వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
సబ్సిడీపై ఉల్లి రిటైల్ విక్రయాలు: కేంద్రం చొరవతో తగ్గుతున్న ధర
వినియోగదారులకు తక్కువ ధరలో ఉల్లి- చౌక విక్రయ వ్యూహాలను అమలు చేస్తున్న వినియోగదారుల వ్యవహారాల శాఖ
Posted On:
14 SEP 2024 12:41PM by PIB Hyderabad
ఈ నెల అయిదో తేదీన మొబైల్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించడంతో కిలో 35 రూపాయల సబ్సిడీ ధరకు ఉల్లి రిటైల్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎన్ సీసీ ఎఫ్, నాఫెడ్ లకు చెందిన దుకాణాలు, మొబైల్ వాహనాల ద్వారా ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఉల్లి అమ్మకాలు ప్రారంభం కాగా, తరువాత చెన్నై, కోల్ కతా, పాట్నా, రాంచీ, భువనేశ్వర్, గౌహతి మొదలైన ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు విస్తరించారు.
ఈ చొరవ సానుకూల ఫలితాలను చూపించడం ప్రారంభించింది:
ప్రారంభ తేదీ (05.09.2024) - 13.09.2024 మధ్య…
ఢిల్లీ లో రూ.60 నుంచి రూ.55కు తగ్గిన ధర
ముంబయిలో రూ. 61 నుంచి రూ. 56 కు తగ్గిన ధర
చెన్నై లో రూ.65 నుంచి రూ.58 కి తగ్గిన ధర
పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడంతో పాటు ఉల్లి ధరలను మరింత తగ్గించడానికి, నిల్వలను, పంపిణీని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ – కామర్స్ తోపాటు , కేంద్రీయ భండార్, సఫల్ దుకాణాలలో చిల్లర అమ్మకాలను విస్తరించడంతో పాటు, వినియోగదారులకు తక్కువ ధరలకు ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడానికి పెద్ద మొత్తం అమ్మకపు వ్యూహాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే హోల్ సేల్ అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతాలకు, అంతిమంగా అన్ని రాష్ట్రాల రాజధానులకు కూడా హోల్ సేల్ అమ్మకాలను విస్తరించనున్నారు. ఈసారి హోల్ సేల్ ఉల్లి తరలింపు రోడ్డు రవాణా, రైల్వే రెండింటి ద్వారా జరుగుతోంది. ఈ చొరవ, రవాణా, నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, పంట కోత అనంతర నష్టాలను కూడా తగ్గిస్తుంది.
మారుతున్న సరఫరా- డిమాండ్ పరిస్థితులు, ధరల ధోరణుల ఆధారంగా లక్ష్య, స్థిరమైన సరఫరాను నిర్ధారించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ చౌకగా ఉల్లి లభించేలా చూడటమే ప్రభుత్వ అంతిమ లక్ష్యం. ఇందుకోసం ఉల్లి ధరలపై నిఘాను కొనసాగించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. వినియోగదారులపై మరింత ధరల భారం పడకుండా ధర ఎక్కువ ఉన్న చోట్ల పెద్దమొత్తంలో ఉల్లి లభ్యతకు చురుకైన నిర్ణయాలు తీసుకుంటోంది.
మెరుగైన చిల్లర, పెద్ద మొత్తం అమ్మకాల (రిటైల్, బల్క్ సేల్) వ్యూహాలతో పాటు అందుబాటులో ఉన్న 4.7 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వతోనూ, గత ఏడాదితో పోలిస్తే ఈ సారి పెరిగిన ఖరీఫ్ సాగు విస్తీర్ణంతోను రానున్న నెలల్లో ఉల్లి ధరలు పూర్తి అదుపులో ఉంటాయి.
***
(Release ID: 2055122)
Visitor Counter : 40