మంత్రిమండలి
పిఎం ఇ- డ్రైవ్ పథకానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం
పథకం కింద రెండేళ్లలో రూ.10,900 కోట్ల కేటాయింపు
పథకం కింద ఎలక్ట్రానిక్ వోచర్లు, విద్యుత్ వాహనాల కొనుగోలు ప్రక్రియ సులభతరమయ్యేలా క్రమబద్ధీకరణ
విద్యుత్ అంబులెన్స్ వాహనాలకు మార్గం సుగమం చేసిన పథకం, ఆరోగ్య రంగంలోకి ఈవీలను ప్రవేశపెడుతూ కీలక నిర్ణయం
హరిత ఆరోగ్య భద్రతా పరిష్కారాలకోసం కీలకమైన అడుగు
పాత ట్రక్కు స్థానంలో ఎలక్ట్రిక్ ట్రక్కు కొనుగోలు చేయడానికి అదనపు ప్రోత్సాహకాలు
పరీక్షా సంస్థల అభివృద్ధి కోసం రూ.780 కోట్ల నిధులు, వాహన పరీక్ష మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పథక రూపకల్పన
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచనున్న పథకం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచే పథకం
Posted On:
11 SEP 2024 8:13PM by PIB Hyderabad
దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడంకోసం 'పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకం' పేరుతో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఐ) చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం ఈ ఆమోదం తెలిపింది.
ఈ పథకం కింద రెండేళ్లపాటు రూ.10, 900 కోట్ల నిధులను కేటాయించనున్నారు. ఇందులోని ప్రదానమైన అంశాలు ఇలా వున్నాయి.
ఇ-2డబ్ల్యూలు, ఇ-3డబ్ల్యూలు, ఇ-అంబులెన్స్‌లు, ఇ-ట్రక్కులు, ఇతర అభివృద్ధి చెందుతున్న విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి రూ.3,679 కోట్ల విలువైన రాయితీలు /డిమాండ్ ప్రోత్సాహకాలను ఈ పథకం కింద అందిస్తారు. ఈ పథకం ద్వారా 24.79 లక్షల ఇ-2డబ్ల్యులు, 3.16 లక్షల ఇ-3డబ్ల్యులు, 14,028 ఇ-బస్సులు వినియోగంలోకి వస్తాయి.
ఈ పథకం కింద విద్యుత్ వాహనాల కొనుగోలుదారులు డిమాండ్ ప్రోత్సాహకాలను పొందేందుకుగాగాను ఎలక్ట్రానిక్ -వోచర్‌లను భారీ పరిశ్రమల శాఖ అందిస్తోంది. విద్యుత్ వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో కొనుగోలుదారు కోసం, పథకానికి సంబంధించిన పోర్టల్ అనేది ఆధార్ ధ్రువీకరించిన ఎలక్ట్రానిక్-వోచర్‌ను రూపొందిస్తుంది. ఇ-వోచర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి వీలుగా సంబంధిత లింక్ ను కొనుగోలుదారు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు పంపుతారు.
పథకం కింద డిమాండ్ ప్రోత్సాహకాలను పొందేందుకు ఈ ఇ-వోచర్ పై కొనుగోలుదారు సంతకం చేసి , డీలర్‌కు ఇస్తాడు. ఆ తర్వాత, ఇ-వోచర్‌పై డీలర్ సంతకం చేసి పిఎం ఇ-డ్రైవ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. సంతకం చేసిన ఇ-వోచర్ ను కొనుగోలుదారుకు, డీలర్‌కు ఎస్ ఎం ఎస్ ద్వారా పంపుతారు. పథకం కింద డిమాండ్ ప్రోత్సాహకాల రీయింబర్స్‌మెంట్‌ను వాహనాల తయారీదారులు క్లెయిమ్ చేయడానికి సంతకం చేసిన ఇ-వోచర్ అవసరం.
ఈ-అంబులెన్స్‌ల విస్తరణకోసం ఈ పథకం కింద రూ.500 కోట్లు కేటాయించారు.. రోగుల రవాణా కోసం సౌకర్యవంతమైన ఇ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఇ-అంబులెన్స్‌ల పనితీరు , భద్రతా ప్రమాణాలను కేంద్ర ఆరోగ్యశాఖ, కేంద్ర రోడ్డు రవాణాశాఖ ఇతర సంబంధిత వాటాదారులతో సంప్రదించి రూపొందించడం జరుగుతుంది.
ఎస్టీయులు/ప్రజా రవాణా సంస్థల ద్వారా 14,028 ఇ-బస్సుల సేకరణకు రూ.4,391 కోట్లు కేటాయించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణె, హైదరాబాద్ లాంటి 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న తొమ్మిది నగరాల్లో డిమాండ్ అగ్రిగేషన్ ను సిఇఎస్ ఎల్ ద్వారా చేస్తారు. రాష్ట్రాలతో సంప్రదించి నగరాల మధ్యన, రాష్ట్రాల మద్యన విద్యుత్ బస్సుల వినియోగాన్ని పెంచుతారు.
