్తినైనా ఎంచుకొని వారి మార్గంలో దేశానికి సేవ చేయవచ్చునని ఆయన అన్నారు. విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించేందుకు శ్రమించాలని, ఎప్పుడూ ఆశలు వదులుకోవద్దని సూచించారు.
ఇప్పటికే ఉన్న పద్ధతిలో నడుస్తున్న 33 సైనిక పాఠశాలలు కాకుండా భాగస్వామ్య పద్ధతిలో కొత్తగా 100 సైనిక పాఠశాలలు ఏర్పాటవుతున్నాయి. ఈ కొత్త పాఠశాలలు సంబంధిత విద్యా బోర్డులకు అనుబంధంగా ఉండటంతో పాటు సైనిక పాఠశాలల సోసైటీ ఆధ్వర్యంలో పని చేస్తాయి. సొసైటీ నియమ నిబంధనలు పాటిస్తాయి. అనుబంధ విద్యాబోర్డుల బోధనా ప్రణాళికను ఆచరిస్తూనే, అదనంగా సైనిక పాఠశాలకు సంబంధించిన బోధనా ప్రణాళిక (అకాడమిక్ ప్లస్ కరిక్యులం)ను కూడా విద్యార్థులకు అందిస్తాయి.
ఈ బోధనా ప్రణాళికలో భాగంగా- స్త్రీపురుష సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చర్చలు, నైపుణ్య శిక్షణ, బోధనేతర కార్యక్రమాలు, సమాజసేవ, శారీరక శిక్షణ, ఎన్సీసీ, విహార, విజ్ఞాన యాత్రలు, స్ఫూర్తివంతమైన ప్రసంగాలు వంటి విలువైన అంశాలు ఉంటాయి. దేశ పురోగతికి దోహదపడేలా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి భరోసా ఇవ్వడమే ఈ అకాడమిక్ ప్లస్ కరిక్యులం లక్ష్యం.
జైపూర్‌లోని శ్రీ భవానీ నికేతన్ పబ్లిక్ స్కూల్‌లో కొత్త సైనిక పాఠశాలను ఏర్పాటు చేసేందుకు శ్రీ భవానీ నికేతన్ శిక్షా సమితితో 2023 సెప్టెంబర్‌లో సైనిక పాఠశాలల సొసైటీ, రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం చేసుకున్నాయి.
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి శ్రీమతి దియా కుమారి, యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ రాథోడ్ (విశ్రాంత) తదితర ప్రముఖులు జైపూర్ సైనిక పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
****
(Release ID: 2058064)
Visitor Counter : 47