సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వేలంలో ఆకట్టుకోనున్న పారాలింపిక్ పోటీల క్రీడా స్మృతి చిహ్నాలు

Posted On: 16 SEP 2024 10:46PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికల ఈ-వేలాన్నికేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు  నిర్వహిస్తోంది.

న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో ఇ - వేలం గురించి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మీడియాకు వివరించారు. ఈ సేకరణ దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, చారిత్రిక, రాజకీయాల గొప్పదనానికి అద్దం పడుతుందని మంత్రి పేర్కొన్నారు. 600కు పైగా జ్ఞాపికలతో నిర్వహించనున్న ఈ భారీ వేలం ఆన్‌లైన్ వేదికగా ప్రజలకు అందుబాటులో ఉండనుంది. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్ https://pmmementos.gov.in/ ద్వారా నమోదు చేసుకుని పాల్గొనవచ్చు

ఈ వేలంలో దేశ యోధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు ఒక విభాగం నివాళి అర్పిస్తుంది. మన దేశ చరిత్రలోని సువర్ణాక్షరాలు లిఖించిన పారాలింపిక్ పోటీల క్రీడా స్మృతి చిహ్నాలు వేలంలో కీలకమని మంత్రి తెలిపారు.

ప్రధానమంత్రి పొందిన జ్ఞాపికలు, బహుమతులను మొదటిసారిగా 2019 జనవరిలో వేలం వేశారు. ప్రస్తుతం ప్రారంభం కానున్న ఈ-వేలం ఆరోది అని మంత్రి పేర్కొన్నారు. గత ఐదేళ్ల లో వేలం పాట ద్వారా రూ.50 కోట్లకు పైగా వసూలు అయ్యాయని చెప్పారు. గతంలో మాదిరిగానే, ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గంగా నది పరిరక్షణ, పునరుద్ధరణకు అంకితమైన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం 'నమామి గంగే' ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వేలం ద్వారా సమకూరిన నిధులు ఈ విలువైన లక్ష్యానికి మద్దతును అందిస్తాయని, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతను బలోపేతం చేస్తాయని మంత్రి తెలిపారు. ప్రజాసంక్షేమానికి దోహదపడే ఇ-వేలం పాట గొప్ప ప్రయోజనానికి ఉపయోగపడుతుందని, ప్రజలందరూ ఇందులో భాగం కావాలని మంత్రి కోరారు.

ఈ వేలంలో ప్రధాని వివిధ సందర్భాల్లో పొందిన  సంప్రదాయ కళారూపాలు, అద్భుతమైన చిత్రాలు, నైపుణ్యంతో  కూడిన శిల్పాలు, స్వదేశీ హస్తకళా  వస్తువులు, ఆకర్షణీయమైన జానపద, గిరిజన కళాఖండాలను ప్రదర్శించనున్నారు. ఈ సంపదలలో సంప్రదాయ అంగవస్త్రాలు, శాలువాలు, శిరస్త్రాణాలు, ఉత్సవాల్లో వినియోగించే కత్తులతో పాటు ప్రధాని పొందిన గౌరవ చిహ్నాలుగా సాంప్రదాయకంగా ఇచ్చిన  వస్తువులు ఉన్నాయి.

అయోధ్యలోని శ్రీరామ మందిరం, ద్వారకాలోని శ్రీ ద్వారకాధీష్ వంటి సునిశితంగా రూపొందించిన ఆలయ నమూనాలను కలిగి ఉన్న కళాఖండాలు ఇందులో ప్రత్యేకం. అదనంగా, వేలంలో హిందూ దేవతామూర్తుల అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. ప్రదర్శన ఈ వేలం పాటకు ఆధ్యాత్మిక కోణాన్ని జోడిస్తుంది.

పిచ్వాయ్ పెయింటింగ్స్ వంటి విశిష్ట కళాకృతులు ఎన్నో ప్రజలను ఆకట్టుకోనున్నాయి. ఖాదీ శాలువాలు, సిల్వర్ ఫిలిగ్రీ, మాతా ని పచేడి ఆర్ట్, గోండుల కళాకృతులు, మధుబని పెయింటింగ్ వంటి సృజనాత్మక వస్తువులు వీటిలో ఉన్నాయి. దేశ వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వస్తువులకు ఇది వేదికగా నిలువనుంది.

కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు  నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ లో ప్రముఖ సాండ్ ఆర్టిస్ట్ (ఇసుకతో బొమ్మలు వేసే కళాకారుడు), పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ సుదర్శన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను ప్రారంభించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించే విశ్వకర్మ దివస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుదర్శన్ పట్నాయక్ ఈ ప్రదర్శనలో ఇసుక, మట్టి మిశ్రమంతో చేసిన 2 వేల దీపాలను ఉపయోగించి ఒక అసాధారణ శిల్పాన్ని రూపొందించారు. ఇది విశ్వకర్మ స్ఫూర్తిని నెలకొల్పింది. అదేవిధంగా "వికసిత్ భారత్" (అభివృద్ధి చెందిన భారతదేశం) ఇతివృత్తాన్ని ప్రతిబింబిస్తుంది. కళాత్మకత, చిహ్నాల ఆకర్షణీయమైన సమ్మేళనానికి ఈ వేడుక కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఇది సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన కళానైపుణ్యాన్ని చూపడమే కాకుండా "వికసిత్ భారత్" ఆకాంక్షకు ఆధారమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను కూడా ప్రతిబింబిస్తుంది.


 

***


(Release ID: 2055860) Visitor Counter : 53