కేంద్ర రోడ్డు రవాణాశాఖ రూపొందించిన వెహికల్ స్క్రాపింగ్ స్కీమ్ మార్గదర్శకాలను అనుసరించి అధీకృత స్క్రాపింగ్ కేంద్రాల ద్వారా పాత ఎస్టీయు బస్సులను రద్దు చేసిన తర్వాత, విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తున్న ఆయా నగరాలు/రాష్ట్రాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి బస్సుల సంఖ్యను కేటాయిస్తారు.
వాయు కాలుష్యానికి ట్రక్కులు ప్రధాన కారణం. ఈ పథకం దేశంలో ఇ-ట్రక్కుల విస్తరణను ప్రోత్సహిస్తారు. ఇ-ట్రక్కులను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లు కేటాయించారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆమోదించిన వాహనాల స్క్రాపింగ్ కేంద్రాల నుండి స్క్రాపింగ్ సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తారు.
బహిరంగ ప్రదేశాలలో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటును ( ఎలక్ట్రిక్ వెహికల్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లు) పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా దీనికి సంబంధించి విద్యుత్ వాహనాల కొనుగోలుదారుల్లో ఉన్నఆందోళనను ఈ పథకం తగ్గిస్తోంది. ఈ ఈవీపీసీలను విద్యుత్ వాహనాల వినియోగం అధికంగా ఉన్నటువంటి ఎంపిక చేసిన నగరాల్లో, ఎంపిక చేసిన రహదారులపై ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద ఈ-4 డబ్ల్యు ల కోసం 22,100 ఫాస్ట్ ఛార్జర్‌లను, ఈబస్సుల కోసం 1800 ఫాస్ట్ ఛార్జర్‌లను, ఈ-2డబ్ల్యు/3డబ్ల్యుల కోసం 48,400 ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విద్యుత్ వాహనాల పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం రూ.2,000 కోట్లు వెచ్చిస్తారు.
దేశంలో పెరుగుతున్న విద్యుత్ వాహనావరణ( ఈవీ ఎకోసిస్టమ్) వ్యవస్థ దృష్ట్యా, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికిగాను నూతన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను నిర్వహించేలా భారీ పరిశ్రమలశాఖకు చెందిన టెస్ట్ ఏజెన్సీలను ఆధునికీకరిస్తున్నారు. రూ.780 కోట్లతో భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో టెస్టింగ్ ఏజెన్సీల ఆధునికీకరణకు ఆమోదం తెలిపారు.
ప్రజా రవాణా మార్గాలను ప్రోత్సహించడంద్వారా ఈ పథకం భారీస్థాయి రవాణాను ప్రోత్సహిస్తోంది. పిఎం ఇ-డ్రైవ్ పథకం ప్రాథమిక లక్ష్యం విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం. వాటి కొనుగోలు పెంచడానికి ముందస్తు ప్రోత్సాహకాలు అందిస్తారు. అంతే కాదు విద్యుత్‌వాహనాలకు అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. పిఎం ఇ - డ్రైవ్ పథకం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడంద్వారా, రవాణా వ్యవస్థ పర్యావరణానికి చేస్తున్న నష్టాన్ని తగ్గిస్తారు. గాలి నాణ్యతను మెరుగుపరచడం జరుగుతుంది.
సమర్థవంతమైన, పోటీతత్వాన్ని కలిగిన, దృఢమైన విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమను, తద్వారా ఆత్మనిర్భర్ భారత్‌ను ఈ పథకం ప్రోత్సహిస్తుంది. దేశీయ తయారీ, విద్యుత్ వాహనాల సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దశలవారీ తయారీ కార్యక్రమాన్ని అమలు చేయడంద్వారా దీన్ని సాధించవచ్చు.
పర్యావరణ కాలుష్యం, ఇంధన భద్రతకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి, అలాగే స్థిరమైన రవాణా పరిష్కారాలను ప్రోత్సహించడంలో గణనీయమైన పురోగతిని సాధించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఈ పథకం దాని పిఎంపీతో పాటు, విద్యుత్ వాహనాల రంగం, అనుబంధ సరఫరా వ్యవస్థలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఈ పథకం విలువ వ్యవస్థతో పాటు గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. తయారీ, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా ఉపాధి కల్పన కూడా ఉంటుంది.
*****
(Release ID: 2054088)
Visitor Counter : 184
Read this release in:
English
,
Urdu
,
Nepali
,
Hindi
,
Marathi
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam